Begin typing your search above and press return to search.

గతాన్ని తవ్వి కేటీఆర్ కు దిమ్మ తిరిగేలా షాకిచ్చిన సీఎం రేవంత్

అందుకే అంటారు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే అని. ఒక రాజకీయపార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు.. అందునా.. సదరు పార్టీలో కీలకభూమిక పోషిస్తున్న వేళ.. ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేయాల్సి ఉంటుంది.

By:  Garuda Media   |   31 May 2026 11:45 AM IST
గతాన్ని తవ్వి కేటీఆర్ కు దిమ్మ తిరిగేలా షాకిచ్చిన సీఎం రేవంత్
X

అందుకే అంటారు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే అని. ఒక రాజకీయపార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు.. అందునా.. సదరు పార్టీలో కీలకభూమిక పోషిస్తున్న వేళ.. ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఏదైనా కీలక అంశంలో స్టాండ్ తీసుకోవాల్సి వస్తే.. దానికి ముందు.. వెనుక జరిగే పరిణామాలు మాత్రమే కాదు.. తాను తీసుకునే స్టాండ్ తో తనకు ఎదురయ్యే తలనొప్పుల లెక్క ఎంతన్నది వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఏ చిన్న తప్పు జరిగినా అందుకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు.

తెలంగాణ ఉద్యమం.. రాష్ట్ర ఏర్పాటు వెంటనే రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న వేళలో చోటు చేసుకున్న ఎన్నో పరిణామాల్ని పరిగణలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అమీర్ పేట చౌరస్తా.. మైత్రివనానికి సమీపంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి.. రేవంత్ సర్కారు నిర్ణయాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పు పట్టటం తెలిసిందే. ఎన్టీఆర్ విగ్రహం పేరుతో తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసే ప్రయత్నం చేశారు. అయితే.. ఆ తీరుకు చెక్ పెట్టే ప్రయత్నం చేసిన సీఎం రేవంత్.. శనివారం మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టి సందర్భంగా కేటీఆర్ కుదిమ్మ తిరిగేలా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్ విగ్రహాన్ని తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. బీఆర్ఎస్ విమర్శిస్తోంది..తప్పు పడుతోందన్న సీఎం రేవంత్.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాల మాటేమిటి? అంటూ పాత లెక్కను కొత్తగా తెర మీదకు తీసుకొచ్చారు. నిజానికి అమీర్ పేట చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్.. తాము ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎందుకు పెడుతున్నామన్న విషయంపై సుదీర్ఘంగా వివరణ ఇస్తూ.. తమ చర్యను బలంగా సమర్థించుకున్నారు.

ఎవరు అవునన్నా..కాదన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అభిమానించి.. ఆరాధించే అతికొద్ది నేతల్లో ఎన్టీఆర్ ఒకరు. ఆయన ఇమేజ్.. ప్రాంతాలకు.. సెంటిమెంట్లకు అతీతంగా ఉండటమే కాదు.. రాజకీయ పార్టీల పరిధిని దాటిన అభిమానం ఉంటుంది. అలాంటి వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసే వేళలో.. తాము తీసుకోవాల్సిన స్టాండ్ ఏమిటన్న దానిపై కేటీఆర్ సరైన కసరత్తు చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే.. ఎన్టీఆర్ విగ్రహా ఏర్పాటును తప్పు పట్టే కేటీఆర్.. అందుకు అందరూ అవుననే ఒక వాదనను వినిపించాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో ఆయన సక్సెస్ కాలేదని చెప్పాలి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ.. ‘ఎటీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే విమర్శలు చేసే వారు.. వారి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిందేంటి? ఖమ్మంలో పువ్వాడ అజయ్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ పెట్టినప్పుడు కేటీఆర్ ఎవరు చంక నాకారు? కమ్మ సంఘానికి పది ఎకరాల భూమి ఇచ్చినప్పుడు ఏం చేశారు? ఎన్టీఆర్ పేరు పెట్టుకొని కేటీఆర్ ఓట్లు అడుక్కోవటం ఎందుకు?’’ అంటూ తన మాటలతోనే ఉతికి ఆరేసేంత పని చేశారు. నిజానికి సీఎం రేవంత్ మర్చిపోయారు కానీ.. హైదరాబాద్ మహానగరం పరిధిలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించటం.. అందుకు బీఆర్ఎస్ నేతలు అండగా నిలవటాన్ని మర్చిపోకూడదు.

ఇలాంటి ఘన చరిత్ర తమ వెనుక పెట్టుకొని.. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని వ్యతిరేకించటం ఎలాంటి రాజకీయ ఎత్తుగడ అవుతుందన్నది కేటీఆర్ ఆలోచించారన్నది ఒక ప్రశ్న. కొన్ని అంశాల విషయంలో దూకుడు పనికి రాదు. ఆచితూచి అన్నట్లు స్పందించాల్సి ఉంటుంది. దీనికి తోడు వాతావరణం తమకు అనుకూలంగా లేని అంశాల విషయంలో తొందరపాటు కంటే వేచి చూసే ధోరణి చాలా ముఖ్యం. ఆ విషయాల్లో కేటీఆర్ తరచూ ఫెయిల్ కావటం బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారిందన్న మాట వినిపిస్తోంది. దీనికి తోడు.. సీఎం రేవంత్ లాంటి నాయకుడ్ని తక్కువగా అంచనా వేయటం కేటీఆర్ కు శాపంగా మారిందని చెప్పాలి. తాము స్టాండ్ తీసుకునే అంశాల్లో రేవంత్ ఏ స్థాయి వరకు వెళతారన్న విషయాన్ని అంచనా వేయటంలో టీం కేటీఆర్ మరింత జాగ్రత్తగా మదింపు చేయాల్సిన అవసరాన్ని ఎన్టీఆర్ విగ్రహ ఉదంతం చెప్పకనే చెప్పిందని చెప్పాలి.