రేవంత్ సర్కారులో మహిళలకు మరో ఆఫర్!
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలకు పెద్దపీట వేస్తూ.. వారి కోసం ప్రత్యేక పథకాల్ని తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కారు చేసిన ప్రయత్నాలు తెలిసిందే.
By: Tupaki Desk | 12 July 2025 9:49 AM ISTఅధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలకు పెద్దపీట వేస్తూ.. వారి కోసం ప్రత్యేక పథకాల్ని తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కారు చేసిన ప్రయత్నాలు తెలిసిందే. తాజాగా మరో ఆఫర్ కోసం కసరత్తు చేస్తోంది. త్వరలో దీనికి శ్రీకారం చుట్టనున్నట్లు చెబుతున్నారు. ఇంతకూ ఆ ఆఫర్ ఏమిటంటే.. ఆస్తుల రిజిస్ట్రేషన్ ను మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తే.. ఇప్పటివరకు వసూలు చేస్తున్న స్టాంప్ డ్యూటీ ఛార్జీలను తగ్గించాలన్నది రేవంత్ సర్కారు ఆలోచన.
ఇప్పటికే ఈ విషయాన్ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఎందుకీ స్కీం అంటే.. మహిళలపై స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు ఎక్కువ చేయాలన్నది ప్రభుత్వ భావన. మహిళల పేరుతోనూ ఆస్తిపాస్తుల్ని పెంచేందుకు ప్రభుత్వం తరఫు ప్రోత్సాహాన్ని అందించాలన్న ఉద్దేశంతో దీన్ని డిజైన్ చేశారు. ఇప్పటివరకు ఉన్న నిబంధన ప్రకారం స్థిరాస్తుల్ని రిజిస్ట్రేషన్ చేసుకునేవారు మహిళలైనా.. పురుషులైనా ఒకేలాంటి స్టాంప్ డ్యూటీని వసూలు చేసేవారు.
అందుకు భిన్నంగా మహిళలపై రిజిస్ట్రేషన్లను చేయిస్తే.. స్టాంప్ డ్యూటీలో రాయితీని ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేస్తోంది. తాజాగా వారి ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి అందజేశారు. దీని ప్రకారం ఆస్తి విలువ రూ.కోటి కంటే తక్కువ ఉంటే.. స్టాంప్ డ్యూటీని 0.5 శాతం తగ్గించాలని.. అదే ఆస్తి విలువ రూ.కోటిపైన ఉంటే ఒక శాతం స్టాంప్ డ్యూటీ ఛార్జీలను తగ్గించటం ద్వారా మహిళల పేరుతో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నది ప్రభుత్వ ఆలోచన. రిజిస్ట్రేషన్ల శాఖ చేసిన ప్రతిపాదనను యథాతధంగా అమలు చేస్తారా? లేక మరింత పెంచుతారన్నది తేలాల్సి ఉంది. ఈ కొత్త స్కీంను త్వరలోనే ప్రారంభిస్తారని చెబుతున్నారు.
