Begin typing your search above and press return to search.

సినిమావాళ్లు..జర్నలిస్టులు..నేతలు..తెలంగాణలో 600 మంది ఫోన్లు ట్యాప్!

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ సర్కారు వచ్చిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ ఉదంతాన్ని బయటకు తీసింది.

By:  Tupaki Desk   |   18 Jun 2025 12:16 PM IST
సినిమావాళ్లు..జర్నలిస్టులు..నేతలు..తెలంగాణలో 600 మంది ఫోన్లు ట్యాప్!
X

ఆయన మహబూబ్ నగర్ జిల్లాలో పనిచేస్తున్న సాధారణ జర్నలిస్టు.. కానీ, ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నారో అప్పటి అధికార పార్టీ నేతలకు తెలిసిపోయేది.. వెంటనే ఆ జర్నలిస్టుకు హెచ్చరికతో కూడిన ఫోన్ వచ్చేది.. ఇది రెండేళ్ల కిందటి వరకు తెలంగాణలో ఉన్న పరిస్థితి అని చెబుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో తీవ్రస్థాయిలో జరిగినట్లుగా ఆరోపణలున్న ఫోన్ ట్యాపింగ్ డొంక కదులుతోంది. ఇప్పటివరకు నాయకుల ఫోన్లే ట్యాప్ అయినట్లుగా భావించినా.. తాజాగా బయటకు వస్తున్న సమాచారం ప్రకారం సినిమా రంగం, జర్నలిస్టుల ఫోన్లూ ట్యాప్ అయినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ సర్కారు వచ్చిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ ఉదంతాన్ని బయటకు తీసింది. తీవ్రస్థాయిలో జరిగిన ట్యాపింగ్ కారణంగానే తాము 2018 ఎన్నికల్లో ఓడిపోయామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తాజాగా చెప్పడమూ గమనార్హం. అంతేకాక నాటి బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం.. ప్రతిపక్ష నాయకులతో పాటు అధికార ప‌క్షంలోని కొంద‌రు రెబ‌ల్ నాయ‌కుల ఫోన్లనూ ట్యాప్ చేసిందని తెలుస్తోంది. దీనిపై నమోదైన కేసు దాదాపు ఏడాదిన్నరగా విచారణ సాగుతున్నది. ఇది తుది ద‌శ‌కు చేరుకుంద‌ని అంటున్నారు. దీనిప్రకారం 600 మంది ఫోన్ల‌ను ట్యాప్ చేసిన‌ట్లు అధికారులు గుర్తించారు. వీరిలో నాయకులే కాక.. సినీ రంగానికి చెందినవారు, కీల‌క‌మైన జ‌ర్న‌లిస్టుల ఫోన్లూ ట్యాప్ అయినట్లు తేలింది.

వీరిలో ఎవ‌రు ఎవ‌రితో మాట్లాడుతున్నారు...? బీఆర్ఎస్‌కు వ్య‌తిరేకంగా ఎవ‌రు క‌థ న‌డిపిస్తున్నారు? ఎన్నిక‌ల స‌మ‌యంలో వ్య‌తిరేకంగా ఎవ‌రు ప‌ని చేస్తున్నారు? తదితర కీలక అంశాల‌ను తెలుసుకునేందుకు ట్యాపింగ్ చేశార‌ని వెలుగులోకి వస్తోంది. ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్న వివరాలతో.. న‌గ‌దు త‌ర‌లిస్తున్నవారిని బెదిరించి దానిని స్వాధీనం చేసుకున్న‌ట్టు సమాచారం.

ట్యాపింగ్ కేసులో ఏ1 ఐపీఎస్ ప్ర‌భాక‌ర్‌రావు. ఆయన అమెరికా నుంచి వచ్చేలా చేశారు. ఆయన ఇచ్చిన వాంగ్మూలంతో పాటు.. ఇప్ప‌టికే విచారించిన న‌లుగురు నిందితుల వాంగ్మూలాలతో దర్యాప్తు అధికారులు ఒక అంచనాకు వ‌చ్చారు.

ట్యాపింగ్ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ఉద‌యాన్నే ప్ర‌భాక‌ర్ రావు లైన్‌లోకి వ‌చ్చేవార‌ని.. ఈ రోజు ఎవ‌రి ఫోన్ ను ట్యాప్ చేయాలి? ఎలాంటి స‌మాచారం రాబ‌ట్టాలి? అనేదానిపై దిశానిర్దేశం చేసేవార‌ని తెలిసింది. ఈ క్రమంలోనే నాడు టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్‌రెడ్డి సన్నిహితులు గాలి అనిల్ కుమార్, వినయ్‌ రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేసి వారి నుంచి డబ్బు స్వాధీనం చేసుకున్నార‌ని అధికారులు గుర్తించారు.

ప్రస్తుతం మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి, ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజగోపాల్రెడ్డికి చెందిన కంపెనీల డబ్బును ఫోన్లు ట్యాప్ చేయడం ద్వారానే టాస్క్ ఫోర్స్ స్వాధీనం చేసుకుందని ద‌ర్యాప్తు అధికారులు తెలుసుకున్నారు. బీఆర్ఎస్‌ను వ్య‌తిరేకించిన నాయ‌కుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని.. వారు ఏ పార్టీల్లో చేరుతున్నారు..? ఎక్క‌డెక్క‌డ ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు? పసిగట్టారని బయటకు వస్తోంది.