ఫోన్ ట్యాంపింగ్ కేసు.. సిట్ విచారణకు ముగ్గురు బీజేపీ ఎంపీలు?
తమ కేసుకు ఆధారంగా పలువురు నేతల నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. 2023 నంబర్ కి ముందు ఆయా నేతల ఫోన్లను ఎస్ఐబీ అధికారులు రికార్డు చేశారని సిట్ చెబుతోంది.
By: Tupaki Desk | 18 Jun 2025 3:24 PM ISTతెలంగాణలో పోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణతోపాటు ఏపీకి చెందిన పలువురు నేతలు, వ్యాపార వేత్తల ఫోన్లను రహస్యంగా విన్నరన్న సమాచారం సంచలనం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణతో డొంక అంతా కదులుతోంది. ఇన్నాళ్లు అమెరికాలో ఉన్న ఆయనను ప్రభుత్వం రప్పించింది. కొద్దిరోజులుగా ఆయనను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం కేసును ఓ కొలిక్కి తీసువచ్చిందని అంటున్నారు.
తమ కేసుకు ఆధారంగా పలువురు నేతల నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. 2023 నంబర్ కి ముందు ఆయా నేతల ఫోన్లను ఎస్ఐబీ అధికారులు రికార్డు చేశారని సిట్ చెబుతోంది. దాదాపు వెయ్యి మంది పోన్లు రికార్డు చేశారని చెబుతుండగా, ఆ జాబితాలో బీజేపీ ఎంపీలు పేర్లు ఉన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ కేసును ఎలా స్వీకరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణకు చెందిన ముగ్గురు బీజేపీ ఎంపీలు ఫోన్లను ట్యాప్ చేసినట్లు చెబుతున్నారు. బీజేపీలో అత్యంత కీలకమైన ఈటల రాజేందర్, రఘునందన్ రావు, అర్వింద్ ఫోన్లను రహస్యంగా విన్నారని సిట్ ఆధారాలు సేకరించింది. దీనిపై వారి నుంచి వాంగ్మూలం తీసుకోవాలని సిట్ భావించడం, వారు కూడా అందుకు సమ్మతించడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను టార్గెట్ చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ చేతులు కలిపుతాయా? అనే ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది.
ఎన్నికలకు ముందు బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఈటల, రఘునందన్, అర్వింద్ కదలికలను ఎస్ఐబీ ఎప్పటికప్పుడు తెలుసుకుందని చెబుతున్నారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ని ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా సిట్ అధికారులు పిలిచారు. ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. ఇక బీజేపీ ఎంపీలు ఈటల, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు సాక్ష్యంతో నిందితులకు ముప్పు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
స్వయంగా ఫోన్ ట్యాపింగ్ బాధితుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారని అంటున్నారు. బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేశారన్న సమాచారం కేంద్రానికి పంపి, అమెరికా నుంచి ఎస్ఐబీ మాజీ అధినేత ప్రభాకర్ రావను స్వదేశానికి తెప్పించారని చెబుతున్నారు. ప్రభాకర్ రావు విచారణతో బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు లభించడంతో కేంద్రం స్పందనపై ఉత్కంఠ నెలకొంది. చట్టరీత్యా ఫోన్ ట్యాపింగ్ తీవ్ర నేరం. ఫోన్ ట్యాపింగుకు తప్పనిసరిగా కేంద్రం అనుమతి ఉండాలి. కానీ, మావోయిస్టుల ఫోన్లు వింటున్నామనే నెపంతో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, గత ప్రభుత్వంలోని తిరుగుబాటు నేతలైన ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి వారి ఫోన్లను ట్యాప్ చేశారని చెబుతున్నారు.
