Begin typing your search above and press return to search.

సిరిసిల్ల మందుబాబుల కిక్కు ఎక్కించే లేఖ.. షాక్ తిన్న కలెక్టర్!

అందుకే ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. లేఖలో సారాంశం చదివిన తర్వాత అధికారులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   26 May 2026 6:00 PM IST
సిరిసిల్ల మందుబాబుల కిక్కు ఎక్కించే లేఖ.. షాక్ తిన్న కలెక్టర్!
X

సాధారణంగా జిల్లా కలెక్టర్ ఆఫీసులకు ఎలాంటి వినతులు వస్తుంటాయి? అయ్యా.. మాకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు రాలేదనో, రుణాలు ఇప్పించి ఆర్థికంగా ఆదుకోవాలనో కోరుతుంటారు. అదే సామాజిక సమస్య అయితే మా ఊరికి రోడ్డు వేయించండి అంటూ వినతులిస్తారు. పోడు భూముల సమస్య తీర్చండనే అర్జీలు చూస్తుంటాం. కానీ, తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు వచ్చిన ఒక వినతి పత్రం ఈ అంశాలు అన్నింటికి భిన్నం. అందుకే ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. లేఖలో సారాంశం చదివిన తర్వాత అధికారులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.

ఆ లేఖలో ఏం ఉందంటే..?

జూన్ 2 తర్వాత రాష్ట్రంలో లిక్కర్ ధరలు పెరుగుతాయని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వార్తలతో ఆందోళన చెందుతున్న మద్యం ప్రియులు వినూత్న ఆలోచన చేశారు. ‘ఇప్పటికే జేబులు ఖాళీ అవుతున్నాయి.. ఇక ధరలు పెంచితే మా పరిస్థితి ఏంటి?’ అని లోలోపల మదనపడిపోవడమే కాకుండా, తమ ఆందోళన ప్రభుత్వం దృష్టికి తెలియజేయాలని భావించారని అంటున్నారు. దీంతో ధరలు పెంచొద్దని ప్రాధేయపడుతూ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ కు లేఖ రాయాలని కొందరు మందుబాబులు డిసైడ్ అయ్యారు. ‘ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర ఇప్పటికే లిక్కర్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ ధరలు పెంచితే మేం ఆ ఆర్థిక భారాన్ని మోయలేం. కాబట్టి పెంచబోయే ధరల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా, రేట్లను యథాతథంగా ఉంచేలా ప్రభుత్వాన్ని కోరాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని కొందరు మందుబాబులు నేరుగా కలెక్టర్ కు లేఖ రాశారు.

నెట్టింట నవ్వుల పూత!

ఏటా బడ్జెట్‌లోనో, కొత్త పాలసీల్లోనో మద్యం ధరలు పెరగడం.. మందుబాబులు వైన్ షాపుల దగ్గర ‘తాగేవాడి బాధ ఎవరికి తెలుసు’ అంటూ డైలాగులు చెప్పడం కామనే. కానీ, ఇలా వ్యవస్థీకృతంగా ఒక లేఖ రాసి, కలెక్టర్‌కే అర్జీ పెట్టడం మాత్రం ఇదే మొదటిసారి కాబోలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ లేఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే విపరీతంగా వైరల్ అయ్యింది. మీమ్స్ క్రియేటర్లకు ఫుల్ మేత దొరికినట్లయింది. ‘మందుబాబుల ఐక్యత వర్ధిల్లాలి’ అని కొందరు, ‘సమస్య ఏదైనా.. పోరాటం మాత్రం వెరైటీగా ఉండాలి’ అని మరికొందరు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా, కలెక్టర్ ఆఫీస్ చరిత్రలోనే ఈ ‘లిక్కర్ లెటర్’ ఒక క్రేజీ రికార్డుగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానిస్తున్నారు.