Begin typing your search above and press return to search.

2018 ఎన్నికల నుంచే ఫోన్ ట్యాపింగ్‌.. సిట్‌కు లభ్యమైన కీలక ఆధారాలు

మునుగోడు ఉప ఎన్నికల్లోనూ ఫోన్ ట్యాపింగ్ సాగిందని వివరాలు వెలుగులోకి వచ్చాయి. నల్గొండలోని కాంగ్రెస్ నేతల అనుచరుల నుంచి రూ.3.5 కోట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

By:  Tupaki Desk   |   23 Jun 2025 6:06 PM IST
2018 ఎన్నికల నుంచే ఫోన్ ట్యాపింగ్‌.. సిట్‌కు లభ్యమైన కీలక ఆధారాలు
X

తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు మరింత ఊహించని మలుపు తిరిగింది. 2018 ఎన్నికల నుంచే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొనసాగుతోందని తాజా విచారణల్లో స్పష్టం అయ్యింది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు దీనికి సంబంధించిన కీలక ఆధారాలు లభించాయి.

తాజా సమాచారం ప్రకారం.. ప్రణీత్ రావు నుండి టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు ట్యాపింగ్ వివరాలు అందేవని సిట్ గుర్తించింది. ఆ సమాచారం ఆధారంగానే టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులకు దిగారట. 2018 ఎన్నికల సమయంలో హైదరాబాదులోని ప్యారడైజ్ వద్ద భవ్య ఆనంద్ ప్రసాద్ కు చెందిన రూ.70 లక్షల నగదు ట్యాపింగ్ సమాచారం ద్వారానే స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.

దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో కూడా ఇదే విధంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. దుబ్బాకలో పోటీ చేసిన రఘునందన్ రావు బంధువుల వద్ద ఉన్న రూ. కోటి నగదు ట్యాపింగ్ సమాచారంతోనే సీజ్ చేసినట్టు సమాచారం. బేగంపేట ప్రాంతంలో డీసీపీ రాధాకిషన్ రావు బృందం ఈ డబ్బును స్వాధీనం చేసుకుంది.

మునుగోడు ఉప ఎన్నికల్లోనూ ఫోన్ ట్యాపింగ్ సాగిందని వివరాలు వెలుగులోకి వచ్చాయి. నల్గొండలోని కాంగ్రెస్ నేతల అనుచరుల నుంచి రూ.3.5 కోట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ మొత్తం నగదు కూడా ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారంతోనే పట్టుబడిందని సిట్ పేర్కొంది.

ఈ కేసులో ప్రతి దశలోనూ శాసనసభ ఎన్నికల సమయంలో రాజకీయ నేతల, వారి బంధువుల, అనుచరుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఇప్పటి వరకు లభించిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. మరిన్ని కీలక ఆధారాలు రాబోయే దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో భారీ చర్చకు దారి తీసింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మళ్లీ రాజుకునే అవకాశముంది.