హరీష్ రావును కలిసిన ఈటల? కేసీఆర్‌తో ఫోన్‌లో చర్చ? నిజమెంత?
బీజేపీ-బీఆర్ఎస్ మధ్య గల నిజమైన సంబంధాన్ని రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు బయటపెట్టాయని మహేష్ గౌడ్ విమర్శించారు.
By: Tupaki Desk | 31 May 2025 8:00 AM ISTతెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావుల మధ్య రహస్య భేటీ జరిగిందని, అనంతరం మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుతో ఫోన్‌లో మాట్లాడారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు.
ఈ సమావేశం, ఫోన్ సంభాషణ వెనుక కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అక్రమాల విచారణే కారణమని గౌడ్ వెల్లడించారు. కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న పి.సి. ఘోష్ కమిషన్ ఎదుట హాజరుకానున్న కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ తమ స్టేట్‌మెంట్‌లను సమన్వయపరచుకునే ఉద్దేశంతోనే ఈ భేటీ జరిగిందని ఆయన ఆరోపించారు.
ఈటల రాజేందర్ నిజంగా ప్రధాని నరేంద్ర మోదీ మనిషి అయితే కమిషన్ ముందు నిజం చెప్పాలని గౌడ్ డిమాండ్ చేశారు. లేకపోతే, కేసీఆర్‌కు మద్దతు ఇచ్చి బీజేపీని వ్యతిరేకిస్తారా అని సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల, 2021లో బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. హరీష్ రావు సైతం బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక, నీటిపారుదల శాఖలను నిర్వహించారు.
-బీజేపీ-బీఆర్ఎస్ మధ్య గల సంబంధంపై అనుమానాలు
బీజేపీ-బీఆర్ఎస్ మధ్య గల నిజమైన సంబంధాన్ని రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు బయటపెట్టాయని మహేష్ గౌడ్ విమర్శించారు. "బీజేపీకి పెద్ద ప్యాకేజ్ వస్తే వాళ్లు బీఆర్ఎస్‌లో చేరతారు" అనే రాజా సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు సైతం ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయని గౌడ్ అన్నారు. బండి సంజయ్‌ను రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుండి తొలగించడం కూడా బీఆర్ఎస్‌తో స్నేహం పెంచుకోవడానికి తీసుకున్న చర్యగా ఆయన అభివర్ణించారు.
"ఆపరేషన్ సింధూర్"పై మోడీ ప్రభుత్వాన్ని నిలదీసిన గౌడ్
అంతేకాదు, "ఆపరేషన్ సిందూర్" ద్వారా దేశానికి ఏం లాభం, ఏం నష్టం జరిగిందో ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రజలకు వివరించాలని గౌడ్ డిమాండ్ చేశారు. భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు జోక్యం కల్పించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. "దేశ ప్రజల కంటే రాహుల్ గాంధీపై విమర్శలు చేయడమే మోదీ ప్రభుత్వానికి ముఖ్యమా?" అని ఆయన ఎద్దేవా చేశారు.
మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో, ఈటల రాజేందర్, హరీష్ రావు, కేసీఆర్ దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
