తెలంగాణ యువకుడి దీనగాథ: సౌదీలో దాడి, స్వదేశంలో మృతి!
వివరాళ్లోకి వెళ్తే... నూకలమర్రి గ్రామానికి చెందిన పెదవేణి రాజు(21) డిగ్రీ చదువుకుంటూనే గ్రామంలో డ్రెవర్ గా పని చేస్తుండేవారు.
By: Tupaki Desk | 11 July 2025 9:12 PM ISTజీవనోపాధి కోసం చాలామంది గల్ఫ్ దేశాలకు వెళ్తుండటం తెలిసిందే. అక్కడకు వెళ్లినవారిలో కొంతమంది జీవితం ఉన్నంతలో బాగానే ఉంటే.. మరికొంతమంది జీవితం మాత్రం ఎడారి దేశాల్లో నరకకూపంగా మారుతుంటుంది. ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా సౌదీ వెళ్లిన తెలంగాణ యువకుడు స్వదేశానికి తిరిగివచ్చి మృతి చెందాడు!
అవును... జీవనోపాధి కోసం తెలంగాణ యువకుడు ఒకరు సౌదీకి వెళ్లారు. ఈ క్రమంలో ఇటీవల అక్కడ యజమాని దాడి చేయడంతో.. తప్పించుకుని ఎలాగోలా స్వదేశానికి వచ్చాడు. అయితే... ఇక్కడికి రాగానే అస్వస్థతకు గురై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం నూకలమర్రికి చెందిన యువకుడి దీనగాథ ఇది!
వివరాళ్లోకి వెళ్తే... నూకలమర్రి గ్రామానికి చెందిన పెదవేణి రాజు(21) డిగ్రీ చదువుకుంటూనే గ్రామంలో డ్రెవర్ గా పని చేస్తుండేవారు. ఈ క్రమంలో తనకొచ్చిన డ్రైవర్ వృత్తికోసం గల్ఫ్ వెళ్లాలనుకున్నాడు. ఈ క్రమంలో కామారెడ్డికి చెందిన ఓ ఏజెంట్ ను రాజు సంప్రదించాడు. ఈ సమయంలో సౌదీలో డ్రైవింగ్ పని కోసం వీసాకు రూ.లక్ష చెల్లించాడు.
ఈ క్రమంలో... పది రోజుల క్రితం సౌదీ వెళ్లిన రాజుకు డ్రైవింగ్ పని దొరకలేదు సరికదా.. అతడితో గొర్రెలు మేపడం, ఎడారిలో కూలి పనులు చేయించడం చేశారు. దీంతో.. తాను డ్రైవింగ్ పనికోసం వచ్చానని అక్కడి యజమానిని రాజు ప్రశ్నించడంతో అతడు తీవ్రంగా దాడి చేశాడు. ఈ నేపథ్యంలో రాజు.. తన పరిస్థితిని తల్లిదండ్రులకు తెలపడంతో వారు ఏజెంట్ వద్దకు వెళ్లి ప్రశ్నించారు.
ఈ సమయంలో తమ కుమారుడిని ఇంటికి రప్పించాలని రాజు తల్లితండ్రులు ఏజెంట్ ని కోరారు. అయితే.. దీనికోసం రూ.1.20 లక్షలు ఇవ్వాలని ఏజెంట్ తెలిపాడు. దీంతో.. అప్పు చేసి అడిగిన డబ్బులు చెల్లించారు రాజు తల్లితండ్రులు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి రాజు హైదరాబాద్ కు చేరుకుని, తాండూరులోని బంధువుల ఇంటికి వెళ్లాడు.
ఈ క్రమంలో... రాజుకి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. దీంతో.. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి రాజు చికిత్స పొందుతూ మృతి చెందాడు. గురువారం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు.
తమ గ్రామం నుంచి గల్ఫ్ కంట్రీకి వెళ్లినరాజు రెండేళ్ల తర్వాత ఉన్నంతలో దర్జాగా తిరిగి వస్తాడని భావిస్తే.. ఇలా జరగడంతో స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. దీనిపై ఎస్సై అంజయ్యను సంప్రదించగా.. రాజుపై సౌదీలో దాడి చేసిన ఆధారాలు, యజమాని వివరాలు కుటుంబసభ్యులు చూపలేదని, తగిన ఆధారాలు చూపితే చర్యలు తీసుకుంటామని అన్నారు!
