Begin typing your search above and press return to search.

షర్మిల ఫోనూ ట్యాప్...? బీఆర్ఎస్-వైసీసీ ప్రభుత్వాల్లో సంచలనం..

2021లో షర్మిల వైఎస్సార్టీపీని స్థాపించారు. అప్పటికి తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైఎస్సార్టీపీ అధికారంలో ఉన్నాయి.

By:  Tupaki Desk   |   17 Jun 2025 2:37 PM IST
షర్మిల ఫోనూ ట్యాప్...? బీఆర్ఎస్-వైసీసీ ప్రభుత్వాల్లో సంచలనం..
X

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ డొంక మరింత కదులుతోంది.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలోని సొంత పార్టీ వారి నుంచి ప్రతిపక్ష నేతల ఫోన్లనూ ట్యాప్ చేశారనే కథనాలు పెద్దఎత్తున దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనికితోడు అప్పట్లో అన్న వైఎస్ జగన్ ఏపీలో అధికారంలో ఉండగా.. వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్ అంటూ తెలంగాణలో సొంత పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా బయటకు వస్తున్న సమాచారం ప్రకారం.. షర్మిల ఫోన్ ట్యాప్ చేసిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమె ఎవరితో మాట్లాడుతోంది అనే వివరాలను ఏపీలో అధికారంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి చేరవేసినట్లు తెలుస్తోంది.

2021లో షర్మిల వైఎస్సార్టీపీని స్థాపించారు. అప్పటికి తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైఎస్సార్టీపీ అధికారంలో ఉన్నాయి. సరిగ్గా తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి (జూలై 7) నాడు తెలంగాణలో పార్టీ అందరినీ ఆశ్చర్యపరిచారు వైఎస్ షర్మిల. తొలి ఏడాదిన్నర పాటు అత్యంత తీవ్రస్థాయిలో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. ధర్నాలు నిరాహార దీక్షలు నిరుద్యోగ దీక్షలు అంటూ హల్ చల్ చేశారు. అయితే, తీరా ఎన్నికల సమయానికి షర్మిల స్టాండ్ మారిపోయింది. 2023 రెండో భాగానికి వచ్చేసరికి.. అంటే పార్టీ పెట్టిన రెండేళ్లకు ఆమె కాంగ్రెస్ వైపు మొగ్గారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

ఆ తర్వాత షర్మిలకు ఏపీపీసీసీ పదవి ఇచ్చారు. తెలంగాణ-ఏపీ ఎన్నికలకు ఆరేడు నెలల వ్యవధి ఉండడంతో షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వెళ్లి.. సొంత అన్న వైఎస్ జగన్ ను తీవ్ర స్థాయిలో విమర్శించడం మొదలుపెట్టారు. సొంత బాబాయ్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసును గట్టిగా పట్టుకుని వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. దీంతో వ్యక్తిగత విషయాల్లోనూ తనను టార్గెట్ చేశారని ఓ దశలో కంటతడి పెట్టుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ జగన్ ఓటమిలో తన వంతు పాత్ర పోషించారు.

అయితే, షర్మిల ఎప్పుడైతే అన్న వైఎస్ జగన్ తో విభేదించారో.. తెలంగాణలోకి వచ్చారో అప్పటినుంచే ఆమె ఫోన్ ట్యాప్ మొదలైనట్లు తెలుస్తోంది. పూర్తిగా తెలంగాణ రాజకీయాలకే పరిమితమైనందున.. ఇక్కడ తనకు కావాల్సిన బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నందున వైఎస్ జగన్ ప్రభుత్వం షర్మిల ఎవరెవరితో మాట్లాడుతున్నారు..? ఆమెతో ఎవరు టచ్ లో ఉన్నారు? అనే వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు. షర్మిల కదలికలను ఎప్పటికప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ సర్కారు చేరవేసినట్లు కథనాలు బయటకు వస్తున్నాయి.

ఇప్పుడు తెలంగాణ, ఏపీలో ప్రభుత్వాలు మారాయి. దీంతో ఇక్కడ కాంగ్రెస్, అక్కడ టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి అధికారంలోకి వచ్చాయి. తెలంగాణ సర్కారు.. బీఆర్ఎస్ హయాంనాటి ఫోన్ ట్యాపింగ్ పై తీవ్రంగా స్పందించి విచారణ చేపడుతోంది. ఇక ముందుముందు ఏం జరుగుతుందో చూడాలి.