తెలంగాణ డీజీపీ రేసులో ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులు!
దీంతో తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం డీజీపీ ఎంపికపై యూపీఎస్పీ మార్గ దర్శకాలను అమలు చేయాలని నిర్ణయించింది.
By: Tupaki Desk | 13 April 2025 6:28 PM ISTతెలంగాణ కాబోయే డీజీపీ ఎవరన్న ఉత్కంఠ ఎక్కువవుతోంది. ప్రస్తుత డీజీపీ జితేందర్ సెప్టెంబరులో రిటైర్ కానున్నారు. దీంతో కొత్త డీజీపీ ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం మొదలుపెట్టింది. వాస్తవానికి గత పదేళ్లుగా ప్రభుత్వం తనకు నచ్చిన సీనియర్ అధికారులనే డీజీపీలుగా నియమిస్తోంది. సీనియర్ అధికారుల్లో యూపీఎస్సీ సూచించిన వారినే డీజీపీలుగా నియమించాలనే రూల్స్ ఉన్నా కొన్ని రాష్ట్రాలు పాటించడం లేదు. ఆ లిస్టులో తెలంగాణ, ఏపీ కూడా ఉన్నాయి. అయితే 2009లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం యూపీఎస్పీ మార్గదర్శకాలను అమలు చేయని రాష్ట్రాలపై కోర్టు ధిక్కరణ కింద విచారణ చేపడతామని హెచ్చరించింది. దీంతో తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం డీజీపీ ఎంపికపై యూపీఎస్పీ మార్గ దర్శకాలను అమలు చేయాలని నిర్ణయించింది.
యూపీఎస్పీ నిబంధనల ప్రకారం డీజీపీ ఉద్యోగ విరమణ చేయడానికి ముందు సీనియర్ అధికారులతో రెడీ చేసిన లిస్టును ప్రభుత్వం పంపించాల్సివుంటుంది. ప్రభుత్వం ఇచ్చిన పేర్లలో సీనియారిటీని పరిశీలించి మూడు పేర్లతో యూపీఎస్సీ ఎంపానల్ కమిటీ రాష్ట్రప్రభుత్వానికి తిరిగి లిస్టు పంపుతుంది. ఈ ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించుతుంది. ఇలా యూపీఎస్సీ సూచించిన వారిలో కనీసం రెండేళ్లు పదవీకాలం లేనివారిని కూడా డీజీపీగా నియమించవచ్చు. అయితే వారిని డీజీపీగా నియమించిన తర్వాత రెండేళ్ల పాటు సర్వీసు పొడిగిస్తారు. ప్రస్తుతం డీజీపీ రేసులో ఉన్నవారిలో సీనియర్ ఐపీఎస్ అధికారి రవిగుప్తాకు మాత్రమే తక్కువ పదవీకాలం ఉంది. ఆయన ఈ ఏడాది డిసెంబరులో రిటైర్ అవ్వనున్నారు.
అదేవిధంగా డీజీపీగా నియమితులయ్యేవారు కనీసం 30 ఏళ్లు ఐపీఎస్ అధికారిగా సర్వీసు పూర్తి చేయాల్సివుంటుంది. అంతేకాకుండా డీజీపీగా అనుభవం, ఇతర అర్హతలను పరిగణలోకి తీసుకుంటారు. ప్రస్తుతం తెలంగాణలో ఏడుగురు అధికారులు డీజీ కేడరులో పనిచేస్తున్నారు. వీరి మొత్తం సర్వీసు రికార్డులను తయారు చేస్తున్న ప్రభుత్వం డీజీపీగా ఎవరిని నియమించాలో సూచించాలని యూపీఎస్పీకి లేఖ రాయనుంది. ప్రస్తుతం సీనియార్టీ ప్రకారం ఐదుగురు పేర్లను యూపీఎస్పీకి సూచిస్తూ లేఖ రాయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీరిలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా 1990 బ్యాచ్ అధికారి. రవిగుప్తా వచ్చే డిసెంబరులోనే రిటైర్ కానున్నారు. ఆ తర్వాత 1991 బ్యాచ్ అధికారి హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కుమార్ పేరుంది. ఈయన 2028 జూన్ వరకు సర్వీసులో కొనసాగుతారు. ఆనంద్ తర్వాతి స్థానంలో 1994 బ్యాచ్ అధికారి శివధర్ రెడ్డి, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, సీఐడీ డీజీ షికా గోయల్ పేర్లు ఉన్నాయి.
ఈ ఐదుగురులో ముగ్గురు పేర్లను యూపీఎస్సీ ఎంపానల్ కమిటీ ఎంపిక చేసి ఆ లిస్టును తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతుంది. ఆ ముగ్గురిలో ఒకరిని ప్రభుత్వం డీజీపీగా నియమించాల్సివుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పంపే లిస్టులో రవి గుప్తా, ఆనంద్, శివధర్ రెడ్డి పేర్లతో యూపీఎస్సీ నుంచి లేఖ వస్తుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో యూపీఎస్సీలో ఉత్తరాది వారి ప్రభావం కూడా ఉండటంతో ఒకటి రెండు పేర్లు ఉత్తరాది వారివీ చేరొచ్చని అంటున్నారు. అయితే సీనియార్టీ ప్రకారం రవి గుప్తా, సీవీ ఆనంద్, శివధర్ రెడ్డి పేర్లు మాత్రమే ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. వీరిలో శివధర్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేస్తున్న శివధర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి కళ్లు, చెవుల్లా పనిచేస్తున్నారని అంటున్నారు. తనకు నమ్మకస్తుడైన అధికారిని డీజీపీ నియమించుకోవాలని ఏ ప్రభుత్వ అధినేత అయినా భావిస్తారు. దీంతో తెలంగాణ కాబోయే డీజీపీగా శివధర్ రెడ్డికే ఎక్కువ చాన్స్ ఉందని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
