తెలంగాణ ఫ్యాన్ ట్యాపింగ్ కేసు: చంద్రబాబు, లోకేష్ ఫోన్లు కూడా ట్యాప్?
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కొక్కటిగా కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
By: Tupaki Desk | 17 Jun 2025 12:08 PM ISTతెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కొక్కటిగా కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం... ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. విచారణలో టీడీపీ ముఖ్య నేతల ఫోన్‌లను ట్యాపింగ్ చేసిన విషయాన్ని ప్రభాకర్ రావు ఒప్పుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా విదేశాల నుంచి ప్రత్యేక పరికరాలను తెప్పించి వాటి సాయంతో ట్యాపింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన వివరాలు వెలుగులోకి రావటంతో ఇది రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్‌గా మారింది. చర్చకు దారితీసిన మరో అంశం ఏంటంటే.. కేవలం టీడీపీ నేతల ఫోన్‌లే కాదు.. కాంగ్రెస్, బీజేపీ కీలక నేతల ఫోన్‌లను కూడా ట్యాప్ చేసినట్లు వివరాలు లభిస్తున్నాయి.
ఈ వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో జరిగినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక పరికరాలను విదేశాల నుంచి తెప్పించడమే కాకుండా, వాటిని ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థుల ఫోన్ సంభాషణలను వింటూ వారిపై వ్యూహాలు రూపొందించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్‌రావును మరింత లోతుగా విచారించేందుకు సిట్ అధికారులు సన్నద్ధమవుతున్నారు. రాజకీయపరంగా ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్లబోతుందో అనే ఆసక్తి ప్రజల్లో నెలకొంది.
ఈ కేసులో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల పేర్లు వినిపించడంతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగినట్టు స్పష్టమవుతోంది. త్వరలోనే మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
