Begin typing your search above and press return to search.

తెలంగాణలో 'హ్యాకింగ్' వార్.. హరీశ్ రావు ఆరోపణల వెనుక వాస్తవాలేంటి!

హరీశ్ రావు ఆరోపించినట్లుగా ప్రభుత్వం కేవలం ఫోన్లను ట్యాప్ చేయడం లేదు, అంతకంటే శక్తివంతమైన మార్గాలను ఎంచుకుంది అన్నారు.

By:  Tupaki Political Desk   |   29 April 2026 3:47 PM IST
తెలంగాణలో హ్యాకింగ్ వార్.. హరీశ్ రావు ఆరోపణల వెనుక వాస్తవాలేంటి!
X

తెలంగాణ రాజకీయాల్లో ‘ట్యాపింగ్, హ్యాకింగ్’ వివాదాలు జోరుగా కొనసాగుతున్నాయి. 'హ్యాకింగ్' అనే ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు కేవలం ఫోన్ సంభాషణల మీద నిఘా ఉండేదని భయపడే పరిస్థితి నుంచి, ఇప్పుడు ఏకంగా ఇంట్లోని సీసీ కెమెరాల ద్వారా మన ప్రైవేట్ సంభాషణలను కూడా ప్రభుత్వం వింటోందన్న హరీశ్ రావు ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు సాంకేతిక యుద్ధభూమిని తలపిస్తున్నాయి. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వం విచారణను వేగవంతం చేస్తున్న తరుణంలో ప్రతిపక్ష నేత హరీశ్ రావు అంతకంటే ప్రమాదకరమైన 'హ్యాకింగ్' సంస్కృతికి రేవంత్ రెడ్డి సర్కార్ తెరలేపిందని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా నిన్న (ఏప్రిల్ 28, 2026) సంగారెడ్డి జైలు వద్ద ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర పోలీస్ వ్యవస్థను, ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి చేసిన ఒక 'ఫైనల్ వార్నింగ్' లాగా కనిపిస్తున్నాయి.

నిఘా నీడలో ‘నాయకులు’

హరీశ్ రావు ఆరోపించినట్లుగా ప్రభుత్వం కేవలం ఫోన్లను ట్యాప్ చేయడం లేదు, అంతకంటే శక్తివంతమైన మార్గాలను ఎంచుకుంది అన్నారు. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను రప్పించి, వారికి భారీ మొత్తంలో చెల్లించి ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు. నేతల నివాసాల బయట, లోపల ఉండే సీసీ కెమెరాలను ఇంటర్నెట్ ఆధారంగా హ్యాక్ చేసి, ఎవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అనే విషయాలను రికార్డ్ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ఈ అక్రమ నిఘా కార్యక్రమాలకు కేంద్రంగా వాడుతున్నారని ఆరోపించడం విశేషం.

అధికారులకు హెచ్చరిక

ఈ ఆరోపణలు చేస్తూనే, హరీశ్ రావు పోలీస్ అధికారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్యాపింగ్, హ్యాకింగ్ కు సంబంధించి పూర్తి సాక్ష్యాలు మా వద్ద ఉన్నాయి. దీనికి పాల్పడుతున్నది ఎవరో మాకు తెలుసని హెచ్చరించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారిపై విచారణ జరిపిస్తామని, ఒకవేళ వారు అప్పటికి రిటైర్ అయినా సరే చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. ‘కోర్టు ఫీజులు కూడా మీ సొంత డబ్బుతో కట్టుకోవాల్సి వస్తుంది’ అని ఆయన చేసిన వ్యాఖ్య అధికారుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.

ప్రభుత్వం కౌంటర్

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలను కొట్టిపారేస్తోంది. హరీశ్ రావు తన ఉనికిని చాటుకునేందుకు, తన పార్టీలో ప్రాధాన్యత కోల్పోయి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి తుమ్మల రివర్స్ కౌంటర్ వేశారు. గతంలో ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వారే ఇప్పుడు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.

సాంకేతికత ఎంత పెరిగితే దుర్వినియోగం అంతగా పెరుగుతుందనేందుకు ఈ ట్యాపింగ్, హ్యాకింగ్ వివాదాలు నిదర్శనం. ఒకప్పుడు ఫోన్ వినబడుతుందేమో అని భయపడే వారు, ఇప్పుడు తమ ఇంట్లోని కెమెరాలు ఎక్కడ తమ రహస్యాలను బయటపెడతాయో అని ఆందోళన చెందుతున్నారు. హరీశ్ రావు చెబుతున్నట్లు హ్యాకింగ్ సాక్ష్యాలు బయటపడితే, అది తెలంగాణ రాజకీయాల్లో పెను తుపానును సృష్టిస్తుంది. మొత్తానికి, 'ప్రైవసీ' అనేది రాజకీయ నేతలకు ఇప్పుడు కలగానే మిగిలిపోయింది.