Begin typing your search above and press return to search.

తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి.. రేవంత్ సర్కార్ దూకుడు!

వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఎన్నికల సంగ్రామానికి సిద్ధమవుతోందని సంకేతాలు వెలువడుతున్నాయి.

By:  Tupaki Political Desk   |   18 April 2026 7:00 PM IST
తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి.. రేవంత్ సర్కార్ దూకుడు!
X

వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఎన్నికల సంగ్రామానికి సిద్ధమవుతోందని సంకేతాలు వెలువడుతున్నాయి. బీసీ రిజర్వేషన్లపై వివాదం కారణంగా గత సెప్టెంబరులో వాయిదా పడిన జడ్పీ, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది. కోర్టు అనుమతితో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించినట్లు వచ్చే నెలలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు చెబుతున్నారు.

ఓటర్ల జాబితాతోసహా ఎన్నికల నిర్వహణకు అన్ని సిద్ధంగా ఉండటంతో కోర్టు అనుమతి వచ్చిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. నిజానికి గత సెప్టెంబరులోనే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అయితే అప్పట్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో కోర్టు బ్రేక్ వేసింది. రాజ్యాంగ సవరణ చేస్తే కానీ బీసీ రిజర్వేషన్లను పెంచే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి యథావిధిగా పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిందని అంటున్నారు.

ప్రభుత్వ తాజా నిర్ణయంతో వచ్చే నెలలో ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటోందని చెబుతున్నారు. ముందుగా నవీకరించిన ఓటర్ల జాబితాల తయారీతోపాటు కొత్త ఓటర్ల నమోదుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 23లోగా కొత్త ఓటర్ల గుర్తింపు, జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల ఎంపిక వంటి పనులు అన్నీ పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రెడీ అవుతున్నట్లేనని అంటున్నారు. దీంతో చాలాకాలంగా పదవుల కోసం ఎదురుచూస్తున్న ద్వితీయ, తృతీయశ్రేణి నేతలు ఎన్నికల యుద్దానికి సిద్ధమవుతున్నారు.

2019 మే నెలలో చివరి సారిగా జడ్పీ, మండల పరిషత్ ఎన్నికలు జరిగాయి. గత ఏడాది జూన్ తో పాలవవర్గాల గడువు తీరిపోయింది. రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. దీంతో గత ఏడాది నుంచి జడ్పీ, మండల పరిషత్ లకు ప్రత్యేకాధికారులను నియమించింది. ఇలా నిలిపోయిన ఎన్నికల ప్రక్రియకు మళ్లీ చలనం తీసుకువచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో గ్రామస్థాయి నేతల్లో హడావుడి మొదలైంది.