మద్యం దుకాణాలకు నోటిఫికేషన్.. నాన్ రిఫండబుల్ అమౌంట్ పెంచిన ప్రభుత్వం..!
ప్రభుత్వం మద్యం దుకాణాలపై సామాజిక న్యాయం సూత్రాన్ని అమలు చేస్తూ, గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించింది.
By: Tupaki Desk | 25 Sept 2025 5:53 PM ISTతెలంగాణలో వైన్స్ షాపుల కేటాయింపునకు టెండర్లు పిలవనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వచ్చిన వైన్స్ నేటి వరకు కొనసాగాయి. వాటి లైసెన్స్ గడువు తీరడంతో మళ్లీ కేటాయింపు ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో మద్యం ప్రియులు ఎక్కువ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పండుగలు, శుభకార్యాలలో మధ్యం ఉండాల్సిందే. చుక్క, ముక్క తెలంగాణ స్పెషల్. దీన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రభుత్వం ప్రతి సంవత్సరం టెండర్ల రూపంలో కోట్లాది రూపాయలు ఖాజనాలో నింపుకుంటుంది.
రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణ ప్రభుత్వం తాజాగా మద్యం దుకాణాల కేటాయింపునకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2,620 షాపులు ఉండగా.. రేపటి (సెప్టెంబర్ 26) నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 18 దరఖాస్తుల తుది గడువైతే, అక్టోబర్ 23న డ్రా ద్వారా షాపుల కేటాయింపు జరగనుంది. డిసెంబర్ 1 నుంచి కొత్త లైసెన్సులు అమల్లోకి వచ్చి, 2027 నవంబర్ 30 వరకు కొనసాగుతాయి. ఒక్కో షాపు టెండర్ ఫీజు రూ. 3 లక్షలు నాన్ రిఫండబుల్‌గా నిర్ణయించడం గమనార్హం.
గౌడ కులస్తులకు 15 శాతం..
ప్రభుత్వం మద్యం దుకాణాలపై సామాజిక న్యాయం సూత్రాన్ని అమలు చేస్తూ, గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఇది కొంత మేరకు వెనుకబడిన వర్గాలకు ఆర్థిక అవకాశాలను కల్పించినా.. మద్యం వ్యాపారం ద్వారా వారిని ఆధారపడేలా చేయడం సరికాదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ లైసెన్సుల కేటాయింపు రాష్ట్ర ఖజానాకు వేల కోట్లు తెచ్చిపెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
దుకాణాల సంఖ్య పెంచనుందా..?
ప్రభుత్వం ఒకవైపు మద్యపానాన్ని నిరుత్సాహపరుస్తున్నట్లు చెబుతూనే, మరోవైపు అధిక ఆదాయ ఆశతో దుకాణాల సంఖ్య పెంచడం విరుద్ధ ధోరణి. ఈ నేపధ్యంలో ప్రజా ఆరోగ్యం, ఆర్థిక సమతుల్యత రెండింటినీ దృష్టిలో ఉంచి సమగ్రమైన మద్యం విధానం రూపొందించాల్సిన అవసరం మరింత స్పష్టమవుతోంది.
