Begin typing your search above and press return to search.

షాబాద్‌ను వణికించిన నరరూప రాక్షసుడి కథకు ముగింపు.. రాజ్ కుమార్ అంతమయ్యాడిలా..

తెలుగు రాష్ట్రాలను తీవ్ర కలవరానికి గురిచేసి.. అమాయకుల రక్తంతో షాబాద్‌ ప్రాంతాన్ని తడిపిన ఆ నరరూప రాక్షసుడి ఆట ముగిసింది.

By:  Tupaki Political Desk   |   13 July 2026 4:30 PM IST
షాబాద్‌ను వణికించిన నరరూప రాక్షసుడి కథకు ముగింపు.. రాజ్ కుమార్ అంతమయ్యాడిలా..
X

తెలుగు రాష్ట్రాలను తీవ్ర కలవరానికి గురిచేసి.. అమాయకుల రక్తంతో షాబాద్‌ ప్రాంతాన్ని తడిపిన ఆ నరరూప రాక్షసుడి ఆట ముగిసింది. గత కొన్ని రోజులుగా ప్రజల గుండెల్లో గుబులు రేపుతూ పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన షాబాద్‌ ఆరు హత్యల కేసు ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ (29) ఇక లేడు. 14 ప్రత్యేక పోలీసు బృందాల కళ్లు గప్పి తిరిగిన ఈ నరహంతకుడి ప్రాణం.. చివరికి ఒక నిర్జీవ దేహంగా మారి పొలాల మధ్య తేలింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ పరిసరాల్లో రాజ్‌కుమార్ మృతదేహం లభించడంతో ఈ సంచలన ఉదంతం ఊహించని మలుపు తిరిగింది.

భయానికి ముగింపు.. కానీ గుండెకోత మిగిలే ఉంది

స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అక్కడ పడి ఉన్న శవం మరెవరిదో కాదు.. తాము గాలిస్తున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రాజ్‌కుమార్‌దేనని నిర్ధారించారు. మృతదేహం పక్కనే లభించిన విషం బాటిల్ అతడు పోలీసులకు దొరకకుండా ఆత్మహత్య చేసుకుని ఉంటాడనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అయితే ఇది నిజంగానే ఆత్మహత్యేనా? లేక దీని వెనుక మరేదైనా కోణం ఉందా? అనేది పోస్టుమార్టం నివేదిక వచ్చాకే తేలనుంది.

ఆరు ప్రాణాలు.. అంతులేని విషాదం:

ఒక పోక్సో కేసులో నిందితుడిగా చేర్చారని పగతో రగిలిపోయి వరుసగా ఆరు అమాయక ప్రాణాలను అత్యంత దారుణంగా బలిగొన్న రాజ్‌కుమార్ క్రూరత్వానికి షాబాద్‌ నివ్వెరపోయింది. అడవులు, కొండలు, శ్రీశైలం పరిసరాలంటూ పోలీసులు జల్లెడ పట్టినా దొరకని ఈ కిరాతకుడు.. చివరకు ఇలా విగతజీవిగా మారడం స్థానికులకు కొంత ఉపశమనాన్ని ఇచ్చినా అతడు మిగిల్చిన గాయం మాత్రం అంత సులభంగా మాననిది.

దర్యాప్తులో ముమ్మరమైన ఫోరెన్సిక్ విశ్లేషణ

ప్రస్తుతం సంఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ నిపుణులు క్లూస్ సేకరిస్తున్నారు. నిందితుడి మృతితో ఈ కేసు ముగిసిపోయినట్లు భావించినా చట్టపరంగా పూర్తి నిజాలు బయటకు రావాల్సి ఉంది.

తీరని లోటు.. మాయని గాయం

రాజ్‌కుమార్ అంతంతో షాబాద్‌ను వణికించిన ఒక నల్లటి అధ్యాయానికి తెరపడింది. నిందితుడి వేటకైతే ముగింపు దొరికింది కానీ అతడి రాక్షసత్వానికి బలైన ఆ ఆరు కుటుంబాల ఆక్రందనలకు.. వారు అనుభవిస్తున్న గుండెకోతకు పరిహారం ఎక్కడిది? చట్టం నుంచి తప్పించుకోవడానికి విషం తాగి ప్రాణాలు తీసుకున్నా ఆ బాధితుల శాపనార్థాల నుంచి అతడు తప్పించుకోలేకపోయాడంటూ స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాత పోలీసులు ఈ మరణం వెనుక ఉన్న పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.