Begin typing your search above and press return to search.

పొలిటికల్ లాజిక్ : బీఆర్ఎస్ తగ్గితే టీడీపీ హెచ్చుతుందా ?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఒక సభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ రానున్న కాలంలో రాజకీయ తెర మీద కనిపించకుండా కనుమరుగు అవుతుందని జోస్యం చెప్పారు.

By:  Tupaki Desk   |   5 Sept 2025 7:45 AM IST
పొలిటికల్ లాజిక్ : బీఆర్ఎస్ తగ్గితే టీడీపీ హెచ్చుతుందా ?
X

రాజకీయాలలో లెక్కలు చాలా తమాషాగా ఉంటాయి. అక్కడ ఒకటి ప్లస్ ఒకటి అన్నది రెండు అంటే కుదరదు. అది రెండూ కావచ్చు లేదా జీరో కూడా కావచ్చు. ఇక రాజకీయాల్లో శూన్యత ఎపుడూ ఉండదు, ఒకవేళ తాత్కాలికంగా వచ్చినా దానిని భర్తీ చేసేందుకు వేరే పార్టీ రెడీగా ఉంటుంది. పాలిటిక్స్ అంటేనే అది. నిరంతరం పోటీ ఉంటుంది. ఎవరు చాన్స్ తీసుకుంటారో వారే సక్సెస్ అయినట్లుగా లెక్క. మరి ఏపీ రాజకీయాలు వెరీ క్లియర్ గా ఉన్నాయి. ఇక్కడ అధికార కూటమిలో మూడు పార్టీలుగా తెలుగుదేశం బీజేపీ జనసేన ఉన్నాయి. విపక్షంలో వైసీపీ గట్టిగా ఉంది. కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఉనికి పోరాటం చేస్తున్నాయి.

తెలంగాణాలో రాజకీయ చిత్రం :

ఇక తెలంగాణాలో చూస్తే కనుక అధికారంలో కాంగ్రెస్ ఉంది. ఆ పార్టీ అత్యంత బలంగా ఉంది. విపక్షంలోనే అయోమయం ఉంది. ఇది ఎందుకు అంటే బీఆర్ఎస్ సహజంగానే బలమైన పార్టీ. ఈ రోజుకీ గ్రౌండ్ లెవెల్ లో బూత్ లెవెల్ లో అన్ని చోట్లా ఉన్న పార్టీ అది. కానీ ఆ పార్టీ ఓటమి తరువాత గత రెండేళ్ళుగా గ్రాఫ్ అయితే పెద్దగా పెరిగింది లేదు అని అంటున్నారు. అంతే కాదు ఇబ్బందులు అధికం అవుతున్నాయని చెబుతున్నారు. సెల్ఫ్ గోల్స్ ఎక్కువైపోతున్నాయి. ఎటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ నే గట్టిగా టార్గెట్ చేయడం వల్ల కకావికలం అవుతోంది.

బీఆర్ఎస్ కి బిగ్ ట్రబుల్స్ :

బీఆర్ఎస్ లో చూస్తే రానున్న కాలంలో అనేక భారీ సవాళ్ళు ఉన్నాయని అంటున్నారు. రేవంత్ రెడ్డి సీఎం గా ఉండడంతో బీఆర్ఎస్ కి డైరెక్ట్ ఎటాక్ గా పరిస్థితి ఉంది. ఇంతకు ఇంత అన్నట్లుగా అక్కడ రాజనీతి అమలు అవుతోంది. అదే సమయంలో చూస్తే కనుక బీఆర్ఎస్ లో కేసీఆర్ ఫాం హౌస్ కి పరిమితం కావడం ఆయన రాజకీయ వారసత్వం కోసం పోరు సాగి కవిత బయటకు వెళ్ళడం ఇక కేటీఆర్ హరీష్ రావుల మధ్య కూడా విభేదాలు వచ్చేలా కవిత చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ భవిష్యత్తులో ఏమి జరుగుతుంది అన్నది కూడా చర్చగా ఉంది అంటున్నారు.

రేవంత్ చెప్పింది కర్మ సిద్ధాంతమా :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఒక సభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ రానున్న కాలంలో రాజకీయ తెర మీద కనిపించకుండా కనుమరుగు అవుతుందని జోస్యం చెప్పారు. అయితే ఆయన రాజకీయ విశ్లేషణ కంటే కూడా కర్మ సిద్ధాంతం బేస్ చేసుకుని ఈ విషయం చెప్పడం ఆసక్తిని కలిగిస్తోంది. అధికారంలో ఉన్నపుడు గులాబీ పార్టీ టీడీపీ లాంటి పార్టీలను ఎక్కడా బతకనీయకుండా చేసిందని ఆయన అన్నారు. ఆనాడు చేసిన పాపాలకు శాపాలకు ఇపుడు పరిహారం చెల్లించాల్సి వస్తోంది అని అన్నారు. అంటే టీడీపీ తెలంగాణాలో పతనం వెనక బీఆర్ఎస్ ఉందని ఆయన గట్టిగానే చెప్పారు అనుకోవాలి.

మళ్ళీ సైకిల్ స్పీడేనా :

రేవంత్ చెప్పినది కర్మ సిద్ధాంతం అయితే టీడీపీకి మళ్ళీ ఎదుగుదల తెలంగాణాలో ఉంటుంది అనుకోవాలి. పైగా టీడీపీ నుంచి వెళ్ళిన నాయకుడిగానే కేసీఆర్ బీఆర్ఎస్ ని ఏర్పాటు చేసి సీఎం అయ్యారు. ఆయన వెంట టీడీపీ తమ్ముళ్ళు చాలా మంది నడవడానికి కారణం ఒకనాటి టీడీపీ సహచరుడనే అని అంటారు. ఇపుడు బీఆర్ఎస్ కనుక వేగంగా రాజకీయ పతనం చెందితే ఆ ప్లేస్ లో ఆ స్పేస్ లో టీడీపీకి చాన్స్ ఉంటుందా అన్నదే చర్చగా ఉంది.

బీజేపీ కంటే కూడా :

ఇక తెలంగాణా కర్మ భూమిగా చెబుతారు. అక్కడ ఉద్యమ గడ్డగా ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాంటి చోట రాజకీయ పార్టీలకు స్కోప్ ఎలా ఉంటుంది అన్నది చూస్తే కనుక కర్మ జీవులకు శ్రమ జీవులకు పక్షాన నిలబడి వాదించే వాటికి అని చెప్పాలి. అందుకే కమ్యూనిస్టులకు ఈ రోజుకీ ఉనికి ఉంది. ఇక కాంగ్రెస్ కి ఎటూ తన రాజకీయ వాటా ఉంది. మధ్యేవాద పార్టీల విషయానికి వస్తే ఒకనాడు తెలుగుదేశం కూడు గూడు గుడ్డ నినాదంతో తెలంగాణా అంతటా పసుపుదనం పరచుకుంది. ఎన్నో విజయాలు ఆ పార్టీకి అక్కడ దక్కాయి.

2014లో అంతటి తెలంగాణా ఉద్యమంలో కూడా 15 ఎమ్మెల్యే సీట్లు టీడీపీ సాధించింది అంటే బలం ఉన్నట్లు లెక్క అంటారు. ఇపుడు బీఆర్ఎస్ కనుక తగ్గిపోతే బీజేపీ కంటే కూడా టీడీపీకే ఎదిగేందుకు చాన్స్ ఉంటుంది అని అంటున్నారు. దానికి తగినట్లుగా బలమైన నాయకత్వం తో కనుక టీడీపీ ముందుకు వస్తే పసుపు పార్టీకి మంచి రోజులు వస్తాయన్న లెక్క అయితే ఉంది. రేవంత్ రెడ్డి సైతం బీఆర్ఎస్ పతనం ఖాయమని చెబుతున్న వేళ టీడీపీని రిఫరెన్స్ గా తీసుకుని వచ్చిన వేళ ఈ అంచనాలు మరింత బలపడుతున్నాయనే చెప్పాల్సి ఉంది.