జీఎస్టీ తగ్గింపు తెలంగాణలో చర్చ.. కేంద్రం తగ్గించిన భారాన్ని రాష్ట్రం మోపుతుందా..?
ట్రంప్ సుంకాల పెంపుతో భారత్ అతిపెద్ద నిర్ణయం తీసుకుంది. ఇది ఇప్పటి నిర్ణయం కాకపోయినా ట్రంప్ చర్చలతో ముందుకు వచ్చిందని చెప్పవచ్చు.
By: Tupaki Desk | 20 Sept 2025 1:36 PM ISTట్రంప్ సుంకాల పెంపుతో భారత్ అతిపెద్ద నిర్ణయం తీసుకుంది. ఇది ఇప్పటి నిర్ణయం కాకపోయినా ట్రంప్ చర్చలతో ముందుకు వచ్చిందని చెప్పవచ్చు. భారత ప్రభుత్వం జీఎస్టీని భారీగా తగ్గించింది. ప్రజలు వినియోగించే చాలా వస్తువులపై జీఎస్టీని తగ్గించింది. దీని ప్రభావం ఆటో మొబైల్ రంగంపై కూడా ఉండడంతో కార్లు, బైకుల రేట్ల ఆశించినంత మేరకు దిగుతున్నాయి. ముఖ్యంగా కార్ల రేట్లు లక్ష నుంచి లక్షన్నర వరకు తగ్గే అవకాశం ఉందని ప్రముఖ కంపెనీలు చెప్తున్నాయి. కార్ల తయారీ కంపెనీలైన మారుతీ సుజుకీ, మహీంద్ర, హుండాయ్ తో పాటు టాటా, తదితర పెద్ద పెద్ద లగ్జరీ కార్ల కంపెనీలు కూడా సవరించిన రేట్లతో మార్కెట్లోకి వస్తున్నాయి. తగ్గించిన ధరలు ఈ నెల (సెప్టెంబర్) 22వ తేదీ నుంచి అమలవుతున్న నేపథ్యంలో దసరా, దీపావళి సేల్స్ లో ఎక్కువగా వాహనాలను అమ్ముకోవాలని కంపెనీలు తగ్గించిన ధరలతో పాటు ఆఫర్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.
అయితే కొనుగోలు దారుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కనికరించలేదని చెప్పవచ్చు. ఎందుకంటే కేంద్రం తగ్గించిన ధరలను సొమ్ము చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై ప్రత్యేక సెస్ విధించాలని కేంద్రం ప్రతిపాదించింది. రోడ్ సేఫ్టీ పేరుతో ఈ భారాన్ని రాష్ట్రంపై మోపబోతోంది. ఇప్పటికే లైఫ్ ట్యాక్స్, ఇన్య్సూరెన్స్, రిజిస్ట్రేషన్ పేరుతో ఎంతో కొంత కడుతూనే ఉన్నాం.. ఇప్పుడు లైఫ్ ట్యాక్స్ పేరుతో సెస్ కూడా వారి నెత్తిన పడుతుంది. దీనికి సంబంధించి ప్రతిపాదన తేగా మంత్రివర్గం కూడా అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయా వాహనాల రేంజ్ ను బట్టి రూ. 2వేల నుంచి రూ. 10వేల వరకు కూడా రోడ్ సేఫ్టీ సెస్ ఉండచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సెస్ ద్వారా ఏడాదికి తెలంగాణకు రూ. 270 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అంటున్నారు. వ్యక్తిగత వాహనాలైన కార్లు, పికప్ వెహికిల్స్, టెంపోలపై ఈ భారం పడుతుంది. రైతులకు సంబంధించి సాగు రంగంలో తీసుకొనే వాహనాలకు ఇది ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
అయితే తెలంగాణ ప్రభుత్వం రోడ్ సేఫ్టీ సెస్ రూపంలో వసూలు చేసే డబ్బును రోడ్డు మరమ్మతు, రోడ్డు భద్రత లాంటి వాటికి ఉపయోగించవచ్చని తెలుస్తోంది. రోడ్లను విస్తరించడం, డ్రైవర్లకు భద్రతపై శిక్షణ, ఇలా సేఫ్టీ మేజర్‌మెంట్స్ కోసం ఉపయోగిస్తుందని ప్రభుత్వం పెద్దల నుంచి వినిపిస్తోంది. ఏది ఏమైనా కేంద్రం తగ్గించిన భారాన్ని రాష్ట్రం మోపడంపై కొన్నిచోట్ల పెదవి విరుపులు కనిపిస్తున్నా.. మరికొన్ని చోట్ల మన భద్రతకే అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కోసం తీసుకునే వారు మాత్రం ఆందోళన చెందుతున్నారు.
