ఐసీఐసీఐ రుణంపై క్లారిటీ.. ఏం చేశారో చెప్పిన శ్రీధర్ బాబు
నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ఊరంతా వ్యాపిస్తుందన్న సామెతకు తగ్గట్లే రేవంత్ సర్కారు హయాంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
By: Tupaki Desk | 13 April 2025 12:02 PM ISTనిజం నిద్ర లేచేసరికి అబద్ధం ఊరంతా వ్యాపిస్తుందన్న సామెతకు తగ్గట్లే రేవంత్ సర్కారు హయాంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని తనకా పెట్టి ఐసీఐసీఐ బ్యాంక్ వద్ద భారీగా రుణం తీసుకున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అదే సమయంలో కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో భారీ ఎత్తున పర్యావరణ విధ్వంసం జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై మంత్రి శ్రీధర్ బాబు రంగంలోకి దిగారు. అసలేం జరిగింది? అన్న అంశాలపై వివరంగా మాట్లాడారు.
ఆయన మాటలు విన్న తర్వాత.. ఇదే పనిని వారం ముందే చేసి ఉంటే.. ఇష్యూ ఇంతవరకు వచ్చేది కాదన్న భావన కలుగక మానదు. ఇంతకూ మంత్రి శ్రీధర్ బాబు వాదనలు ప్రస్తావించిన అంశాల్లో ముఖ్యమైనవి చూస్తే..
- ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి ఎలాంటి రుణం తీసుకోలేదు. ఆర్ బీఐ నిబంధనలు పాటించకుండా రూ.10వేల కోట్లు తెచ్చామంటూ కేటీఆర్ ఆరోపించారు. ఎవరైనా బాండ్ల విక్రయం ద్వారా నిధులు సేకరిస్తే నిబంధనలకు విరుద్దం అవుతుందా?
- బాండ్లను టీజీఐఐసీ జారీ చేసింది. సెబీ నిబంధనలకు అనుగుణంగా వాటిని వేలం వేశారు. 37 కంపెనీలు పెట్టుబడులు పెట్టటానికి ఐసీఐసీఐ బ్యాంకులో నిధులు జమ చేశారు. అలాంటప్పుడు ఆ బ్యాంకు ఇచ్చిన రుణాలు ఎలా అవుతాయి?విదేశీ పెట్టుబడిదారులు కూడా ఈ బాండ్లను కొన్నారు.
- రూ.10 వేల కోట్లు ఎటుపోయాయని కేటీఆర్ అడుగుతున్నారు. మేం రూ.8476 కోట్లు సేకరించాం. వాటికి కొంత కలిపి రుణమాఫీకి రూ.2146 కోట్లు.. రైతు భరోసాకు రూ.5463 కోట్లు, సన్నబియ్యం బోనస్ చెల్లింపులకు రూ.947 కోట్లు ఖర్చు చేశాం.
- రైతుల సంక్షేమానికి ఖర్చు చేశాం. అలా చేయమంటారా? వద్దా? అన్నది బీఆర్ఎస్ నేతలు చెప్పాలి. మేం 9.35 శాతం వడ్డీతో నిధులు సేకరించాం. కానీ.. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 10.9 శాతానికి రుణాన్ని తీసుకుంది.
- పారదర్శకంగా టెండర్లు పిలిచి సెబీలో రిజిస్టర్ అయిన ట్రస్ట్ ఇన్వెస్ట్ మెంట్.. అడ్వయిజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను మర్చంట్ బ్యాంకర్ గా నియమించాం. ఈ సంస్థకు నిబంధనల ప్రకారం ప్రొపెషనల్ ట్యాక్స్ చెల్లిస్తే కేటీఆర్ తప్పు పడుతున్నారు. గడిచిన బీఆర్ఎస్ పాలనలో అదే సంస్థకు రూ.10 కోట్ల మొత్తాన్ని ప్రొఫెషనల్ రేసుముగా చెల్లించారు.
- బీఆర్ఎస్ నియమించిన సంస్థకే మేం అదే పద్దతిలో రుసుం చెల్లించి బాండ్ల విక్రయం ద్వారా మా ప్రభుత్వం నిధులు సేకరిస్తే తప్పు ఎలా అవుతుంది?
- కంచె గచ్చిబౌలి భూములపైనా ఏఐతో తప్పుడు ఫోటోలు.. వీడియోలతో ప్రచారం చేశారు. వైజాగ్ లో ఒకరి ఇంటి ముందుకు వచ్చిన వన్యప్రాణిని కంచ గచ్చిబౌలిలో వచ్చినట్లుగా బోగస్ చిత్రాల్ని తయారు చేవారు.
- తొమ్మిదేళ్ల క్రితం రాజస్థాన్ లో చనిపోయిన జింకను ఈ భూముల్లో చనిపోయినట్లుగా యానిమేటెడ్ చిత్రాన్ని రూపొందించారు. ఏనుగు ఉన్నట్లు చూపారు. అసలు సెంట్రల్ వర్సిటీ ప్రాంతంలో ఏనుగు ఉంటుందా?
- ఏనుగులు వెళుతుంటే వాటి వెనుక ప్రొక్లెయిన్లు వస్తున్నట్లు ఏఐతో ఫోటోలు రూపొందించారు.
- రూ.5200 కోట్ల విలువైన భూమిని రూ.30వేల కోట్ల విలువైనదిగా ప్రభుత్వం చూపినట్లుగా కేటీఆర్ అంటున్నారు. సీబీఆర్ఐ అనే అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సంస్థ ఈ భూముల విలువ రూ.20,563 కోట్లుగా నిర్దారించింది.
- పట్టా పాసుపుస్తకాలు లేకుండా వర్సిటీ భూములను టీజీఐఐసీకి ఎలా మార్చారని కేటీఆర్ అంటున్నారు. టీజీఐఐసీకి భూములు ఇచ్చినా పాసుపుస్తకాలు ఇవ్వరు. బీఆర్ఎస్ పాలనలో ఫార్మా సిటీ కోసమని రెవెన్యూ శాఖ నుంచి టీజీఐఐసీకి 6400 ఎకరాలను కేటాయించారు. అప్పుడు వాటికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారా?
- బీఆర్ఎస్ పాలనలో 11422 హెక్టార్ల అటవీ భూమిని ఇతర అవసరాలకు మళ్లించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 21,591 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఉంది. 2019 నాటికి అది 21,213చదరపు కిలోమీటర్లకు ఎందుకు తగ్గింది?
- హరితహారం పేరుతో రూ.9770.24 కోట్ల ఖర్చు పెట్టి మొక్కలు నాటితే అటవీ ప్రాంతం ఎందుకు తగ్గింది?
- హెచ్ సీయూ భూముల్లో పరిశ్రమలు తెచ్చి లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని మేం చూస్తున్నాం. సచివాలయం నిర్మించినప్పుడు 207 ప్రధాన చెట్లను నరికేశారు. వాటిలో ఒకదానినైనా మరోచోటికి ఎందుకు తరలించలేదు? అప్పుడు పర్యావరణం దెబ్బతినలేదా?
