Begin typing your search above and press return to search.

సరిహద్దుల్లో అవినీతి హుండీ.. ఒక్క రాత్రికి రూ.2.5 లక్షలు వసూళ్లు

తెలంగాణ-మహరాష్ట్ర సరిహద్దుల్లో రవాణాశాఖ నిర్వహిస్తున్న చెక్ పోస్టులు అవినీతి కేంద్రాలుగా మారాయని ఏసీబీ నిఘాలో వెల్లడైంది.

By:  Tupaki Desk   |   28 Jun 2025 10:59 AM IST
సరిహద్దుల్లో అవినీతి హుండీ.. ఒక్క రాత్రికి రూ.2.5 లక్షలు వసూళ్లు
X

తెలంగాణ-మహరాష్ట్ర సరిహద్దుల్లో రవాణాశాఖ నిర్వహిస్తున్న చెక్ పోస్టులు అవినీతి కేంద్రాలుగా మారాయని ఏసీబీ నిఘాలో వెల్లడైంది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు తెలంగాణ ఏసీబీ అధికారులు ప్రత్యేక నిఘా వేయడంతో రవాణా శాఖ అధికారుల వసూళ్ల దందా బయటపడింది. చెక్ పోస్టు పక్కనే ఒక షెడ్డులో ప్రైవేటు వ్యక్తులను ఉంచి లారీ డ్రైవర్ల నుంచి వసూళ్లు చేయిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం ఉపయోగించిన ప్రైవేటు వ్యక్తులకు ఒక రాత్రికి రూ.8 వేలు వేతనంగా చెల్లిస్తున్నారని ఏసీబీ అధికారులు గుర్తించారు. గురువారం రాత్రి లారీలను ఆపి డబ్బు వసూలు చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోగా, అతడి వద్ద రూ.8 వేల వేతనం, రూ.18,500 అదనపు నగదు గుర్తించారు. ఇలా ఒక రోజుకు రూ.2.5 లక్షలు ఆ చెక్ పోస్టులో వసూలు చేసినట్లు ఏసీబీ గుర్తించింది.

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని కామారెడ్డి జిల్లా సలాబత్పూర్ (మద్నూర్) గ్రామం వద్ద రవాణా శాఖ (ఆర్టీఏ) చెక్ పోస్టు ఉంది. ఈ చెక్ పోస్టులో ఓవర్ లోడింగుతోపాటు వాహన లైసెన్సులు, రవాణా పర్మిట్లను పరిశీలించాల్సివుంది. అయితే ఈ పని చేయాల్సిన ఉగ్యోగులు తమ విధినిర్వహణను కొందరు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించినట్లు ఏబీసీ గుర్తించింది. ఈ చెక్ పోస్టు వద్ద వసూళ్లు శ్రుతి మించడంతో కొందరు లారీ డ్రైవర్లు ఏసీబీకి సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. చెక్ పోస్టు వద్ద ఏసీబీ తనిఖీ చేసినప్పుడు పక్కనే ఉన్న ఒక షెడులో ఒక బాక్సు ఏర్పాటు చేశారు. చెక్ పోస్టు వద్దకు వచ్చిన ప్రతి లారీ డ్రైవర్ ఆ బాక్సులో రూ.వెయ్యి చొప్పున వేస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది.

ఇలా ఒక రాత్రిలో ఆ డబ్బా ద్వారా రూ.2.5 లక్షలు వసూలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. లారీలు ఆపడం, టార్చిలైటు సంకేతంగా చూపి డ్రైవర్ల వద్ద నుంచి డబ్బు వసూలు చేస్తున్న వ్యక్తికి రోజుకు రూ.8 వేలు ఇస్తున్నట్లు ఏసీబీ అధికారుల విచారణలో వెల్లడైందని అంటున్నారు. లారీ డ్రైవర్ల నుంచి వసూలు చేస్తున్న డబ్బును ప్రతి రెండు గంటలకు ఒకసారి తీసుకుని చెక్ పోస్టుకు దూరంగా ఉన్న మరో దళారీకి అప్పగిస్తున్నారు. ఎప్పుడైనా ఎవరైనా తనిఖీలకు వస్తే డబ్బాలో తక్కువ డబ్బు మాత్రమే ఉండేలా చేసిన ఏర్పాటే ఇది అని అంటున్నారు.

బుధవారం రాత్రి చెక్ పోస్టుకు వెళ్లిన ఏసీబీ అధికారులు అక్కడే మాటు వేసి రాత్రంతా అక్కడ జరుగుతున్న తంతంగాన్ని వీడియో రికార్డు చేశారు. సుమారు 8 గంటల్లో 150 లారీల నుంచి డబ్బు వసూలు చేసినట్లు చెబుతున్నారు. ఉదయం చెక్ పోస్టుకు వెళ్లిన ఏసీబీ రాత్రి నుంచి నిఘా వేసిన అంశాన్ని తెలిపి అక్రమంగా వసూలు చేసిన రూ.90 వేలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ అక్రమ దందా ఒక్క సలాబత్పూర్ చెక్ పోస్టులో మాత్రమే జరగడం లేదని, మరికొన్ని చెక్ పోస్టుల వద్ద ఇలాంటి అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని ఏసీబీ అనుమానిస్తోంది. దీంతో ప్రభుత్వానికి రోజుకు సుమారు రూ.20 లక్షలు నష్టం జరుగుతుందని అంటున్నారు. ఈ అక్రమ దందాలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.