Begin typing your search above and press return to search.

రోహిత్ శర్మ వికెట్ తీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. వైరల్

హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒకప్పుడు ప్రతిభావంతుడైన క్రికెటర్ అన్న విషయం చాలా మందికి తెలియదు.

By:  Tupaki Desk   |   14 May 2025 4:40 AM
రోహిత్ శర్మ వికెట్ తీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. వైరల్
X

హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒకప్పుడు ప్రతిభావంతుడైన క్రికెటర్ అన్న విషయం చాలా మందికి తెలియదు. ఆయన హైదరాబాద్ జట్టు తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడారు. ఇండియన్ క్రికెట్ లీగ్ (ICL) లో కూడా పాల్గొన్నారు. తన పాత రోజులను గుర్తు చేసుకుంటూ, కౌశిక్ రెడ్డి భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మ వికెట్ తీసిన ఒక జ్ఞాపకాన్ని తాజాగా పంచుకున్నారు. అదిప్పుడు వైరల్ అవుతోంది.

తాజాగా కౌశిక్ రెడ్డి ఒక పాత పేపర్ క్లిప్పింగ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఆ వార్త పత్రిక క్లిప్పింగ్ యొక్క హెడ్‌లైన్ "కౌశిక్ స్ట్రైక్స్ - రోహిత్ శర్మ ఔట్" అని ఉంది. ముంబైతో జరిగిన ఆ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో కౌశిక్ రెడ్డి 48 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టారు.

ఈ పేపర్ క్లిప్పింగ్‌ను షేర్ చేస్తూ కౌశిక్ రెడ్డి ఇలా రాసుకొచ్చాడు. "క్రికెట్ ఎల్లప్పుడూ నాలో ఒక తీవ్రమైన అభిరుచి. ఇటీవల కొన్ని పాత వార్తపత్రిక క్లిప్పింగ్‌లు నా కంట పడ్డాయి. అవి నాలో అలనాటి మధుర స్మృతులను రేకెత్తించాయి. ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మను నేను అవుట్ చేసిన క్షణం వాటిలో ఒకటి. అలాంటి క్షణాలు నిజంగా స్వర్ణతుల్యమైనవి." అని కౌశిక్ రెడ్డి ఏమోషనల్ అయ్యారు. ఇది షేర్ చేయడంతో సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తోంది.

"ఆ ప్రియమైన అనుభవాలను నేను నెమరువేసుకుంటున్నప్పుడు, ముంబైపై హైదరాబాద్‌కు చిరస్మరణీయ విజయాన్ని సాధించడంలో నేను పోషించిన కీలక పాత్రను ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నాను" అని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.

తన దేశీయ క్రికెట్ కెరీర్‌లో, కౌశిక్ రెడ్డి 15 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు.. 12 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడారు. ఆయన 2007 వరకు క్రికెట్‌లో చురుకుగా ఉన్నారు. 2018 నుండి ఆయన తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. ప్రస్తుతం ఆయన హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక క్రీడాకారుడిగా రాణించి, ప్రస్తుతం ప్రజా ప్రతినిధిగా సేవలందిస్తున్న కౌశిక్ రెడ్డి ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.