Begin typing your search above and press return to search.

మూడు పార్టీల‌కు ముచ్చ‌టైన తీర్పు.. ప్ర‌జా నాడి ఇదే!

తెలంగాణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల తీర్పు.. చాలా వ్యూహాత్మ‌కంగా ఉంది. ప్ర‌జ‌లు ఏ పార్టీని అమాంతంగా ఎత్తి నెత్తిన పెట్టుకోలేదు.

By:  Garuda Media   |   13 Feb 2026 11:02 PM IST
మూడు పార్టీల‌కు ముచ్చ‌టైన తీర్పు.. ప్ర‌జా నాడి ఇదే!
X

తెలంగాణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల తీర్పు.. చాలా వ్యూహాత్మ‌కంగా ఉంది. ప్ర‌జ‌లు ఏ పార్టీని అమాంతంగా ఎత్తి నెత్తిన పెట్టుకోలేదు. అలాగ‌ని ఏ పార్టీనీ విసిరి కొట్టలేదు. అంతేకాదు.. కొన్ని కొన్ని చోట్ల ఇండిపెండ్ల‌ను కూడా గెలిపించ‌డం ద్వారా.. మంచి నేత‌ల‌కు త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని తేల్చి చెప్పారు. ఇదేస‌మ‌యంలో తాము త‌ప్ప దిక్కులేద‌ని భావించిన పార్టీల‌కు కూడా.. స‌రైన విధంగా గుణ‌పాఠం నేర్పారనే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

వాస్త‌వానికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఆది నుంచి కూడా.. ప్ర‌జ‌లంతా త‌మ‌తోనే ఉన్నార‌ని.. త‌మ సుప‌రిపాల‌న‌కు, ఇందిర‌మ్మ పాల‌న‌కు ప్ర‌జ‌లు ప‌క్కాగా దండ‌లు వేసి.. భారీ విజ‌యం అందిస్తార‌ని ఆశిం చారు. నిజ‌మే.. ప్ర‌జ‌లు అందించారు కూడా. కానీ, ఎంత వ‌ర‌కు అంటే.. కొంత వ‌ర‌కే. ఎంత వ‌ర‌కు అధికార పార్టీని గౌర‌వించాలో అంత‌వ‌ర‌కు గౌర‌వించారు. ప్ర‌తిప‌క్ష పార్టీల‌తో పోల్చుకునేంత వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం చేశారు. 116 మునిసిపాలిటీల్లో కాంగ్రెస్‌కు ఏక‌ప‌క్షంగా ఎక్క‌డా విజ‌యం ద‌క్క‌లేదు. అలాగ‌ని ఆ పార్టీని ప‌క్క‌న కూడా పెట్ట‌లేదు.

ఇది కాంగ్రెస్ ను ప‌ట్టుకోల్పోకుండా.. ప్ర‌జ‌ల కోసం మ‌రింత శ్ర‌మించేలా చేసింద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక‌, ఇంకేముంది.. బీఆర్ ఎస్ ప‌ని అయిపోయింది... అనుకునే వారికి కూడా ప్ర‌జ‌లు బ‌ల‌మైన తీర్పు ఇచ్చారు. ఆ పార్టీని కూడా ఎంత వ‌ర‌కు విజ‌య తీరాల‌కు చేర్చాలో అక్క‌డి వ‌రకు తీసుకువెళ్లారు. ఏక‌ప‌క్షంగా ఈ పార్టిని కూడా ప్ర‌జ‌లు నెత్తిన పెట్టుకోలేదు. ఇక‌, ముచ్చ‌ట‌గా మూడో పార్టీ బీజేపీ.. ఈ పార్టీకి అస‌లు తెలంగాణ‌లో స్థాన‌మే లేద‌న్న వాద‌న‌ను ప్ర‌జ‌లు తుడిచిపెట్టారు. క‌రీంన‌గ‌ర్ వంటి చోట్ల బ‌ల‌మైన శ‌క్తిగా ఎదిగేందుకు అవ‌కాశం ఉంద‌న్న వాద‌న‌ను బ‌ల‌ప‌రిచారు.

నిజానికి ఈ ఎన్నికల్లో పార్టీలు గెలిచాయా? ప్ర‌జ‌లు గెలిచారా? అనే చ‌ర్చ వ‌స్తే.. ఈ ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా ప్ర‌జ‌లే గెలిచార‌ని చెప్ప‌క‌త్ప‌దు. ఎన్ని తాయిలాలు పంచినా.. ఎన్ని హామీలు గుప్పించినా.. ఆయా పార్టీల విష‌యంలో జాగ‌రూక‌త‌తోనే ప్ర‌జ‌లు వ్య‌వ‌హ‌రించారు. అదేస‌మ‌యంలో కొత్త‌గా పుట్టిన క‌విత పార్టీ(ఇంకా పేరు లేదు)తోపాటు.. స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌ను కూడా గెలిపించ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల‌కు రాజ‌కీయ శోయి ఎప్పుడూ ఉంటుంద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. సో.. మొత్తంగా చూస్తే.. రాజ‌కీయంగా ప్ర‌జ‌ల‌దే పైచేయి అయింది.