Begin typing your search above and press return to search.

త్వ‌ర‌ప‌డండి.. ఒక‌టోసారి.. రెండోసారి..! స‌ర్పంచి ప‌దవికి రూ.కోటి..!

తెలంగాణలో ప్ర‌స్తుతం పంచాయ‌తీ ఎన్నిక‌ల హంగామా న‌డుస్తోంది. మొత్తం మూడు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు.

By:  Tupaki Desk   |   29 Nov 2025 2:55 PM IST
త్వ‌ర‌ప‌డండి.. ఒక‌టోసారి.. రెండోసారి..! స‌ర్పంచి ప‌దవికి రూ.కోటి..!
X

తెలంగాణలో ప్ర‌స్తుతం పంచాయ‌తీ ఎన్నిక‌ల హంగామా న‌డుస్తోంది. మొత్తం మూడు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఇందులోభాగంగా డిసెంబ‌రు 11న జ‌రిగే మొద‌టి ద‌శ పోలింగ్ కు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ న‌డుస్తోంది. ఈ నెల 27 నుంచి మొద‌లైన ఈ ప్ర‌క్రియ శ‌నివారంతో ముగియ‌నుంది. ఆదివారం ప‌రిశీల‌న‌, వ‌చ్చే డిసెంబ‌రు 3న ఉప సంహ‌ర‌ణ ఉంటుంది. అయితే, ఈలోగా గ్రామాల్లో ప‌ద‌వుల పందేరం న‌డుస్తోంది. ఏక‌గ్రీవాల కోసం హ‌డావుడి సాగుతోంది. త‌మ‌ను ఎన్నిక లేకుండా ఎన్నుకుంటే భారీగా డ‌బ్బులు ఇస్తామంటూ కొంద‌రు రంగంలోకి దిగుతున్నారు. స‌ర్పంచ్ ప‌ద‌వికి కోట్లలో ఖ‌ర్చు పెట్టేందుకు కూడా సిద్ధం అవుతున్నారు. ఇది ప్ర‌తి జిల్లాలో న‌డుస్తుండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో ఓ వ్య‌క్తి స‌ర్పంచి ప‌ద‌వికి రూ.కోటి ఇచ్చేందుకు సైతం ముందుకురావ‌డం గ‌మ‌నార్హం.

జిల్లా కేంద్రానికి ద‌గ్గ‌ర‌లో...

టంక‌ర‌... మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా కేంద్రానికి కేవ‌లం 5 కిలోమీట‌ర్ల దూరంలోని గ్రామం. న‌వాబ్ పేట మండ‌లానికి వెళ్లే దారిలో ఉంటుంది. హ‌న్వాడ మండ‌ల ప‌రిధిలోకి వ‌స్తుంది. ఈ గ్రామ స‌ర్పంచ్ ప‌ద‌విని ఏక‌గ్రీవం చేస్తే రూ. కోటి ఇస్తానంటూ ఓ వ్య‌క్తి ముందుకువ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు. ఈ గ్రామంలో జ‌నాభా 1,500 ఉంటుంది. అయితే, జిల్లా కేంద్రానికి ద‌గ్గ‌రగా ఉండ‌డంతో భూముల విలువ పెరిగింది. ఈ క్ర‌మంలోనే స‌ర్పంచి ప‌ద‌వి అనే హోదా కోసం ఓ వ్య‌క్తి ఏకంగా రూ.కోటి పెట్టేందుకు సిద్ధం అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ప‌ది ప‌దేహేనేళ్ల కింద‌ట హ‌న్వాడ మండ‌లం సాధార‌ణంగానే ఉండేది. అయితే, తెలంగాణ వ‌చ్చాక‌, జిల్లాల విభ‌జ‌న‌తో భూముల విలువ‌లు పెరిగాయి.

ఉమ్మ‌డి పాల‌మూరులో జోష్‌

హ‌న్వాడ మండ‌లానికి ప‌క్క‌నే ఉంటుంది న‌వాబుపేట మండ‌లం. దీని ప‌రిధిలోని దొడ్డిప‌ల్లిలో స‌ర్పంచ్, ఉప స‌ర్పంచ్ ప‌ద‌వుల‌ను ఏక‌గ్రీవం చేశారు. ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా, ప్ర‌స్తుత జోగుళాంబ గ‌ద్వాల జిల్లా గ‌ట్టు మండ‌లం మిట్ట‌దొడ్డిలో స‌ర్పంచి ప‌ద‌వికి ఓ వ్య‌క్తి రూ.90 ల‌క్ష‌లు చెల్లించేందుకు ముందుకొచ్చాడు. ఈయ‌న సీడ్ ఆర్గ‌నైజ‌ర్. అంటే, విత్త‌న ప‌త్తి వ్యాపారి. ఇక గొర్ల‌ఖాన్ దొడ్డిలో రూ.57 ల‌క్ష‌ల‌కు, లింగాపురంలో రూ.34 ల‌క్ష‌ల‌కు స‌ర్పంచి ప‌ద‌విని వేలం వేశారు. గ‌ద్వాల మండ‌లం కొండ‌ప‌ల్లిలో రూ.60 ల‌క్ష‌ల‌కు సీడ్ ఆర్గ‌నైజ‌ర్ స‌ర్పంచి ప‌ద‌వి ద‌క్కించుకున్నాడు. ఇదే కాదు.. న‌ల్ల‌దేవునిప‌ల్లి (కుర్వ‌ప‌ల్లి)లో రూ.45 ల‌క్ష‌ల‌కు, వీరాపురంలో రూ.50 ల‌క్ష‌ల‌కు వేలం సాగింది. మ‌ల్ద‌క‌ల్ మండ‌లం స‌ద్ద‌లోనిప‌ల్లి స‌ర్పంచి ప‌ద‌విని రూ.42 ల‌క్ష‌ల‌కు ఏక‌గ్రీవం చేయ‌డం గ‌మ‌నార్హం.

ఏక‌గ్రీవం సొమ్ము ఎటుపోతుంది?

పంచాయ‌తీల స‌ర్పంచ్ ప‌ద‌వుల‌ను ఏక‌గ్రీవం చేసుకున్న (రూ.కోట్లు, ల‌క్ష‌లు పెట్టి ద‌క్కించుకున్న‌) సొత్తును ఏం చేస్తారు? అనేది ప్ర‌శ్న‌. ఈ మొత్తాన్ని త‌న పోటీదారుల‌కు ఇస్తారు. వారు బ‌రి నుంచి త‌ప్పుకొనేలా చేస్తారు. వాస్త‌వానికి ఇలాంటి ఎన్నిక‌ల‌పై రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం స్థిర‌మైన నిర్ణ‌యంతో ఉంది. ఒక‌వేళ ఇలాంటివి గ‌నుక ప‌రిశీల‌న‌కు వ‌స్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది. కానీ, గ్రామ‌స్థాయి రాజ‌కీయాల్లో ఇదేమీ ప‌ట్ట‌డం లేదు.