Begin typing your search above and press return to search.

పీఓకేని ఇండియాలో కలిపేయండి మోడీజీ : రేవంత్ సంచలన పిలుపు

జమ్మూకశ్మీర్ పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ జరిగింది.

By:  Tupaki Desk   |   25 April 2025 10:25 PM IST
పీఓకేని ఇండియాలో కలిపేయండి మోడీజీ : రేవంత్ సంచలన పిలుపు
X

జమ్మూకశ్మీర్ పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ జరిగింది. ఈ దారుణ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించడమే కాకుండా, ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు.

పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఇందిరా గాంధీ విగ్రహం వరకు సాగిన ఈ శాంతి ప్రదర్శనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఎంఐఎం నేతలు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఉగ్రదాడిలో చనిపోయిన హిందూ పర్యాటకులకు నివాళులర్పిస్తూ, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకునే ఏ నిర్ణయానికైనా తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ను దెబ్బకొట్టేందుకు ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. 1971లో ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆ దేశాన్ని రెండు ముక్కలు చేయండి. పీఓకేను హిందూస్థాన్లో కలిపేయండి. 140 కోట్ల మంది భారతీయులు మీ వెంట ఉన్నారు' అని తెలిపారు. దేశం ఉగ్రవాదంపై పోరాటంలో ఐక్యంగా ఉందని తెలిపారు. ఈ ర్యాలీలో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు.ఉగ్రవాదాన్ని అణచివేయడంలో పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి పోరాడాలని, ప్రతి ఒక్కరూ సంఘటితంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఉగ్రదాడిపై యావత్ భారతం భగ్గుమన్నదని, మృతులకు నివాళులర్పిస్తూ దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిందని తెలిపారు. ఢిల్లీలో జరిగిన నిరసన ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, మంత్రులు , ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొని ఉగ్రవాద చర్యలను ఖండించారని తెలిపారు.

బాధితులకు సంఘీభావం తెలపాలని, ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించిందని, ఇందులో భాగంగానే దేశ రాజధానితో పాటు అన్ని రాష్ట్రాల్లో, డివిజన్ కేంద్రాల్లో శాంతియుత నిరసనలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారని పేర్కొన్నారు.

ర్యాలీకి ముందు, ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మశాంతి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచర మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. జమ్మూకశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఇచ్చిన పిలుపులో భాగంగానే హైదరాబాద్‌లో ఈ శాంతి ర్యాలీ జరిగిందని, ఇందులో రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారని సారాంశం.