Begin typing your search above and press return to search.

ఫోన్ ట్యాపింగ్ కేసు..ప్రభాకర్ రావుపై ప్రశ్నల వర్షం.. గంటన్నర పాటు విచారణ!

ఈ నేపథ్యంలో ప్రభాకర్‌ రావును సిట్‌ అధికారులు విచారించనున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను సిట్‌ అధికారులు విచారించారు.

By:  Tupaki Desk   |   9 Jun 2025 11:12 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు..ప్రభాకర్ రావుపై ప్రశ్నల వర్షం.. గంటన్నర పాటు విచారణ!
X

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగవంతమైంది. మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావును పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో ప్రభాకర్ రావే ప్రధాన నిందితుడిగా ఉన్నారని, ఆయన సమాధానాలు ఈ కేసును కొత్త మలుపు తిప్పుతాయని భావిస్తున్నారు. పోలీసుల విచారణ, అందులో బయటపడిన వివరాలపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ విచారణకు ప్రభాకర్‌ రావు హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రభాకర్ రావును విచారించేందుకు సిట్ అధికారులు ప్రశ్నావళిని సిద్ధం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభాకర్‌ రావును సిట్‌ అధికారులు విచారించనున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను సిట్‌ అధికారులు విచారించారు. నిందితుల స్టేట్మెంట్, సేకరించిన ఆధారాలతో ప్రభాకర్‌ రావును ప్రశ్నించే అవకాశం ఉంది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్, ఫోరెన్సిక్ నుంచి డేటాను సిట్‌ అధికారులు తెప్పించుకున్నారు.

ప్రభాకర్ రావుపై గంటన్నరపాటు విచారణ

ఈ కేసు దర్యాప్తును వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ప్రభాకర్ రావును సుమారు గంటన్నరపాటు విచారించారు. ఈ విచారణ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డు చేశారు. ప్రభాకర్ రావు ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసుకున్నారు.

పోలీసులు అడిగిన కీలక ప్రశ్నలు:

పోలీసులు ప్రభాకర్ రావును అనేక ప్రశ్నలు అడిగారు

* కేసుపై మీ వివరణ ఏమిటి? ఫోన్ ట్యాపింగ్ కేసుపై మీరు ఏం చెప్పదలుచుకున్నారు?

* కేసు నమోదైన వెంటనే మీరు విదేశాలకు ఎందుకు వెళ్లారు? కేసు గురించి తెలిసే విదేశాలకు పారిపోయారా?

* ఆధారాలు ధ్వంసం చేశారా? మీరు రాజీనామా చేసిన రోజునే హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారా?

* మీ ఆదేశాల మేరకే హార్డ్ డిస్కులను ధ్వంసం చేశానని ప్రణీత్ రావు చెప్పాడు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?

* టీమ్ ఏర్పాటు వెనుక ఉన్నది ఎవరు ? 'స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ టీమ్'ని ఎవరు ఏర్పాటు చేశారు? గత ప్రభుత్వ నాయకుల ఆదేశాల మేరకే ఈ బృందాన్ని ఏర్పాటు చేశారా?

* నాలుగు వేల కంటే ఎక్కువ ఫోన్‌లు ట్యాప్ అయ్యాయని ఆధారాలు ఉన్నాయి. ఈ నంబర్లను మీకు ఎవరు ఇచ్చారు?

* ఈ కేసులో అరెస్టు అయిన పోలీసు అధికారులు అందరూ మీ పేరునే ఎందుకు ప్రస్తావిస్తున్నారు?

* ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజే హార్డ్ డిస్కులు ధ్వంసం అయ్యాయి. ఇందులో కుట్ర లేదా?

* ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే ఆధారాలను ధ్వంసం చేయాలని మీరు ముందుగానే ప్లాన్ చేసుకున్నారా? ప్లాన్ ప్రకారం రాజీనామా చేసి ఆధారాలను ధ్వంసం చేశారా?

* శ్రావణ్ రావు అనే ప్రైవేట్ వ్యక్తితో SIBకి సంబంధం ఏమిటి?

* న్యాయమూర్తుల ఫోన్‌లు ఎందుకు ట్యాప్ అయ్యాయి? దీనిపై సీనియర్ అధికారులు ఎవరైనా మీకు ఆదేశాలు ఇచ్చారా?

* ఉప ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్‌లను మాత్రమే ట్యాప్ చేసిన టాస్క్ ఫోర్స్ నుంచి పోలీసులు డబ్బు స్వాధీనం చేసుకున్నారా?

కేసులో కీలక మలుపులు

ఈ ప్రశ్నలకు ప్రభాకర్ రావు ఇచ్చే సమాధానాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిప్పుతాయని అంచనా వేస్తున్నారు. ఆయన నుంచి వచ్చే వివరాల ఆధారంగా మరింత మంది అధికారులు, రాజకీయ నాయకులు ఈ కేసులో ఇరుక్కునే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఈ కేసుపై రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది.