Begin typing your search above and press return to search.

రూల్స్ పాటించని ఖాకీలు.. పోలీసుల వాహనాలపై రూ.68 లక్షల చలానాలు!

ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన సామాన్యులపై పోలీసులు చనాన్లు వేస్తారన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 May 2025 10:00 PM IST
RTI Reveals Massive Traffic Violations
X

ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన సామాన్యులపై పోలీసులు చనాన్లు వేస్తారన్న సంగతి తెలిసిందే. అయితే అలా చలాన్లు వేసే పోలీసులు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే. ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదన్న ఆరోపణలు పోలీసుల మీద ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. తాజాగా ఒక సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) దరఖాస్తుతో ఈ విషయం నిజమని తేలింది. తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు వాహనాలపై ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి ఏకంగా 17,391 చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి విలువ అక్షరాలా రూ.68.67 లక్షలు. పోలీసులు కూడా బాధ్యతగా ప్రవర్తించాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.

రోడ్డు మీద ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ తప్పితే వెంటనే ఫైన్ వేసే పోలీసులు, తమ వాహనాలకు మాత్రం ఆ నిబంధనలు వర్తించవా? సిగ్నల్ జంప్ చేసినా, రాంగ్ రూట్‌లో వెళ్లినా, అతి వేగంగా దూసుకెళ్లినా సామాన్యుడికి చలానా తప్పదు. మరి పోలీసు వాహనాలు ఇన్ని రూల్స్ బ్రేక్ చేసినా ఎందుకు చర్యలు ఉండవు? ఈ ప్రశ్నకు సమాధానం తాజాగా ఆర్టీఐ ద్వారా బయటపడింది.

ఒక ఆర్టీఐ కార్యకర్త పోలీసు శాఖలోని వాహనాలపై ఉన్న చలానాల గురించి సమాచారం కోరగా ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. వేలాది చలానాలు, లక్షల రూపాయల పెండింగ్ ఫైన్ చూసి అధికారులు కూడా అవాక్కయ్యారు. అంటే, ట్రాఫిక్ రూల్స్ పాటించమని ప్రజలకు చెప్పే పోలీసులే స్వయంగా వాటిని ఉల్లంఘిస్తున్నారన్నమాట.

ఈ విషయం తెలిసిన తర్వాత సామాన్య ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "మాకు ఒక న్యాయం, పోలీసులకు ఒక న్యాయమా? చట్టం అందరికీ సమానంగా ఉండాలి కదా? పోలీసులు మమ్మల్ని రూల్స్ పాటించమని చెప్పే ముందు వారైనా వాటిని ఆచరించాలి కదా?" అని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కూడా తమ బాధ్యతను గుర్తించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇన్ని చలానాలు పెండింగ్‌లో ఉండటం పోలీసు శాఖకు ఎంత మాత్రం మంచిది కాదు. ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించి, ఆ చలానాలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అంతేకాకుండా, భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు జరగకుండా కఠినమైన నిబంధనలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి పోలీసులు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.