Begin typing your search above and press return to search.

టీడీపీకి ఊపిరిపోసిన హరీశ్ రావు.. చంద్రబాబు ఫుల్ హ్యాపీ..

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య నీళ్ల పంచాయితీలో అడ్డంగా బుక్ అయిపోయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్ద ఊరట లభించింది.

By:  Tupaki Political Desk   |   6 Jan 2026 6:36 PM IST
టీడీపీకి ఊపిరిపోసిన హరీశ్ రావు.. చంద్రబాబు ఫుల్ హ్యాపీ..
X

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య నీళ్ల పంచాయితీలో అడ్డంగా బుక్ అయిపోయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్ద ఊరట లభించింది. ఈ విషయంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి రేవంత్ రెడ్డి, చంద్రబాబు కారణం కాదని, ఆ ఘనత తమదని చెప్పుకోవడమే కాకుండా, అప్పటి వైసీపీ ప్రభుత్వంపై తాము లేఖల యుద్ధం చేసినట్లు వెల్లడించారు. దీంతో తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాటల ఆధారంగా ఏపీలో అధికార కూటమిపై విమర్శలు చేస్తున్న వైసీపీ తిరిగి ఆత్మరక్షణలోకి పడిపోయినట్లైందని అంటున్నారు.

తెలంగాణలో కృష్ణా జలాల వినియోగం, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు మందకొడిగా సాగడంపై బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. కృష్ణా జలాలను సమర్థంగా వాడుకోలేకపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి నష్టం చేస్తోందని ఆరోపిస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పై ఎదురుదాడికి దిగిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించడం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని, ఈ విషయం తెలిసి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. ఇదే సమయంలో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపామని, ఉభయ రాష్ట్రాల మధ్య జలవివాదాలు పరిష్కారమవ్వాలంటే ముందుగా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును నిలిపేయాలని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

అంతటితో ఆగకుండా తన కోరిక మేరకు చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిలిపేశారని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలతో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర విమర్శలకు గురైంది. ప్రధానంగా వైసీపీ, ఆ పార్టీకి అనుబంధంగా పనిచేసే సాక్షి, ఇతర సోషల్ మీడియాల్లో చంద్రబాబు సర్కారు రాయలసీమను నిర్లక్ష్యం చేస్తోందంటూ విమర్శలతో హోరెత్తిపోయింది. ఈ ప్రచారంతో ఆందోళనకు గురైన ప్రభుత్వం ఆఘమేఘాలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా, సుదీర్ఘ వివరణ ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వ వివరణకు తోడుగా బీఆర్ఎస్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊరట కల్పించింది.

తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ సభను బహిష్కరించింది. దీంతో ఈ విషయమై ఆ పార్టీ వాదన ఏంటో తెలియక కొంత గందరగోళానికి దారి తీసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఈ విషయంపై వివరణలు ఇచ్చినా, ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు మధ్య ఉన్న సంబంధాల కారణంగా ఆ వివరణకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయిందని అంటున్నారు. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ ఇచ్చిన పీపీటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నెత్తిన పాలుపోసినంత పనైందని అంటున్నారు.

తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగానే 2020లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గ్రీన్ ట్రిబ్యూనల్, సుప్రీంకోర్టుల్లో కేసులు వేశామని, తమ న్యాయపోరాటం వల్లే ప్రాజెక్టు పనులను అప్పటి జగన్ ప్రభుత్వం నిలిపివేసిందని తెలిపారు. అంతేకాకుండా ప్రాజెక్టుకు ప్రతిపాదిస్తున్న దశలోనే తాము అభ్యంతరాలు వ్యక్తం చేశామని, ఏకంగా 18 లేఖలు రాసి అనుమతులు ఇవ్వొద్దని కేంద్రంతో లేఖల యుద్ధం రాసినట్లు వివరించారు. తమ వాదనకు సంబంధించిన ఆధారాలను ప్రభుత్వ జీవోలు, లేఖల రూపంలో ప్రదర్శించారు. దీంతో రాయలసీమ లిఫ్ట్ పనులు రేవంత్ రెడ్డి చెప్పినట్లు కాకుండా, అంతకుముందే జగన్ రెడ్డి ప్రభుత్వంలోనే నిలిపివేయించామని హరీశ్ రావు తెలిపారు.

అయితే హరీశ్ ఇలా చెప్పడం వల్ల ఏపీ రాజకీయం తలకిందులైంది. ఇంతవరకు రేవంత్ రెడ్డి మాటలను పట్టుకుని అధికార పార్టీపై విమర్శల దాడి చేసిన విపక్ష వైసీపీ ఆత్మరక్షణలోకి వెళ్లిపోయిందని అంటున్నారు. రెండు రాష్ట్రాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులకు స్నేహ సంబంధాలు ఉన్నట్లే.. విపక్ష పార్టీల నేతల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ విషయంలో ఇరురాష్ట్రాల్లోనూ తమ సన్నిహితులకు వ్యతిరేకంగా మరో పార్టీ వ్యవహరించాల్సిన పరిస్థితి రావడం చర్చనీయాంశం అవుతోంది. తమ స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం పక్క రాష్ట్రంలో తమ మిత్రులను ఆయా పార్టీలు ఇరుకున పెట్టాల్సిన పరిస్థితులు నెలకొనడమే రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.