అదుర్స్ అనేలా ప్రజాప్రతినిధుల ఆటపాటలు
నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు రాజకీయం చుట్టూనే వారుంటారు. అందులో భాగంగా రోజులో అత్యధిక భాగం కుటుంబం.. కుటుంబ సభ్యుల కంటే కూడా ప్రజలతోనే ఎక్కువగా ఉంటారు.
By: Garuda Media | 30 March 2026 12:07 PM ISTనిద్ర లేచింది మొదలు పడుకునే వరకు రాజకీయం చుట్టూనే వారుంటారు. అందులో భాగంగా రోజులో అత్యధిక భాగం కుటుంబం.. కుటుంబ సభ్యుల కంటే కూడా ప్రజలతోనే ఎక్కువగా ఉంటారు. అలాంటి వారి జీవితంలో రాజకీయ అంశాలు తప్పించి.. ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వలేని పరిస్థితి. అలాంటి ప్రజాప్రతినిధుల సాంస్క్రాతి వేడుకలు నిర్వహించటం ద్వారా.. ప్రజాప్రతినిధుల్లోని కళాకారుడు బయటకు రావటమే కాదు.. తస్సాదియ్యా.. అదరగొట్టేశాడయ్యా అన్నట్లుగా వారి తీరు ఉండటం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ప్రజాప్రతినిధులకు నిర్వహించిన క్రీడా.. సాంస్క్రతిక కార్యక్రమాలకు సంబంధించి.. ఆదివారం రాత్రి రవీంద్రభారతిలో నిర్వహించిన కల్చరల్ యాక్టివిటీస్ లో మంత్రులు మొదలు కొని ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు అదరగొట్టేశారు.
ధుర్యోధన ఏకపాత్రాభినయంతో మంత్రి వాకిటి శ్రీహరి అదరగొట్టేస్తే.. పొడుస్తున్న పొద్దు మీద.. అంటూ ప్రజాయుద్ధ నౌక దగ్గర్ ను అనుకిస్తూ వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ ఆకట్టుకుంటే.. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ అయితే సీనియర్ ఎన్టీఆర్.. శోభన్ బాబు.. రాంచరణ్ పాటలకు స్టెప్పులు వేయటమే కాదు.. అందరిని తన అభినయంతో అలరించిన వైనం ఆసక్తికరంగా సాగింది. ఎంత టాలెంట్? అన్నట్లుగా ప్రజాప్రతినిధుల తీరు ఉందని చెప్పాలి.
ఇక.. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అయితే కట్టప్పగా మోనో యాక్షన్ అదుర్స్ అనేలా సాగింది. తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు పాడిన పాటలు అందరికి ఆకట్టుకున్నాయి. జజ్జనక జనారే.. దచ్చన్న దారిలో అంటూ పాటలు పాడి అలరించారు. అశ్వారావుపేట పేట ఎమ్మెల్యే ఆదినారాయణ సైతం ఆదివాసీ గీతాల్ని అలపించి అలరించగా.. వైరా ఎమ్మెల్యేరామదాస్ మాలోత్ లంబాడా డ్యాన్సులు చేసి అందరిని ఆకట్టుకున్నారు. గోండి నృత్యాలతో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు అదరగొట్టారు. రోటీన్ కు భిన్నంగా తమలోని టాలెంట్ ను చూపించి అందరిని ఆకట్టుకున్నారు.
