Begin typing your search above and press return to search.

తెలంగాణలో వారి బాధ చూడలేకపోతున్నాం.. చివరికి పండగ రోజూ అదే పని!

సిద్దిపేట జిల్లా నంగునూరు ఆగ్రోస్ కేంద్రం వద్ద రైతులు భారీ సంఖ్యలో గుమిగూడారు. ఒకవైపు హోరున వర్షం కురుస్తున్నా రైతులు ఎవరూ లెక్కచేయడం లేదు.

By:  Tupaki Desk   |   27 Aug 2025 2:00 PM IST
తెలంగాణలో వారి బాధ చూడలేకపోతున్నాం.. చివరికి పండగ రోజూ అదే పని!
X

తెలంగాణలో యూరియా కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అదునులో వేయాల్సిన యూరియా తగిన సమయంలో అందుబాటులో లేకపోవడంతో పండగ నాడూ పడిగాపులు కాస్తున్నారు. ఒక వైపు వర్షం.. మరోవైపు ఊరంతా ఉత్సవాలు జరుగుతున్నా రైతులు మాత్రం యూరియా దుకాణాలు ముందు క్యూ కడుతున్నారు. యూరియా పంపిణీ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో రైతులు గుమిగూడుతుండటంతో కొందరు తెల్లవారు జామునే వస్తున్నారు.

సిద్దిపేట జిల్లా నంగునూరు ఆగ్రోస్ కేంద్రం వద్ద రైతులు భారీ సంఖ్యలో గుమిగూడారు. ఒకవైపు హోరున వర్షం కురుస్తున్నా రైతులు ఎవరూ లెక్కచేయడం లేదు. వర్షం అని లైను నుంచి తప్పుకుంటే తమకు యూరియా అందుతుందో లేదోనన్న బెంగ వారిలో కనిపిస్తోంది. పండుగ పూట అందరూ వినాయపూజలో ఉంటే రైతులు మాత్రం యూరియా కోసం వేచిచూడటం కలిచివేస్తోందని అంటున్నారు. యూరియా కేంద్రాల వద్దకు వేకువనే చేరుకుంటున్న రైతన్నలు గంటల తరబడి వరుసలో నిల్చొలేక తమ బదులుగా గొడుగులు, చెప్పులు, పట్టాదారు పుస్తకాలను పెడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

రోజంతా ఎదురుచూస్తే ఒకటి రెండు బస్తాలు మాత్రమే లభిస్తోందని, అది ఎటుకూ సరిపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతులు యూరియా కోసం నానా తిప్పలు పడుతుంటే, కొందరు వ్యాపారులు దొంగచాటుగా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని రైతులు అక్కడక్కడ ఆందోళన చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని, రంగారెడ్డి జిల్లా మర్పల్లిలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

వర్షాలు బాగా కురవడంతో తెలంగాణ వ్యాప్తంగా పంటల సాగు జోరందుకుంది. నీరు సరిపడా ఉండటంతో పంటలు ఏపుగా పెరిగాయి. ఈ దశలో పంటకు యూరియా తోడైతే మంచి దిగుబడి వస్తుందని రైతులు ఆశిస్తున్నారు. దీంతో యూరియాకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయిందని అంటున్నారు. వేల మంది రైతులు ఒకేసారి యూరియా కోసం వస్తుండటం, డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడే సొమ్ములు చేసుకోవాలని కొందరు తప్పుడు పనులు చేస్తుండటంతో అన్నదాతలకు యూరియా కష్టాలు ఎక్కువయ్యాయని అంటున్నారు.

ఈ దశలో యూరియా అందకపోతే పంట దిగుబడిపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. దిగుబడులు తగ్గి బియ్యం ధరలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండటంతో యూరియా సరఫరా పెద్ద రాజకీయ దుమారాన్ని రేపింది. రైతులు కష్టాలు మీరంటే మీరు కారణమంటూ అధికార, విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సరిపడా యూరియా సరఫరా చేయలేదని కాంగ్రెస్.. రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనమే కష్టాలకు కారణమని బీజేపీ పరస్పరం నిందించుకుంటున్నాయి. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, బీజేపీలను దోషిగా చూపే ప్రయత్నం చేస్తోంది. దీంతో యూరియా కష్టాలు మూడు పార్టీల మధ్య డైలాగ్ వార్ గా మారిందని అంటున్నారు.