Begin typing your search above and press return to search.

ట్యాపింగ్ కేసు మరింత సీరియస్ కానుందా?

ఇప్పటివరకు అక్రమ ఫోన్ ట్యాపింగ్ లో నాటి అధికార పక్షానికి ప్రత్యర్థులైన వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు భావించారు.

By:  Tupaki Desk   |   25 Jun 2025 1:00 PM IST
ట్యాపింగ్ కేసు మరింత సీరియస్ కానుందా?
X

ఫోన్ అక్రమ ట్యాపింగ్ ఉదంతం అంతకంతకూ సీరియస్ కానుందా? మొన్నటివరకు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ట్యాపింగ్ కేసు వ్యవహారం ఉంటుందని భావించినా.. గడిచిన కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు మాత్రం అందుకు భిన్నమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ముఖ్యంగా నిఘా సంస్థ మాజీ ఓఎస్డీగా వ్యవహరించిన ప్రభాకర్ రావు విచారణకు హాజరైన తర్వాత నుంచి కొత్త పరిణామాలు వేగంగా సాగుతున్నట్లుగా కనిపిస్తోంది.

ఇప్పటివరకు అక్రమ ఫోన్ ట్యాపింగ్ లో నాటి అధికార పక్షానికి ప్రత్యర్థులైన వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు భావించారు. ఆ తర్వాత సొంత పార్టీ నేతల ఫోన్లు సైతం ట్యాప్ అయిన విషయాన్ని గుర్తించారు. తాజాగా వెలుగు చూసిన అప్డేట్ మరింత అదిరేలా చేస్తోంది. తాము టార్గెట్ చేసిన నేతలు ఎవరైనా.. ఏ పార్టీ వారైనా సరే.. వారికి సన్నిహితంగా ఉండే వారి పోన్లను కూడా ట్యాప్ చేసి.. రహస్యంగా విన్న వైనం వెలుగు చూస్తోంది.

సిట్ దర్యాప్తులో వెలుగు చూస్తున్న ఈ కొత్త పరిణామాలు రానున్నరోజుల్లో బీఆర్ఎస్ కీలక బాసులకు క్లిష్టమైన పరిస్థితుల్ని తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు. రేవంత్ రెడ్డి.. బండి సంజయ్.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఈటల రాజేందర్ ఇలాంటి ముఖ్యనేతల ఫోన్లు మాత్రమే కాదు.. వారికిసన్నిహితులైన వారు.. వారి కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేసిన విషయాన్ని గుర్తించారు.

ఈటల రాజేందర్ సతీమణి ఫోన్ తో పాటు.. ఆయన బంధువు.. జమ్ముకశ్మీర్ మాజీ డీజీపీ గోపాల్ రెడ్డి ఫోన్ మీదా నిఘా ఉంచిన వైనాన్ని గుర్తించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని ఆయన కటుంబ వ్యాపార సంస్థలకు చెందిన సుమారు 40 మంది ఉద్యోగుల సెల్ ఫోన్ల మీదా నిఘా ఉంచిన వైనం వెలుగు చూసింది. ఇదే కాదు.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు.. కేఎస్ రత్నం.. ఇలా పలువురు నేతల విషయంలోనూ ఇదే ధోరణిని ప్రదర్శించినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఫోన్ మీదా నిఘా ఉంచిన వైనం వెలుగు చూసింది.

తాజాగా వెలుగు చూస్తున్న సిట్ విచారణ డేటా ప్రకారం 2023 నవంబరు 15 నుంచి 30 వరకు మొత్తం 4013 ఫోన్ నెంబర్ల మీద నిఘా ఉంచినట్లుగా గుర్తించారు. వీరిలో బీఆర్ఎస్ నేతలు ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పలువురు పార్టీ నేతలు (పద్మా దేవేందర్ రెడ్డి.. మర్రి జనార్ధన్ రావు.. తాటికొండ రాజయ్య తదితరులు) మాత్రమే కాదు ఐఏఎస్ అధికారులు రొనాల్డ్ రాస్.. గౌతమ్ లు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు నోటినుంచి వ్యాఖ్యలే కీలకంగా మారనున్నాయి. తనకు తానే ట్యాపింగ్ కు పాల్పడ్డారా? లేదంటే ఎవరైనా స్పష్టమైన ఆదేశాలతో ఈ గలీజ్ వ్యవహారాన్నిచేపట్టారా? అన్నదిప్పుడు అసలు ప్రశ్న. ఈ అంశంలో ప్రభాకర్ రావు నోటి నుంచి వచ్చే మాట.. బీఆర్ఎస్ కీలక నేతల భవిష్యత్తును డిసైడ్ చేయనుంది.