మీరే పొడిచారు - మీరేం పీకారు: మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే!
అది బహిరంగ వేదిక. చుట్టు ప్రజలు ఉన్నారు. వీరితో పాటు మీడియా కెమెరాలు కూడా చూస్తున్నాయి.
By: Garuda Media | 27 April 2026 12:04 AM ISTఅది బహిరంగ వేదిక. చుట్టు ప్రజలు ఉన్నారు. వీరితో పాటు మీడియా కెమెరాలు కూడా చూస్తున్నాయి. ఆ సమయంలో ఎంతో హుందాగా వ్యవహరించాల్సిన మంత్రి.. అంతే హుందాగా వ్యవహరించాల్సిన మహిళా ఎమ్మెల్యే గాడి తప్పారు. చిన్న మాట పెద్దదైంది.. పెద్ద మాట పరుష వ్యాఖ్యలకు దారి తీసింది. కలెక్టరు, ఎస్పీ, జిల్లా ప్రజాప్రతినిధుల సమక్షంలోనే మీరు ఏం పొడిచారు..? అని మహిళా ఎమ్మెల్యే నిలదీయగా.. మీరేం పీకారు? అంటూ... సదరు మంత్రి నిలదీశారు. ఇద్దరి మధ్య వివాదం తారస్థాయికి చేరింది. కలెక్టరు, ఎస్పీ జోక్యం చేసుకున్నా.. ఆగలేదు. చివరకు ఆవేశకావేశాలతో ఇరువురు స్టేజీదిగి వెళ్లిపోయారు. దీంతో అసలు కార్యక్రమం అటకెక్కింది.
ఏం జరిగింది?
తెలంగాణలోని మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మంత్రి వివేక్ వెంకట స్వామి శనివారం సాయంత్రం పర్యటించారు.ఈ సందర్భంగా జిల్లాలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద చెక్కులు పంపిణీ చేసేందుకు లబ్ధిదారులను తీసుకువచ్చారు. ఇదేసమ యంలో బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. మంత్రి వేదిక ఎక్కిన ఐదు నిమిషాలకు బీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కూడా వేదిక ఎక్కారు. ఈ సమయంలో మంత్రి మాట్లాడేందుకు లేవగా.. ఆమె జోక్యం చేసుకున్నారు. ``మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. గుర్తుందా`` అని ఆమె ప్రశ్నించారు. దీంతో మంత్రి స్పందిస్తూ.. ``అన్నీ గుర్తున్నాయి. మీరు చేసిన వాగ్దానాలు.. మీరు ఇచ్చిన హామీలుకూడా గుర్తున్నాయి`` అని వ్యాఖ్యానించారు.
ఇలా ఒకరినొకరు రెచ్చగొట్టుకున్నారు. ఈ క్రమంలో మంత్రి వివేక్.. మాజీ సీఎం కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి.. మా నెత్తిన పెట్టిపోయారని.. వ్యాఖ్యానించారు. దీంతో సునీతా లక్ష్మారెడ్డి కూడా మీరు మాత్రం తక్కువ చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని.. చచ్చిపోయినా పట్టించుకునే తీరిక లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. వివేక్.. ``ఇదంతా మీవల్లే జరిగింది. ఆర్టీసిని కూడా అప్పుల్లో ముంచారు. మీ వల్లే ప్రజలు గోస పడుతున్నారు`` అంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో మీరేం పొడిచారు.. వచ్చి అని సునీత ప్రశ్నించగా.. పదేళ్లు అధికారంలో ఉండి మీరేం పీకారు? అంటూమంత్రి రివర్స్ అయ్యారు.
ఈ వివాదం నేపథ్యంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. ఇక, లబ్ధి దారులు ఏం జరుగుతుందో అనే బెంగతో బిక్కు బిక్కు మంటూ గడిపారు. వేదికపైనే ఉన్న కలెక్టర్ జోక్యం చేసుకుని వారించే ప్రయత్నం చేసినా.. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే ఎవరూ వెనక్కి తగ్గలేదు. దీంతో ఎస్పీ కూడా జోక్యం చేసుకున్నా.. పరిస్థితి చల్లబడలేదు. ఒక దశలో ఎమ్మెల్యేను అరెస్టు చేయొచ్చన్న ప్రచారం కూడా జరిగింది. కానీ, అలాంటిదేమీ లేకుండా..ఇరువురూ వేదిక దిగి చరచరా నడుస్తూ వెళ్లిపోయారు.
