తొలివిడుత 'స్థానిక' సన్నాహాలు ప్రారంభం
ఎంపీటీసీల నామినేషన్లను మండల కార్యాలయాలు, జడ్పీటీసీ నామినేషన్లను జిల్లా పరిషత్ కార్యాలయాల్లో స్వీకరిస్తారు.
By: Tupaki Desk | 9 Oct 2025 4:34 PM ISTస్థానిక ప్రజా ప్రతినిధుల పదవీ కాలం ముగిసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలి. కానీ ప్రత్యేక పరిస్థితుల వల్ల ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఎట్టకేలకు కోర్టులో బీసీ రిజర్వేషన్ పై క్లారిటీ వచ్చిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. చాలా కాలం పాటు కాచుకొని ఉన్న ఆశావహులు ఇక రెట్టింపు ఉత్సాహంతో రణరంగంలోకి దూకనున్నారు.
తొలివిడతలో 53 రెవెన్యూ డివిజన్లలోని 292 మండలాలకు..
తెలంగాణలో స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికల వేళ మొదలైంది. రాష్ట్రంలో రెండు విడతల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. తొలివిడతలో 53 రెవెన్యూ డివిజన్లలోని 292 మండలాల్లో, మొత్తం 292 జెడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ పోటీకి నామినేషన్ల స్వీకరణ ఈ రోజు (అక్టోబర్ 09) నుంచే స్వీకరించడం ప్రారంభమయ్యింది. పరిశీలన 12న జరుగుతుంది. ఉపసంహరణ గడువు 15వ తేదీ, మొదటి విడత పోలింగ్ 23వ తేదీ కాగా.. ఫలితాలు నవంబర్ 11న ప్రకటించబడతాయి.
నామినేషన్ల ప్రక్రియ
ఎంపీటీసీల నామినేషన్లను మండల కార్యాలయాలు, జడ్పీటీసీ నామినేషన్లను జిల్లా పరిషత్ కార్యాలయాల్లో స్వీకరిస్తారు. నోటిఫికేషన్ ప్రక్రియలో పారదర్శకత కోసం అందులో ప్రజల నమ్మకాన్ని పెంచడం ముఖ్యమని భావిస్తారు. తొలివిడుత నామినేషన్ల ప్రారంభంతోనే పార్టీలు, అభ్యర్థులు తమ వ్యూహాలను అమలు చేయడం మొదలుపెట్టారు.
కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన కమిషనర్..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ రాణీకుముదిని తెలంగాణలోని ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తొలివిడత ఎన్నికల నామినేషన్, పోలింగ్, ఇతర ఏర్పాట్లపై బుధవారం సమీక్ష నిర్వహించారు. అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. స్వేచ్ఛాయుతంగా శాంతిభద్రతలకు లోబడి ఎన్నికలు జరగాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఏ ప్రాంతంలోనైనా భద్రతకు విఘాతం కలగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎన్నికల నిర్వహణ
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అధికారులకు శిక్షణ ఇప్పటికే పూర్తయ్యింది. అధికారులు, పోలింగ్ సిబ్బంది సకాలంలో తాము చేపట్టాల్సిన బాధ్యతలను గురించి తెలుసుకున్నారు. నోటిఫికేషన్ల జారీ, అభ్యర్థుల నమోదు పోలింగ్ పద్ధతులు అన్నీ అమలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఎన్నికల సమగ్రతను, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ఏ విధమైన చర్యలు జరగకుండా చూడటం పాలనాధికారి విధి.
ప్రజాస్వామ్య పాఠం
స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం స్థానిక రాజకీయాల గురించి మాత్రమే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల నిబద్ధత, అవగాహన, పాలనా సమగ్రతను పరీక్షించే అవకాశమని చెప్పవచ్చు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడం, తొలివిడత పోలింగ్ సన్నాహాలు, భద్రతా చర్యలు ఇవన్నీ స్థానిక సంస్థల వైవిధ్యాన్ని, ప్రజా విశ్వాసాన్ని వివరిస్తాయి.
