కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకు సర్కారు అఫిడవిట్.. ఏం చెప్పిందంటే?
తీవ్ర సంచలనంగా మారటంతో పాటు.. రోజుల వ్యవధిలో సుప్రీంకోర్టు సైతం ఈ అంశం మీద ఫోకస చేయటం తెలిసిందే.
By: Tupaki Desk | 15 April 2025 10:49 AM ISTతీవ్ర సంచలనంగా మారటంతో పాటు.. రోజుల వ్యవధిలో సుప్రీంకోర్టు సైతం ఈ అంశం మీద ఫోకస చేయటం తెలిసిందే. అంతేకాదు.. ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసి.. దాని సంగతేమిటో తేల్చాలని కోరింది. అవును..ఇదంతా కంచె గచ్చిబౌలికి చెందిన 400 ఎకరాల భూమికి సంబంధించిన అంశం. దీనిపై తాజాగా సుప్రీంకోర్టుకు తన వాదనను అఫిడవిట్ రూపంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసింది. అందులో కంచగచ్చిబౌలి భూములు అడవి ఎంతమాత్రం కాదని.. ఎప్పుడూ అటవీ రికార్డుల్లో లేవని స్పష్టం చేసింది.
వివిధ ప్రభుత్వ అవసరాల కోసం రాష్ట్ర ప్రబుత్వం బుల్డోజర్ల ద్వారా భూమిని చదును చేయటం వివాదాస్పదంగా మారటం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్ గవాయి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును సుమోటోగా విచారించి.. వెంటనే అక్కడి కార్యకలాపాలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే. అంతేకాదు.. ఐదు అంశాల్ని ప్రస్తావిస్తూ ఈ నెల 16 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది.
సుప్రీం కోరిన 5 అంశాలు ఏమిటంటే..
1. అటవీ భూమిగా చెబుతున్న ప్రాంతంలో చెట్లను కొట్టేయటంతో పాటు.. ఇతరత్రా డెవలప్ మెంట్ కార్యకలాపాలు చేపట్టాల్సిన అత్యవసర పరిస్థితి ఏమొచ్చింది?
2. రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న అభివ్రద్ధి కార్యకలాపాలకు పర్యావరణ ప్రభావ మదింపు ధ్రువపత్రం ఉందా?
3. చెట్ల నరికివేతకు అటవీ.. ఇతర స్థానిక చట్టాల కింద అవసరమైన అనుమతులు ఉన్నాయా?
4. సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలో అటవీ ప్రాంతాల గుర్తింపు అంశాలతో సంబంధం లేని అధికారులను ఎందుకు నియమించారు?
5. ఇప్పటివరకు కొట్టేసిన చెట్లను ప్రభుత్వం ఏం చేసింది?
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో కంచె గచ్చిబౌలి భూములు అటవీ ప్రాంతం పరిధిలోకి రావని స్పష్టం చేయటంతో పాటు.. ఇప్పుడే కాదు గతంలో ఎప్పుడూ కూడా ఈ భూముల్ని అటవీ ప్రాంతంగా లేవని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి చూస్తే..
- అది ఎప్పుడూ అటవీ భూమిగా లేదు. పూర్తిగా ప్రభుత్వ భూమి.
- రెండు దశాబ్దాలుగా న్యాయవివాదం కొనసాగటంతో ఖాళీగా వదిలేయటంతో చెట్లు పెరిగాయి.
- ప్రభుత్వ కార్యకలాపాల విస్తరణకు ఇది ఉత్తమమైన ప్రాంతం.
- ఈ భూమిపై వివాదం లేదు.
- ప్రభుత్వం డెవలప్ చేస్తే పెట్టుబడులను ఆకర్షించి వేగంగా ఉద్యోగాల స్రష్టికి వీలవుతుంది.
- ఈ భూమి ఓపెన్ గా ఉండటంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జంతువులు వచ్చి పోతున్నాయి.
- సెంట్రల్ వర్సిటీ.. ఇదీ కలిపి ఉన్న 2 వేల ఎకరాల్లో జంతువులు తిరుగుతుంటాయి. అంతే తప్పించి వీటికి అవాసం లేదు.
- ఇక్కడ డెవలప్ మెంట్ కార్యక్రమాల్ని చేపట్టిన తర్వాత వాటికి ఇబ్బంది కలగకుండాచర్యలు చేపడతాం.
- ఇక్కడ కొట్టేసిన చెట్లు నిషేధిత విభాగంలోకి రావు. అవసరమైన వాటి కోసం ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి మొక్కలు పెంచుతాం.
