కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేద్దాం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్తకు ఆఫర్!
తెలంగాణలో రాజకీయ వాతావరణం వేసవి ఎండలను మించినట్లు హీట్ పుట్టిస్తోంది. నిత్యం ఏదో సంచలనమే తెలంగాణ గడ్డను కుదిపేస్తోంది
By: Tupaki Desk | 15 April 2025 9:33 AM ISTతెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఆధిపత్యపోరు రోజురోజుకు తీవ్రమవుతోంది. 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు పడగొడదామా? అంటూ గులాబీ నేతలు తెగ ఆరాటపడుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ ఆధిక్యం ఉన్నా, ఆ పార్టీ ఎమ్మెల్యేలను డబ్బులతో కొనేసి సీఎం పీఠంపై తమ అధినేతను కూర్చోబెడదామని కారు పార్టీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలించుకోవాలని పారిశ్రామికవేత్తలు ప్రయత్నిస్తున్నారని, అవసరమైతే తామే డబ్బు సమకూర్చుతామని సదరు పారిశ్రామిక వేత్తలు చెబుతున్నారట.. బలమైన ప్రభుత్వాన్ని పడగొడదామని ఆశ పడుతున్న పారిశ్రామికవేత్తలు ఎవరో చెప్పాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పారిశ్రామిక వర్గాలకు అనుకూలమైన వాతావరణం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడదామని కొందరు పారిశ్రామిక వేత్తలు తనతో చెప్పారని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ప్రకటన తీవ్ర చర్చకు దారితీస్తోంది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసిన నుంచి ఆయన సర్కారును కూలదోసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమని చెబుతోంది. గతంలో కూడా బీఆర్ఎస్ ఇలాంటి ప్రకటనలు చేసిందని గుర్తుచేస్తోంది.
తెలంగాణలో రాజకీయ వాతావరణం వేసవి ఎండలను మించినట్లు హీట్ పుట్టిస్తోంది. నిత్యం ఏదో సంచలనమే తెలంగాణ గడ్డను కుదిపేస్తోంది. కొద్ది రోజుల క్రితం మొదలైన కంచ గచ్చిబౌలి వివాదం ఇంకా సర్దుమణగక ముందే రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకటించడం వేడిపుట్టిస్తోంది. అయితే ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించడమనే పద్ధతి కాకుండా, ఎన్నికలకు మూడేళ్లు ముందుగానే కాంగ్రెస్ ను పడగొట్టాలని చూడటమే సంచలనం రేపుతోంది. కొందరు పారిశ్రామిక వేత్తల పేరిట ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి చేసిన ప్రకటన ద్వారా ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? అనే అనుమానాలు మొదలయ్యాయి. తెలంగాణలో వలస రాజకీయాలు కొత్తమీ కాకపోయినా, ఎమ్మెల్యే కొనుగోలు ప్రయత్నాలన్న ప్రకటనే చర్చకు దారితీస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలు జరిగాయని బీజేపీపై ఆరోపణలు చేసింది.
మొయినాబాదులో ఓ ఫాం హౌసులో ఎమ్మెల్యేల కొనుగోలుకు పథకం పన్నారని స్ట్రింగు ఆపరేషన్ నిర్వహించి అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కొందరిని అరెస్టు చేసింది. ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసు అతీగతీ లేకపోయింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేద్దామంటూ పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ప్రకటించడం రాజకీయ వ్యూహమా? లేక నిజంగానే ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయా? అనేది చర్చకు తావిస్తోంది.
