Begin typing your search above and press return to search.

ఇద్దరి బ్యాటింగే ఇంతలా ఉంటే.. పెద్దాయన ఫీల్డ్ లోకి దిగితే?

శనివారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్ని చూసిన గులాబీ పరివారం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు

By:  Tupaki Desk   |   17 Dec 2023 5:25 AM GMT
ఇద్దరి బ్యాటింగే ఇంతలా ఉంటే.. పెద్దాయన ఫీల్డ్ లోకి దిగితే?
X

శనివారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్ని చూసిన గులాబీ పరివారం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారపక్షాన్ని తమ నాయకులు విజయవంతంగా అడ్డుకున్నారని.. ఇద్దరు స్టార్ బ్యాట్స్ మెన్ల ధాటికి కాంగ్రెస్ నేతలు తేలిపోయారని.. పంచ్ ల మీద పంచ్ లు వేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు.. పార్టీ నేతలకు సైతం నోట మాట రాకుండా చేశారన్న వాదనను వినిపిస్తున్నారు. తాజాగా జరిగిన సభ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సానుభూతిపరులు.. ఆ పార్టీ నాయకుల పోస్టులు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి.

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ పూర్తిగా అధికార.. ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధంగా మారింది. ఈ క్రమంలో అధికార పక్షం మాట్లాడేందుకు సమయం ఇవ్వటం.. వారు ఘాటు విమర్శలు చేసే వేళలో వేచి చూసే ధోరణిని అనుసరించటంతో అధిక్యతను ప్రదర్శించే అవకాశాన్ని ఇచ్చినట్లు అయ్యిందన్న మాట వినిపిస్తోంది.

పదేళ్లు అధికారంలో ఉన్న వేళలో.. ఏ రోజు కూడా విపక్షం నోటి నుంచి మాటలు రాకుండా ఉండేందుకు కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన విధానాల్ని రేవంత్ అనుసరించకపోవటం.. విపక్షాలు స్వేచ్ఛగా తమ వాదనల్ని వినిపించేందుకు అవకాశం.. తగిన సమయాన్ని ఇవ్వటం కూడా కాంగ్రెస్ తేలిపోవటానికి కారణమైందంటున్నారు. ఇదిలా ఉంటే.. అధికారపక్షాన్ని నిలువరించే విషయంలో తమ పార్టీ విజయవంతమైందని గులాబీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

తమ పార్టీకి చెందిన మాజీ మంత్రులు కేటీఆర్.. హరీశ్ రావులు ఇద్దరు అధికార పక్షాన్ని ముప్పతిప్పలు పెట్టారని పేర్కొన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు.. పెడుతున్న పోస్టులు పలువురిని ఆకర్షిస్తున్నాయి. ఇద్దరు స్టార్ బ్యాట్స్ మెన్లతోనే ఇలా ఉంటే.. పెద్దాయన ఫీల్డ్ లోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుంది? అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు.. టీవీలో సభను లైవ్ గా చూసిన వారికి.. ఎవరు అధికారపక్షం? ఎవరు విపక్షం? అన్న విషయం అర్థం కానట్లుగా మారిందని పేర్కొనటం గమనార్హం.