రేవంత్ రెడ్డికి సవాల్.. కేటీఆర్ పై విచారణ బీజేపీ స్కెచ్చా?
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగు ప్రెసిడెంట్ కేటీఆర్ పై విచారణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయం అంటూ గులాబీ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
By: Tupaki Desk | 22 Nov 2025 12:51 AM ISTఫార్ములా ఈ కార్ రేసు కేసులో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగు ప్రెసిడెంట్ కేటీఆర్ పై విచారణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయం అంటూ గులాబీ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరహా రాజకీయాలకు తాను తొలి బాధితురాలిని అయితే, ఇప్పుడు కేటీఆర్ వంతు వచ్చిందని ఆయన సోదరి కవిత కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ కేసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ సవాల్ కానుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఏసీబీ నమోదు చేసిన అవినీతి కేసులో కేటీఆర్ అరెస్టు వరకు వ్యవహారాన్ని తీసుకువెళతారా? లేక అరెస్టు భయం మాత్రమే చూపి వదిలేస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు సర్కారులో చోటుచేసుకున్న పలు వ్యవహారాల్లో విచారణకు ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతితోపాటు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఫార్ములా ఈ కార్ రేసు ఇలా ప్రతిపక్ష బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగు ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్టుగా పావులు కదిపారు. ఆయా ఆరోపణలపై కేసీఆర్, కేటీఆర్ ఇప్పటికే విచారణ ఎదుర్కొన్నారు. అయితే ఇద్దరిని అరెస్టు చేయించే విషయంలో రేవంత్ రెడ్డి తర్జనభర్జన పడుతున్నట్లు పరిశీలకులు అనుమానిస్తున్నారు. పైకి గంభీరం ప్రదర్శిస్తూ కేసీఆర్ ను జైలులో పెడతానని హెచ్చరిస్తున్నా.. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ పై ప్రజల్లో ఉన్న అభిమానం ఆగ్రహంగా మారుతుందనే ఆలోచనతో వెనక్కి తగ్గుతున్నారని అంటున్నారు.
దీంతో కేసీఆర్ కాకుండా సీఎం రేవంత్ రెడ్డి తన గురి కేటీఆర్ పై పెట్టినట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేటీఆర్ కూడా తన అధికారాన్ని ప్రశ్నించేలా, ధిక్కరించేలా వ్యవహరిస్తుండటంతో ఆయనకు చెక్ చెప్పాలని నిర్ణయించారని అంటున్నారు. అయితే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఇలా బీఆర్ఎస్ లో ఏ ముఖ్యనేతను టచ్ చేయాలన్నా ముందుగా గవర్నర్ అనుమతి ఇవ్వాల్సివుండటంతో రేవంత్ రెడ్డి వ్యూహానికి బ్రేకులు పడుతున్నాయని అంటున్నారు. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసులో కూడా గవర్నర్ ఇచ్చిన అనుమతి వెనుక కేంద్రంలో ఉన్న బీజేపీ నేతల ప్రమేయం ఉందా అని అనుమానిస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో కేసీఆర్ ను అరెస్టు చేయకుండా బీజేపీ రక్షిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆయన ఇలా చెప్పడానికి కారణం బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని చాటడమని అంటున్నారు. అయితే బీజేపీ నేతలు ఈ విషయంలో రేవంత్ రెడ్డి మాటలను ఖండిస్తూ కేసీఆర్ పై రేవంత్ రెడ్డే చర్యలు తీసుకోలేకపోయారని ఎదురుదాడి చేశారు. ఇక తాజాగా కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఆయనను అరెస్టు చేయించే సాహసం సీఎం రేవంత్ రెడ్డి చేస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేయకుండా.. తమకు బీఆర్ఎస్ సంబంధాలు ఉన్నాయని చెప్పుకోకుండా ఉండేలా.. జూబ్లీహిల్స్ ఎన్నికలు ముగియగానే బీజేపీ గవర్నర్ ద్వారా పావులు కదిపి కేటీఆర్ విచారణకు అనుమతి ఇప్పించిందని అనుమానిస్తున్నారు.
ఇన్నాళ్లు గవర్నర్ అనుమతి ఇవ్వలేదని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేటీఆర్ అరెస్టుకు ఆదేశించి బీఆర్ఎస్ కు సానుభూతి పోగయ్యేలా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారా? అన్నది చర్చకు దారితీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య నేతల అరెస్టు తర్వాత రాజకీయంగా ఆయా పార్టీలకు మేలు జరిగిన సందర్భాలు అనేకం ఉదహరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ జీవం పోసేలా కేటీఆర్ అరెస్టు అయితే ఆ పార్టీకి ఉపయోగపడే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ కూడా తన సీక్రెట్ అజెండాను అమలు చేస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వన్ షాట్ టు బర్డ్స్ అన్నట్లు కేటీఆర్ విచారణ తర్వాత ప్రభుత్వం ఏం చేసినా, తనకు అనుకూలంగా మార్చుకోవడంతోపాటు కేటీఆర్ పై అవినీతి ఆరోపణలను వినియోగించి ఈడీ ద్వారా ఇబ్బంది పెట్టాలని బీజేపీ చూస్తోందని అంటున్నారు. దీనివల్ల వచ్చే బీజేపీ ఎన్నికలకు ఇప్పటి నుంచే బీజేపీ స్కెచ్ వేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.
