వారి ప్రేమను పెద్దలు ఓకే చేసినా.. ఆర్థిక ఇబ్బందులు చంపేశాయి
వారిద్దరి ప్రేమను పెద్దలు సైతం ఒప్పేసుకున్నారు. ఇంకేముంది పెళ్లే తర్వాతే అనుకోవచ్చు.
By: Tupaki Desk | 4 May 2026 10:09 AM ISTవారిద్దరి ప్రేమను పెద్దలు సైతం ఒప్పేసుకున్నారు. ఇంకేముంది పెళ్లే తర్వాతే అనుకోవచ్చు. కానీ.. ఆర్థిక సమస్యలు ఆ కుర్రాడ్ని ఆత్మహత్య చేసుకునేలా చేస్తే.. తనను బాగా చూసుకోవటం కోసం కష్టపడి.. నిరాశతో తనవు చాలించిన ప్రియుడి బాటనే పట్టింది ప్రియురాలు. చివరకు వీరి ప్రేమకథ విషాద ఉదంతంగా మారింది. అయ్యో అనిపించే ఈ ట్రాజెడీ లవ్ స్టోరీలో అసలుసిసలు విలన్ డబ్బే. ప్రేమించిన ప్రియురాల్ని పెళ్లి చేసుకున్న తర్వాత చాలా బాగా చూసుకోవాలన్న ఆ కుర్రాడి కలలు తీరలేదు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో తనువు చాలించిన వైనం మనసంతా చేదుగా మారేలా చేసింది. తెలంగాణలోని రెండు గ్రామాల్లోని ఈ విషాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని పాతదాంరాజుపల్లికి చెందిన 22 ఏళ్ల సాయికుమార్, సిరిపూర్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల శ్రుతిలు ప్రేమించుకున్నారు. పెద్దలు కూడా వారి వివాహానికి అంగీకరించారు. దీంతో.. ఏడు నెలల క్రితం వారి ఎంగేజ్ మెంట్ పూర్తైంది. అయితే.. సాయికుమార్ ఇల్లు రేకుల షెడ్డు. ఇల్లు కట్టుకొని భార్యను కొత్త ఇంట్లో బాగా చేసుకోవాలన్న కోరిక బలంగా ఉండేది. ఇదే విషయాన్ని రెండు కుటుంబాలకు చెప్పిన అతను.. డబ్బు సంపాదన కోసం బహ్రెయిన్ వెళ్లాడు.
అక్కడ కూలి పనులు చేసుకుంటున్న సమయంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు.. పని ఒత్తిడిని భరించలేని అతను ఈ నెల మొదటి రోజున అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు. దీని గురించి తెలిసిన రెండు కుటుంబాల వారు షాక్ తినగా.. తీవ్ర మనస్తాపానికి గురైన శ్రుతి.. అదే రోజు అందరూ నిద్ర పోయిన తర్వాత ఇంట్లోని ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని తాను ప్రాణాలు తీసుకున్న వైనం అయ్యో అనిపించేలా మారటమే కాదు.. ఈ ఉదంతం గురించి విన్న వారంతా మనసంతా చేదుగా మారిపోయే పరిస్థితి.
