Begin typing your search above and press return to search.

తెలంగాణ ఎంపీల పెర్ఫార్మెన్స్ అదిరిపోతోంది.. తాజా రిపోర్టు

పార్టీలకు అతీతంగా పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ ఎంపీలు అదరగొట్టేశారు. హాజరులో ఓవైపు.. ప్రశ్నలు సంధించటంలో మరోవైపు.. మొత్తంగా చురుగ్గా పాల్గొన్న వారి పని తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   18 April 2025 10:07 AM IST
Telangana MPs Shine in Parliament with Top Attendance
X

పార్టీలకు అతీతంగా పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ ఎంపీలు అదరగొట్టేశారు. హాజరులో ఓవైపు.. ప్రశ్నలు సంధించటంలో మరోవైపు.. మొత్తంగా చురుగ్గా పాల్గొన్న వారి పని తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావటం.. చర్చల్లో పాల్గొనటం.. ప్రజాసమస్యల మీద ప్రశ్నలు సంధించే అంశాల మీద కంటే.. ఇతర కార్యక్రమాల మీద ఎక్కువ ఆసక్తి చూపుతారన్న వాదన వినిపిస్తూ ఉంటుంది. ఇలాంటి విమర్శలకు తమ చేతల ద్వారా తామేమిటో చూపించారు తెలంగాణ ఎంపీలు.

గత ఏడాది జూన్24 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 4 వరకు 18వ లోక్ సభ నాలుగో సెషన్ లో ఎంపీల హాజరు.. ప్రశ్నలు.. చర్చలు.. ప్రైవేటు నెంబర్ బిల్లులకు సంబంధించి ‘‘పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ’’ తాజా గణంకాల్ని వెల్లడించింది. పార్లమెంట్ లో ప్రశ్నలు అడగటంలో మల్కాజిగిరి ఎంపీ.. బీజేపీ నేత ఈటల రాజేందర్ మొదటి స్థానంలో నిలిస్తే.. పార్లమెంటు సమావేశాలకు రెగ్యులర్ గా హాజరు కావటంలో భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రరెడ్డి తొలి స్థానంలో నిలిచారు. ఇక.. హైదరాబాద్ ఎంపీ మజ్లిస్ అధినేత అససుద్దీన్ ఓవైసీ 21 చర్చల్లో పాల్గొని అగ్రస్థానంలో నిలిచారు. ఇలా పార్టీలకు అతీతంగా తెలంగాణ ఎంపీలు వ్యవహరించిన వ్యహారశైలి ఇప్పుడు ఆకట్టుకుంటోంది.

హాజరు విషయానికి వస్తే.. కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి 100 శాతం హాజరుతో టాప్ లో నిలిస్తే.. ఆయన మొత్తం 79 ప్రశ్నలు అడిగారు. 17 చర్చల్లో పాల్గొన్నారు. 95శాతం హాజరుతో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఆయన మొత్తం 18 ప్రశ్నలు అడిగారు. ఆరు చర్చల్లో పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విషయానికి వస్తే.. ఆయన మొత్తం 80 ప్రశ్నలు అడిగి టాప్ లో నిలిచారు.మొత్తం 9 చర్చల్లో పాల్గొన్నారు. ఆయనహాజరు 91.17 శాతంగా ఉంది.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. కేంద్ర మంత్రులకు సంబంధించిన గణాంకాల్ని అందుబాటులో ఉంచలేదు. దీంతో.. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలైన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి.. బండి సంజయ్ లకు చెందిన హాజరు.. ప్రశ్నలు.. చర్చలు.. ప్రైవేటు మెంబరు బిల్లుల డేటాను వెల్లడించలేదు. ఇక.. కాంగ్రెస్ ఎంపీ రఘువీర్ రెడ్డి మూడు అంశాల్లో (హాజరు, ప్రశ్నలు అడగటం.. చర్చల్లో పాల్గొనటం) చివరి స్థానంలో నిలిచారు.

హాజరు విషయంలో 80 శాతం కంటే ఎక్కువగా ఉన్న తెలంగాణ ఎంపీలు ఎవరెవరంటే?

- రఘునందన్ రావు 97.05 శాతం

- కొండా విశ్వేశ్వర్ రెడ్డి 95.58 శాతం

- మల్లు రవి 92.64 శాతం

- అసదుద్దీన్ ఓవైసీ 92.64

- గూడెం నగేష్ 92.6 శాతం

- గడ్డం వంశీక్రిష్ణ 89.70 శాతం

- డీకే అరుణం 88.23 శాతం

- ధర్మపురి అరవింద్ 88.23 శాతం

- సురేష్ షెట్కర్ 86.73 శాతం

- రఘురామ్ రెడ్డి 85.29శాతం

- కడియం కావ్య 83.82 శాతం