Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా చెలగాటం.. రేవంత్ సర్కారుకు ప్రాణ సంకటం

చాలాకాలంగా తెలంగాణలో సోషల్ మీడియాతో ప్రభుత్వం యుద్ధం చేయాల్సివస్తోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన మీడియాకైనా, సోషల్ మీడియాకైనా హైదరాబాదే కేంద్రంగా ఉంటోంది.

By:  Tupaki Desk   |   8 April 2025 8:00 PM IST
సోషల్ మీడియా చెలగాటం.. రేవంత్ సర్కారుకు ప్రాణ సంకటం
X

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సోషల్ మీడియా అటాక్ తీవ్ర తలనొప్పిగా మారింది. 15 నెలల క్రితం వరకు సోషల్ మీడియా వాడకంలో ఆరితేరిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ అస్త్రాన్ని కోల్డ్ స్టోరేజిలో పెట్టడంతో ప్రత్యర్థులకు అడ్డంగా దొరికిపోతున్నారని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ సోషల్ సైనికుల అటాక్ తో కాంగ్రెస్ ప్రభుత్వం విలవిల్లాడిపోతోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహకరణ కంచ గచ్చిబౌలి భూ వివాదమే అంటున్నారు. కంచ గచ్చిబౌలిలో బుల్డోజర్ తో కూల్చివేతలు అంటూ ఏఐ జనరేటెడ్ ఫొటోలు పెద్ద ఎత్తున ప్రచారంలోకి రావడం, సుప్రీంకోర్టు కూడా సుమోటాగా స్పందించడం ప్రభుత్వానికి చికాకు తెచ్చింది. దీనిపై సీరియస్ అయిన సీఎం సోషల్ మీడియాను అదుపు చేయాలని నిర్ణయించారంటున్నారు. అయితే 15 నెలల క్రితమే తాను దిగిపోయిన పులిపై మళ్లీ స్వారీ చేయడం అంటే అంత ఈజీనా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

చాలాకాలంగా తెలంగాణలో సోషల్ మీడియాతో ప్రభుత్వం యుద్ధం చేయాల్సివస్తోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన మీడియాకైనా, సోషల్ మీడియాకైనా హైదరాబాదే కేంద్రంగా ఉంటోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం మరింత ఎక్కువ ఇబ్బందులు పడుతోంది. చీమ చిటుక్కుమన్నా హైదరాబాదులో ఉండే సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తుండటంతో ప్రభుత్వంపై నెగిటివ్ టాక్ ఎక్కువైపోతోంది. వాస్తవానికి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు అమలు చేయడంతోపాటు ఊహించని విధంగా పథకాలు అమలు చేస్తున్నా, పాజిటివ్ ప్రచారం చేసుకోలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో జరుగుతున్న చెబు ప్రచారాన్ని కట్టడి చేయలేకపోవడమే అని అంటున్నారు.

ప్రస్తుతం రాజకీయాలు అన్నీ సోషల్ మీడియా వేదికగానే తిరుగుతున్నాయి. ప్రభుత్వమైనా, ప్రతిపక్షమైనా తాము ఏం చేసిన సోషల్ మీడియా ద్వారానే చెప్పుకోవాల్సివస్తోంది. గతంలో ప్రభుత్వం తన పథకాలు చెప్పుకోడానికి ప్రజల వద్దకు వెళ్లడంతోపాటు బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించేది. అదే ప్రతిపక్షమైతే రోడ్డెక్కి పోరాడేది. కానీ ఇప్పుడు ఎవరైనా సోషల్ మీడియాలోనే తమ వాదన వినిపించాల్సివస్తోంది. ఈ వేదికను సమర్థంగా వినియోగించుకున్నవారే ప్రజల ఆదరణ పొందుతున్నారని విశ్లేషణలు ఉన్నాయి. మరోవైపు గత రాజకీయాలకు సోషల్ మీడియా యుగంలోని పాలిటిక్స్కు మధ్య ఉన్న వ్యత్యాసం కూడా ప్రభావం చూపుతుంది. గతంలో నైతిక ప్రమాణాలు, సిద్ధాంతాలు, కట్టుబాట్లు, ఆచారాలు వంటివి పాటించేవారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో అలాంటి పద్ధతులకు ఈసుమంతైనా చోటు ఉండటం లేదు. దీంతో విలువలు పాటించేవారు ఇక్కడ వెనక్కి పోతున్నారంటున్నారు. అలా అని సోషల్ మీడియాలో విర్రవీగిన వారు అడ్రస్ లేకుండా పోతున్నారు. దీనికి ఏపీలోని ఓ పార్టీని ఉదహరిస్తున్నారు. దీంతో సోషల్ మీడియా మేనేజ్మెంట్ అనేది ఓ కళగా మారుతోంది. ఈ విషయంలో తెలంగాణలో అధికార పార్టీ కన్నా ప్రతిపక్షం బలంగా ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ప్రధాన మీడియా మాదిరిగా సోషల్ మీడియాకు రూల్స్ అంటూ ఏవీ అడ్డు లేకపోవడం కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతోందని అంటున్నారు. ప్రభుత్వంపై అపోహలు పెంచడమే టార్గెట్ గా పెట్టుకున్న సోషల్ మీడియాను అడ్డుకోడానికి ప్రభుత్వం కేసులు పెడుతున్నా, వెంటనే బెయిల్ తెచ్చుకుంటున్న వారు మళ్లీ తమ ప్రతాపం చూపుతుండటం, ఈ లోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోందని అంటున్నారు. దీంతో రేవంత్ ప్రభుత్వం చేసిన మంచిని చెప్పుకోలేకపోతోందని అంటున్నారు. తాజాగా రాష్ట్రంలో తెల్లకార్డు దారులు అందరికీ సన్నబియ్యం పంపిణీ చేసిన గొప్ప కార్యక్రమంపైనా పెద్దగా ప్రచారం చేసుకోలేకపోయిందని అంటున్నారు. లక్షల మంది పేదలకు ప్రయోజనం దక్కిన ఆ పథకం కన్నా, సోషల్ మీడియా ప్రచారం చేస్తున్న అభూత కల్పనలే పెద్దగా ప్రచారం జరుగుతున్నాయంటున్నారు.

ఏదైనా విషయాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయాలంటే దాన్ని వైరల్ చేయాలని ముందుగా నిర్ణయించుకుంటారు. అలా నిర్ణయించుకున్న అంశం నిజమా, కాదా అనే నిర్ధారణ ఎవరికీ ఉండటం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులు ఈ విషయాన్ని చక్కగా అమలు చేస్తున్నారు. రేవంత్ ప్రమాణం చేసిన వెంటనే ఇక రాష్ట్రంలో కరెంటు ఉండదు అన్న భావనను వ్యాప్తి చేశారు. కరెంటు కోతలు లేకుండా పాలన సాగిస్తున్నా, ఎక్కడో ఓ చోట అవాంతరం ఎదురైతే దాన్నే హైలెట్ చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ అనుకూల సోషల్ సైన్యం వైఫల్యం ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు. ప్రతిపక్షంలో ఉండగా, సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగలు ద్వారా సోషల్ మీడియాను సమర్థంగా వాడుకునేవారు. కానీ, ఇప్పుడెందుకనో సీఎం తన అమ్ముల పొదిలో అస్త్రాన్ని సరిగా వాడుకోలేకపోతున్నారని అంటున్నారు. అందుకే చేసిన మంచిని చెప్పుకోలేక, చేయని తప్పులకు కూడా మూల్యం చెల్లించుకోవాల్సివస్తోందని అంటున్నారు.