Begin typing your search above and press return to search.

మద్యం తాగితే రూ. లక్ష జరిమానా

ప్రత్యేకంగా మహిళలు ఈ తీర్మానాన్ని హర్షిస్తూ "ఇలా కొనసాగితే మాకూ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది" అని చెప్పారు. గ్రామాల్లోని యువత సైతం ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.

By:  Tupaki Desk   |   21 Jun 2025 3:00 PM IST
మద్యం తాగితే రూ. లక్ష జరిమానా
X

కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలంలోని మూడు గ్రామాలు గుండారం, ఎల్లాపూర్ తండా, నడిమితండా మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తూ అరుదైన నిర్ణయం తీసుకున్నాయి. గ్రామ సభలో గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఈ నిషేధానికి ముద్ర వేశారు.

గ్రామ పెద్దలు, మహిళలు, యువతితో పాటు పలు వర్గాల ప్రజలు ఈ నిర్ణయంలో పాల్గొన్నారు. “బెల్ట్ షాపులు యువతను చెడు మార్గంలో నెట్టేస్తున్నాయి. మద్యం తాగడం వల్ల కుటుంబాల్లో విభేదాలు, గొడవలు పెరుగుతున్నాయి. ఎన్నో బానిస జీవితం గడుపుతున్నారు” అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ తీర్మానాన్ని ఉల్లంఘించి ఎవరు మద్యం సేవించినా వారికి రూ. లక్ష జరిమానా విధించనున్నట్టు, అదనంగా 7 చెప్పుదెబ్బల శిక్ష కూడా అమలులో ఉంటుందని గ్రామ పెద్దలు ప్రకటించారు. ఈ చర్యలతో గ్రామాల్లో అప్పులు, గొడవలు, నేరాలు తగ్గుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.

మద్యపాన నిషేధంతో గ్రామంలో సామాజిక విలువలు, ఆరోగ్య పరిస్థితి మెరుగుపడతాయని, యువత విద్యాభిమానులు, సంపాదనపరులు అవుతారని గ్రామస్థులు ఆశిస్తున్నారు. ఈ నిర్ణయం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.

ప్రత్యేకంగా మహిళలు ఈ తీర్మానాన్ని హర్షిస్తూ "ఇలా కొనసాగితే మాకూ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది" అని చెప్పారు. గ్రామాల్లోని యువత సైతం ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.

ఈ విధంగా సామూహికంగా తీసుకున్న ఈ గట్టి నిర్ణయం కామారెడ్డి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.