విజయశాంతికి నో.. కోమటిరెడ్డికి నై.. క్యాబినెట్ విస్తరణలో అనూహ్యం
అదేవిధంగా, ఎమ్మెల్సీగా ఉన్న అద్దంకి దయాకర్, సినీ నటి, మాజీ ఎంపీ అయిన విజయశాంతి పేర్లు కూడా మంత్రివర్గ అభ్యర్థుల్లో ప్రముఖంగా వినిపించినప్పటికీ, చివరకు వారికీ చోటు దక్కలేదు.
By: Tupaki Desk | 8 Jun 2025 11:00 AM ISTతెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అనేక మంది ఆశావహులకు నిరాశనే మిగిల్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కసరత్తులో పలువురు కీలక నేతలకు అవకాశం దక్కకపోవడం గమనార్హం. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలకు, అలాగే ఇతర ప్రముఖులకు మంత్రి పదవులు లభించలేదు.
రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రి పదవిని ఆశించిన వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి వంటి కీలక నేతలు ఉన్నారు. వీరి కలలు అర్ధంతరంగా ముగిశాయి. రాజకీయంగా చురుగ్గా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చిన నేపథ్యంలో ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని విస్తృతమైన ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, ఈ అంచనాలు తారుమారయ్యాయి.
అదేవిధంగా, ఎమ్మెల్సీగా ఉన్న అద్దంకి దయాకర్, సినీ నటి, మాజీ ఎంపీ అయిన విజయశాంతి పేర్లు కూడా మంత్రివర్గ అభ్యర్థుల్లో ప్రముఖంగా వినిపించినప్పటికీ, చివరకు వారికీ చోటు దక్కలేదు. పార్టీలో పటిష్టంగా ఉన్నప్పటికీ, మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఈ నేతల్లో అసంతృప్తి చెలరేగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌లతో అధిష్టానం విస్తృతంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది. ఈసారి ముగ్గురికి మాత్రమే అవకాశం ఇచ్చి, మిగతా మంత్రుల నియామకాన్ని తర్వాతి దశకు వాయిదా వేశారు. ప్రస్తుతం మంత్రివర్గంలో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే చీఫ్ విప్ పదవి కూడా ఖాళీగా ఉండటంతో, ఆ నియామకం కూడా త్వరలో జరిగే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి మంత్రులు లేకపోవడంతో వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్‌కుమార్‌కు అవకాశం ఇవ్వాలనే దిశగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
మంత్రివర్గ ఎంపిక ప్రక్రియలో ప్రాంతీయ సమతుల్యం, సామాజిక సామరస్యం, రాజకీయ లెక్కలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, ఈ నిర్ణయాలు కొందరు సీనియర్ నేతలకు నిరాశను కలిగించాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతానికి తెలంగాణ కేబినెట్ లో మరో మూడు ఖాళీల అలాగే వదిలేశారు. మంత్రివర్గంలో తదుపరి విస్తరణ జరిగే వరకు అవకాశం దక్కని నేతలు నిరీక్షణతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి అసంతృప్తులను సమర్థవంతంగా ఎదుర్కొని పార్టీలో ఐక్యతను కాపాడటం కాంగ్రెస్ నాయకత్వానికి ముందున్న పెద్ద సవాలుగా మారింది.
