Begin typing your search above and press return to search.

11 చోట్ల వాయిదా.. ఏ పార్టీకి ఎన్ని కార్పొరేషన్లు? మున్సిపాలిటీలు?

ఎన్నికల ప్రక్రియ ముగిసిన 116 మున్సిపాలిటీలు.. 7 కార్పొరేషన్లకు సోమవారం మున్సిపల్ ఛైర్మన్లు.. మేయర్ల ఎన్నికల పూర్తైన సంగతి తెలిసిందే.

By:  Garuda Media   |   17 Feb 2026 1:37 PM IST
11 చోట్ల వాయిదా.. ఏ పార్టీకి ఎన్ని కార్పొరేషన్లు? మున్సిపాలిటీలు?
X

ఎన్నికల ప్రక్రియ ముగిసిన 116 మున్సిపాలిటీలు.. 7 కార్పొరేషన్లకు సోమవారం మున్సిపల్ ఛైర్మన్లు.. మేయర్ల ఎన్నికల పూర్తైన సంగతి తెలిసిందే. ఏడు కార్పొరేషన్లకు కొత్త మేయర్లు వచ్చేశారు. అదే సమయంలో 116 మున్సిపాలిటీలకు వివిధ కారణాలతో 11 చోట్ల ఛైర్మన్ ఎన్నిక జరగలేదు. ఈ ప్రక్రియ వాయిదా పడింది. మిగిలిన 105 మున్సిపాలిటీలకు ఛైర్మన్లు వచ్చేశారు. సోమవారం నాటికి డిసైడ్ అయిన మేయర్లు.. మున్సిపల్ ఛైర్మన్లలో ఏ పార్టీకి ఎన్ని దక్కాయి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.

మేయర్ల విషయానికి వస్తే మొత్తం 7 చోట్లలో ఐదు అధికార కాంగ్రెస్ కు సొంతం కాగా.. మిత్రపక్షం సీపీఐతో కలిసి కొత్తగూడెం కార్పొరేషన్ ను సొంతం చేసుకుంది. కరీంనగర్ లో కాషాయ జెండా ఎగిరింది. కార్పొరేషన్ల విషయానికి వస్తే పదేళ్లు తిరుగులేని అధికారాన్ని ప్రదర్శించిన బీఆర్ఎస్ కు ఒక్కటంటే ఒక్క మేయర్ పదవి దక్కని దుస్థితి. ఇదిలా ఉండగా.. 116 మున్సిపాలిటీల విషయానికి వస్తే.. పదకొండు చోట్ల ఛైర్మన్ పదవులకు జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగిలిన 105 మున్సిపాలిటీల్లో 81 మున్సిపాలిటీ ఛైర్మన్లుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు సొంతం చేసుకోగా.. బీఆర్ఎస్ 18 చోట్ల.. బీజేపీ ఒక చోట గెలుపొందాయి.

నాటకీయ పరిణామాల మధ్య నాలుగు చోట్ల స్వతంత్రులు ఛైర్మన్ స్థానాల్ని సొంతం చేసుకుంటే.. మరో చోట ఫార్వర్డ్ బ్లాక్ సొంతం చేసుకుంది. షాకింగ్ పరిణామం ఏమంటే.. ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో కండువా కప్పుకున్న వడ్డేపల్లి ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులు.. తమ పార్టీ తరఫునే ఛైర్మన్.. వైస్ ఛైర్మన్ పదవుల్ని చేపట్టటం గమనార్హం. కాంగ్రెస్ లో ఛైర్మన్ అభ్యర్థుల లెక్క తేలక మూడు చోట్ల.. రాజకీయ పార్టీల ఎత్తుగడలు.. ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో మరో ఎనిమిది చోట్ల ఎన్నిక వాయిదా పడింది.

మున్సిపల్ ఛైర్మన్ల స్థానాల్ని స్వతంత్రులు సొంతం చేసుకున్న మున్సిపాలిటీల విషయానికి వస్తే..

- భైంసా

- ఆదిలాబాద్

- జమ్మికుంట

- మహబూబాబాద్

మొత్తంగా చూస్తే 80 శాతం కార్పొరేషన్లు.. మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ సొంతం చేసుకున్నట్లైంది. భైంసా లాంటి మున్సిపాలిటీల్లో మజ్లిస్ అధిక్యత సాధించినప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి ఛైర్మన్ పదవిని ఎలా సొంతం చేసుకున్నారు? అదే విధంగా ఆదిలాబాద్ లో బీజేపీ ఎక్కువ స్థానాల్ని గెలుపొందింది. కానీ.. స్వతంత్ర అభ్యర్థి ఛైర్మన్ అయ్యారు. ఇలా ఎందుకు? అంటే..ఆయా పార్టీలు ఎక్కువ స్థానాల్ని సొంతం చేసుకున్నా.. ఛైర్మన్ అయ్యేందుకు అవసరమైన బలం లేకపోవటం.. ఎక్స్ అఫీషియో ఓట్లు, ఆయా పార్టీల రెబెల్స్ పుణ్యమా అని.. అందరికి ఆమోదయోగ్యమైన ఇండిపెండెంట్ అభ్యర్థిని మున్సిపల్ ఛైర్మన్లుగా ఎన్నుకున్న పరిస్థితి.

కాంగ్రెస్ కు సొంతమైన కార్పొరేషన్లు..

- నల్గొండ

- మంచిర్యాల

- రామగుండం

- మహబూబ్ నగర్

- నిజామాబాద్

- కొత్తగూడెం (ఒప్పందంలో భాగంగా తొలుత సీపీఐకు కేటాయించారు)

ఇక..కరీంనగర్ విషయానికి వస్తే బీజేపీ జెండా కార్పొరేషన్ మీద ఎగిరింది. బీజేపీ కార్పొరేటర్ మేయర్ కుర్చీలో కూర్చున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ ను నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఇక్కడ.. మొత్తం 60 మంది కార్పొరేటర్లలో బీజేపీకి 28 మంది కార్పొరేటర్లు ఉండగా. కాంగ్రెస్ కు 17, మజ్లిస్ కు 14 మంది కార్పొరేటర్లు.. బీఆర్ఎస్ కు ఒక్క కార్పొరేటర్ ఉన్నారు. ఇతన్ని కూడా కాంగ్రెస్ తన వైపునకు తిప్పుకుంది. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి బీజేపీకి అవకాశం ఇవ్వకుండా ఆ స్థానాన్ని సొంతం చేసుకోవటానికి వ్యూహాత్మకంగా వ్యవహరించి.. మేయరర్ స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది అధికార పక్షం.

అదేసమయంలో కరీంనగర్ లో మేయర్ స్థానాన్ని సొంతం చేసుకోవటానికి కాంగ్రెస్ పావులు కదపగా.. బీఆర్ఎస్ సభ్యులు తటస్థంగా ఉండాలని డిసైడ్ కావటంతో మేయర్ పీఠాన్ని బీజేపీ సొంతం చేసుకుంది. బండి సంజయ్ వ్యక్తిగతంగా తీసుకొని.. కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కార్పొరేటర్ కు దక్కేలా చేశారని చెప్పాలి. బండి సంజయ్ పర్సనల్ గా తీసుకోకుంటే.. ఈ స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ వశమై ఉండేది.