రేవంత్ కొత్త బిల్లు సీనియర్ సిటిజన్ కేరింగ్.. ఆచరణలో సాధ్యం అవుతుందా?
కన్నవారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యతను కొందరు విస్మరిస్తున్న తరుణంలో, తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ‘తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్లు’ ఒక సామాజిక విప్లవమే అని చెప్పాలి.
By: Tupaki Desk | 30 March 2026 12:05 PM ISTకన్నవారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యతను కొందరు విస్మరిస్తున్న తరుణంలో, తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ‘తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్లు’ ఒక సామాజిక విప్లవమే అని చెప్పాలి. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల జీతాల్లో కోత విధించి, ఆ మొత్తాన్ని నేరుగా ఆ వృద్ధులకే అందజేయాలనే ఈ ప్రతిపాదన వినడానికి బాగున్నా, క్షేత్ర స్థాయిలో ఇది ఎంతవరకు ఆచరణ యోగ్యం అవుతుందని పెద్ద చర్చకు దారితీస్తోంది. నైతికతను చట్టంతో శాసించవచ్చా? అనే కోణంలో పరిశీలిస్తే..
బిల్లులో ఏముందంటే?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రకారం.., ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుంది. నిర్లక్ష్యానికి గురైన తల్లిదండ్రులు నేరుగా జిల్లా కలెక్టర్లను ఆశ్రయించి దరఖాస్తు చేసుకోవచ్చు. విచారణలో నిర్లక్ష్యం అని తేలితే, సదరు ఉద్యోగి జీతం నుంచి నిర్ణీత మొత్తాన్ని కోత విధించి తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తారు. కలెక్టర్ నిర్ణయంపై అసంతృప్తి ఉంటే, దానిని పరిష్కరించడానికి ప్రత్యేకంగా 'సీనియర్ సిటిజన్ కమిషన్'ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
అమలులో సవాళ్లు
చట్టం చేయడం ఒక ఎత్తయితే.. దానిని అమలు చేయడం మరో ఎత్తు. ఇప్పటికే పాలన, అభివృద్ధి పనులతో బిజీగా ఉండే కలెక్టర్లు ఇలాంటి వందలాది కుటుంబ వివాదాలను పరిష్కరించడం సాధ్యమేనా? ఇది వారిపై అదనపు భారం మోపడమే అవుతుంది. జీతాల కోత విధించిన తర్వాత ఆ డబ్బు సక్రమంగా తల్లిదండ్రులకే చేరుతుందా..? లేదా మధ్యలో ఇతరులు ఎవరైనా జోక్యం చేసుకుంటారా? అనే విషయంలో 'ఫూల్ ప్రూఫ్' యంత్రాంగం అవసరం. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను నియంత్రించడం సులభం కావచ్చు, కానీ వేల సంఖ్యలో ఉన్న ప్రైవేటు కంపెనీల నుంచి ఈ రికవరీ చేయడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారుతుంది.
పిల్లల పై ఫిర్యాదు చేస్తారా..?
ఈ బిల్లు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ‘భారతీయ కుటుంబ వ్యవస్థలో ఉన్న సెంటిమెంట్’. మన సమాజంలో తల్లిదండ్రులు తాము పెంచిన పిల్లల తప్పులను బయటపెట్టడానికి ఇష్టపడరు. కలెక్టర్ ఆఫీసు మెట్లు ఎక్కడం అంటే తమను తాము అవమానించుకున్నట్లు భావిస్తారు. ముఖ్యంగా జీవిత భాగస్వామి చనిపోయినప్పుడు, ఒంటరిగా ఉన్న తల్లి లేదా తండ్రి తమ పిల్లల పై ఫిర్యాదు చేస్తే భవిష్యత్తులో ఇంకా ఎక్కువ వేధింపులకు గురవుతామనే భయంతో మౌనంగా ఉండిపోయే అవకాశం ఉంది. పిల్లల మీద ఆధారపడడం వల్ల కలిగే మానసిక ఆందోళన వారిని చట్టపరమైన పోరాటానికి దూరం చేస్తుంది.
చారిత్రక అనుభవం
గతంలో 1985-86లో ఎన్టీ రామారావు హిందూ వారసత్వ చట్టాన్ని సవరించి కుమార్తెలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. రాష్ట్రం చట్టం చేసిన 20 ఏళ్ల తర్వాత కేంద్రం కూడా అలాంటి చట్టమే తెచ్చింది. కానీ, నేటికీ ఎంత మంది మహిళలకు ఆస్తిలో వాటా దక్కుతోంది? చట్టం ఉన్నా కూడా హక్కులను సాధించుకోవడానికి మహిళలు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. దీనిని బట్టి చూస్తే, కేవలం చట్టం ఉంటే సరిపోదు, దాని పట్ల సామాజిక అంగీకారం, సులభమైన అమలు ప్రక్రియ ఉంటేనే ఫలితం దక్కుతుందని అర్థమవుతోంది.
తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ఈ బిల్లు నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులకు ఒక ఆయుధం లాంటిది. అయితే, ఒక బిడ్డ తన తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవడం అనేది సంస్కారానికి సంబంధించిన విషయం. దానిని జీతాల కోతతోనో, చట్టాలతోనో పూర్తిగా సాధించలేము. కానీ, కనీస అవసరాలు (ఆహారం, మందులు) తీర్చని కసాయి పిల్లలకు ఈ చట్టం ఒక హెచ్చరికగా నిలుస్తుంది. ఈ బిల్లు ప్రభావం ఎలా ఉంటుందో కాలమే నిర్ణయిస్తుంది.
