Begin typing your search above and press return to search.

తెలంగాణలో ఐదేళ్లలో వచ్చిన కొలువులు ఇంత భారీగా?

ఆసక్తికర లెక్కలు వెలుగు చూశాయి. తెలంగాణ రాష్ట్రం కొలువులకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది.

By:  Garuda Media   |   7 April 2026 11:03 AM IST
తెలంగాణలో ఐదేళ్లలో వచ్చిన కొలువులు ఇంత భారీగా?
X

ఆసక్తికర లెక్కలు వెలుగు చూశాయి. తెలంగాణ రాష్ట్రం కొలువులకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఐటీ కొలువులు మాత్రమే కాదు.. పారిశ్రామిక రంగాల విస్తరణతో పాటు.. కొత్త సంస్థలు కొలువు తీరటంతో పాటు.. సేవా రంగం భారీ ఎత్తున విస్తరిస్తున్న వేళ.. ఉపాధి కల్పనలో తెలంగాణ రాష్ట్రం దూసుకెళుతోంది. కాకి లెక్కలు కాకుండా.. ఉద్యోగులు ఎవరైనా సరే.. ఈపీఎఫ్ వో వద్ద నమోదయ్యే గణాంకాల ప్రకారం చూస్తే.. ఆశ్చర్యానికి గురి చేసే గణంకాలు తెర మీదకు వచ్చాయి.

గడిచిన ఎనిమిది నెలల విషయాన్నే తీసుకుంటే.. దాదాపు 3.12 లక్షల మంది తొలిసారి ఉద్యోగాల్లో చేరినట్లుగా వెల్లడైంది. ఈ కొలువుల్లో అధిక నైపుణ్యం ఉన్న ఉద్యోగాలు మాత్రమే కాదు.. మధ్యస్థాయి కొలువులు సైతం గణనీయంగా పెరిగిన విషయం వెల్లడైంది. ఈ పెరిగిన కొలువుల్లో కీలకభూమిక పోషించింది మాత్రం హైదరాబాద్.. రంగారెడ్డి జిల్లాలే అని చెప్పాలి. ఈపీఎఫ్ వో గణాంకాల్ని పరిశీలిస్తే రాష్ట్రవ్యాప్తంగా 55.42 లక్షల మంది పని చేస్తున్నట్లు తేలింది. ఇందులో ఒక్క హైదరాబాద్.. రంగారెడ్డి జిల్లాల్లోనే 42.8 లక్షల మంది ఉండటం గమనార్హం. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 31.39 లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలోని అత్యధిక ప్రాంతం ఈ రెండు జిల్లాల్లోనే ఉందన్న సంగతి తెలిసిందే.

గడిచిన ఐదేళ్లలో దాదాపు 7.23 లక్షల మంది కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చారు. రంగారెడ్డి జిల్లాలో 4 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. అదే సమయంలో నిజామాబాద్.. ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రం ఉద్యోగుల సంఖ్య కాస్త తగ్గింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు మధ్యకాలం) కొత్తగా వచ్చిన ఉద్యోగాలు భారీగా వచ్చాయి. గడిచిన ఐదేళ్లలో వచ్చిన ఉద్యోగాల్లో దాదాపు 30 శాతానికి పైనే ఉండటం ఆసక్తికరంగా మారింది. ఇదంతా చూస్తే.. హైదరాబాద్ కొలువులకు నెలవుగా మారటమే కాదు.. మహానగర స్థాయి ఏమిటన్న విషయాన్ని చెప్పకనే చెప్పేస్తుందని చెప్పాలి.