18 నెలలుగా అతీగతీ లేకుండా వదిలేస్తారా? తెలుగు తమ్ముళ్ల ఫైర్
టీడీపీ అధిష్టానంపై తెలుగు తమ్ముళ్లు ఫైర్ అవుతున్నారు. 18 నెలలుగా తమను అనాథలుగా వదిలేశారని మండిపడుతున్నారు.
By: Tupaki Desk | 24 April 2025 11:00 PM ISTటీడీపీ అధిష్టానంపై తెలుగు తమ్ముళ్లు ఫైర్ అవుతున్నారు. 18 నెలలుగా తమను అనాథలుగా వదిలేశారని మండిపడుతున్నారు. అదిగో.. ఇదిగో అంటూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప, తమకు న్యాయం చేయడం లేదని తీవ్రంగా మదనపడుతున్నారు. తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని తలబాదుకుంటున్నారు. పార్టీ అధికారంలో ఉండగా, కార్యకర్తలు ఇంతలా బాధపడటం ఏంటి అనుకుంటున్నారా? నిజమే పార్టీ ఏపీలో అధికారంలో ఉన్నా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఒకప్పుడు తిరుగులేని బలం ఉండేది. ఆ పార్టీ అవిర్భావం తర్వాత తెలంగాణలో మెజార్టీ నియోజకవర్గాలు కంచుకోటగా నిలిచాయి. రాష్ట్ర విభజన తర్వాత పార్టీ తలరాత పూర్తిగా తలకిందులైనా.. కార్యకర్తలు మాత్రం పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. అవకాశం వస్తే తామేంటో నిరూపించుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు టీడీపీ నుంచి నేతల వలసలను ప్రోత్సహించి పార్టీని కోలుకోనీయకుండా దెబ్బతీసినా, క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం మాత్రం ఏ మాత్రం చెక్కు చెదరలేదనే అభిప్రాయం ఉంది.
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, పాలమూరు జిల్లాలతోపాటు హైదరాబాద్ నగరంలో చాలా నియోజకవర్గాల్లో టీడీపీ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. సొంతంగా విజయం సాధించే శక్తి లేకపోయినా ఆ పార్టీ ఓటు బ్యాంకుతో ఫలితాన్ని తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేస్తే మరింత శక్తి కూడదీసుకుని పోరాడుతామని క్యాడర్ చెబుతున్నా, అధిష్టానం మాత్రం పెడచెవిన పెడుతోందని నిరసన వ్యక్తమవుతోంది.
ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల నుంచి తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ అయినట్లే కనిపిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు పార్టీ దూరంగా ఉండిపోవడంతో అప్పట్లో అధ్యక్షుడుగా పనిచేసిన కాసాని జ్ఞానేశ్వర్ తన పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇక ఆ తర్వాత నుంచి పార్టీకి నూతన అధ్యక్షుడిని నియమించకుండా అధినేత చంద్రబాబు వదిలేశారు.
ఏపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తెలంగాణలోనూ పార్టీ విస్తరణకు పనిచేస్తామని, త్వరలో తెలంగాణ పార్టీ అధ్యక్షుడిని నియమిస్తామని చెప్పినా ఇంతవరకు అతీగతీ లేకుండా పోయిందంటున్నారు. దాదాపు 18 నెలలుగా తెలంగాణ టీడీపీ చుక్కాని లేని నావలా ఏ దిక్కున నడవాలో తెలియని అయోమయాన్ని ఎదుర్కొంటోంది. మాజీ మేయర్ తీగల క్రిష్ణారెడ్డి, నందమూరి హరిక్రిష్ణ కుమార్తె సుహాసిని తదితరులను పార్టీ అధ్యక్షులుగా నియమిస్తారని ప్రచారం జరిగినా, ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.
ఈ పరిస్థితుల్లో తెలంగాణలో టీడీపీని కాపాడుకోవాలనే ఆలోచన అధినేత చంద్రబాబుకు ఉందా? లేదా? అనేది కూడా అర్థం కావడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. త్వరగా పార్టీ అధ్యక్షుడిని నియమిస్తే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొట్లాడే అవకాశం ఉంటుందని, ప్రస్తుతం బీఆర్ఎస్ ఉన్న పరిస్థితుల్లో కొందరు పాత నేతలు మళ్లీ సొంత గూటికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే పార్టీకి అధ్యక్షుడు లేకపోవడంతో ఎవరి నాయకత్వం కింద పనిచేయాలో తెలియక వద్దామని అనుకున్న వారు సైతం మిన్నకుండిపోతున్నారని అంటున్నారు. ఏదైనా సరే తెలంగాణలో పార్టీని బతికించుకోవాలంటే తక్షణం అధ్యక్షుడిని నియమించాల్సివుంటుందని అంటున్నారు.
