ఆగమైన శాఖలన్నీ నాకే ఇచ్చారు.. తెలంగాణ మంత్రి ఆవేదన!
శ్రీహరి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అయినప్పటికీ ఆయన మంత్రి పదవి పొందారు. వాస్తవానికి శ్రీహరి క్యాబినెట్‌లో చోటు ఖాయమని మొదటినుంచి రేవంత్ చెబుతున్నారు.
By: Tupaki Desk | 7 July 2025 9:48 PM ISTప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా..తెలంగాణలో దాదాపు పదేళ్లు అధికారం అందుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి ఏడాదిన్నర కిందట జరిగిన ఎన్నికల్లో విజయదుందుభి మోగించింది. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, అప్పటినుంచి మంత్రివర్గ విస్తరణ లేదు. ఇప్పటికీ హైదరాబాద్, రంగారెడ్డి వంటి కీలక జిల్లాలకు, నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవులు దక్కనేలేదు. ఆదిలాబాద్ జిల్లాకు ఎట్టకేలకు ఇటీవలి విస్తరణలో చోటు లభించింది. కాగా, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్ ముఖ్యమంత్రిగా ఉండగా.. అదే జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావు మంత్రి పదవి పొందారు. తాజా విస్తరణలో మక్తల్ ఎమ్మెల్యే అయిన వాకిటి శ్రీహరికీ అమాత్య యోగం దక్కింది.
శ్రీహరి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అయినప్పటికీ ఆయన మంత్రి పదవి పొందారు. వాస్తవానికి శ్రీహరి క్యాబినెట్‌లో చోటు ఖాయమని మొదటినుంచి రేవంత్ చెబుతున్నారు. ఈ మాటను నిలబెట్టుకుంటూ చోటు కల్పించారు. ఆయనకు పశు సంవర్థక, మత్స్యశాఖ, యువజన సర్వీసుల పోర్ట్‌ఫోలియో ఇచ్చారు. కానీ, తనకు కేటాయించిన ఈ శాఖలపై మంత్రి వాకిటి శ్రీహరి అంత సంతృప్తిగా ఉన్నట్లు లేరు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు.
పదేళ్లలో (బీఆర్‌ఎస్ హయాంలో) ఆగం అయిన శాఖలను తనకు ఇచ్చారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీహరికి ఐదు శాఖలు ఇవ్వగా అన్నీ ఇలానే ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇది అదృష్టమో, దురదృష్టమో తెలియదని పేర్కొన్నారు. పశు సంవర్ధక శాఖ గందరగోళం.. గొర్రెలు, బర్రెలు ఇస్తే నేనేం చేసుకోవాలని అని అన్నారు. యువజన సర్వీసులు ఇస్తే ఏం చేసుకోవాలి? అని పేర్కొన్నారు. శ్రీహరి ఉద్దేశం తనకు వచ్చిన శాఖలు వివాదాలు ఉన్నవి, ఉపయోగం లేనివి అన్నట్లు ఉంది. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఉద్దేశిస్తూ.. పొన్నం అన్ననే న్యాయం చెప్పాలని కూడా కోరారు.
బీఆర్‌ఎస్ హయాంలో పశు సంవర్ధక శాఖలో గోల్‌మాల్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. గొర్రెల పెంపకం పథకంపై పెద్దెత్తున విమర్శలు వచ్చాయి. మత్స్య శాఖలో చేప పిల్లల పంపిణీ వంటి కార్యక్రమం చేపట్టినా అదీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు తావిచ్చింది. యువజన శాఖ పనితీరు కూడా సరిగా లేదనేవారు. కాగా, పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్-మత్స్యశాఖ, క్రీడా-యువజన శాఖలను చూస్తున్న శ్రీహరి అందుకనే తన ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, తెలంగాణ ప్రభుత‍్వ ప్రాధామ్యాల ప్రకారం యువజన శాఖ మంచిదే. సీఎం రేవంత్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ స్కూల్స్‌తో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మరి మంత్రి శ్రీహరి ఆవేదన మున్ముందు చల్లారుతుందేమో చూద్దాం.
