Begin typing your search above and press return to search.

కపుల్ గా బరిలోకి.. జంటగా మున్సిపాల్స్ ను క్రాక్ చేశారు

దీంతో.. పురపాలక సంస్థలకు జంటగా వెళ్లనున్న వైనం చూస్తే.. ఈ ఎన్నికల్లో ఫ్యామిలీ ప్యాక్ సూపర్ హిట్ అయ్యిందని చెప్పాలి.

By:  Garuda Media   |   14 Feb 2026 10:13 AM IST
కపుల్ గా బరిలోకి.. జంటగా మున్సిపాల్స్ ను క్రాక్ చేశారు
X

తెలంగాణలో ముగిసిన మున్సిపాలిటీలు.. నగర కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు వెల్లడి కావటం.. అధికార కాంగ్రెస్ తిరుగులేని అధిక్యతను ప్రదర్శించటం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కొత్త ట్రెండ్ ఏమంటే.. కొన్నికుటుంబాల వారు ఒకరుకంటే ఎక్కువగా వేర్వేరు డివిజన్లలో బరిలోకి దిగారు. ఇలా బరిలోకి దిగిన పలువురు విజయం సాధించారు. దీంతో.. పురపాలక సంస్థలకు జంటగా వెళ్లనున్న వైనం చూస్తే.. ఈ ఎన్నికల్లో ఫ్యామిలీ ప్యాక్ సూపర్ హిట్ అయ్యిందని చెప్పాలి. కొన్నిచోట్ల భార్యభర్తలు, మరికొన్నిచోట్ల తండ్రికొడుకులు, అత్తా కోడళ్లు, సోదరులు, సోదరీమణులు, ఇలా పలు కాంబినేషన్లలో బరిలోకి దిగిన ఫ్యామిలీ ప్యాక్ లకు ఓటర్లు విజాయన్ని అందించారు. దీంతో.. ప్యామిలీ ప్యాక్ లు గెలుపు సవాల్ ను క్రాక్ చేశారని చెప్పాలి.

ఇలాంటి తీరు ఒకట్రెండు చోట్లకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మున్సిపాల్టీల్లో కనిపించింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులోకాంగ్రెస్ అభ్యర్థి కె. వెంకటరెడ్డి బరిలోకి దిగితే.. నాలుగో వార్డులో ఆయన సతీమణి మంజుల కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఇదే రీతిలో మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో ఒకటో వార్డులో లావణ్య ఏడో వార్డులో ఆమె భర్త నాగరాజు ఇద్దరూ పోటీ చేసి.. వీరిద్దరూ విజయం సాధించారు. ప్రస్తుతం లావణ్య రామాయంపేట ఛైర్మన్ రేసులో ఉండటం గమనార్హం. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపాలిటీలో బీఆర్ అభ్యర్థులుగా భార్యభర్తలు (సమ్మయ్య, శారద) కలిసి పోటీ చేసి విజయం సాధించారు. ఇదే రీతిలో కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో లక్ష్మీనారాయణ, స్వప్న దంపతులు విజయం సాధించారు.అదే రీతిలో నిర్మల్ పట్టణంలో గణేశ్ చక్రవర్తి, కావ్య దంపతులు గెలుపొందారు. గత పాలకవర్గంలో భర్త ఛైర్మన్ గా వ్యవహరించారు. ఇదే నిర్మల్ లో అయేషా కౌసర్, తౌహీదుద్దీన్ జంట కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. నిర్మల్ జిల్లా భైంసాలో అబ్దుల్ ఖాదర్, ఫర్జానా బేగం దంపతులు ఇదే తరహాలో విజయం సాధించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో శశికళ, రమేశ్ బాబు దంపతులు కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగి గెలుపొందారు. బోధన్ లోనూ ఇలాంటి సీన్ రిపీట్ అయ్యింది. శరత్ రెడ్డి, పద్మ దంపతులు బరిలోకి దిగి విజయం సాధించారు. ఇలా భార్యభర్తలు కలిసి పోటీ చేసిన పలు జంటలు విజయాన్ని క్రాక్ చేయటం ఆసక్తికరంగా మారింది.

అత్తపై కోడలు, తోడికోడలిపై అక్క గెలిచిన ఉదంతం జనగామ మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. మేనమామ భార్య బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగితే.. మేనకోడలు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇదే మున్సిపాలిటీలో తోడికోడలు అశ్వినిపై అక్క అనిత పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు. నిర్మల్ లోని భైంసాలో తండ్రీకొడుకులు విజయం సాధించారు. వీరిద్దరు మజ్లిస్ పార్టీ నుంచి బరిలోకి దిగి గెలుపొందారు. ఇలా ఫ్యామిలీ ప్యాక్ మాదిరి పలువురు ఈ ఎన్నికల్లో విజయం సాధించటం ఆసక్తికరంగా మారింది.