తెలంగాణ జాగృతి కార్యాలయం ప్రారంభం.. కేసీఆర్‌కే చోటు!
తాజాగా ప్రారంభించిన కార్యాలయంలో కేవలం ''తెలంగాణ జాగృతి'' అనే పేరును మాత్రమే పేర్కొన్నారు.
By: Tupaki Desk | 31 May 2025 11:55 PM ISTబీఆర్ ఎస్ నాయకురాలు.. ఎమ్మెల్సీ కవిత.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో రెండు అంతస్థుల తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని తాజాగా ప్రారంభించారు. అయితే.. ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటోలు, విగ్రహాలను పరిశీలిస్తే.. ఏదో చాలా పదునైన వ్యూహంతోనే కవిత అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. దీనికి కారణం.. ఒక్క కేసీఆర్ ఫొటోలు తప్ప.. పార్టీకి చెందిన ప్రముఖుల ఫొటోలుఏవీకూడా దీనిలో కనిపించలేదు.
అంతేకాదు.. కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ ఎస్ జెండాలు కూడా ఎక్కడా కనిపించలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు ఎంతో కీలకమైన స్థానం ఉన్నప్పటికీ.. ఆయన ఫొటో(కేటీఆర్) కూడా ఎక్కడా కనిపించలేదు. అదేవిధంగా పార్టీ మరోనాయకుడు హరీష్ రావు ఫొటోకానీ.. స్థానిక నేతల ఫొటోలు కానీ.. ఎక్కడా కనిపించలేదు. తన ఫొటోతో పాటు.. కేసీఆర్ ఫొటోను మాత్రమే తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేశారు.
అంతేకాదు.. గతంలో ''తెలంగాణ జాగృతి-బీఆర్ ఎస్ మహిళా విభాగం'' అనే పేర్కొన్న పరిస్థితి ఉంది. కానీ.. తాజాగా ప్రారంభించిన కార్యాలయంలో కేవలం ''తెలంగాణ జాగృతి'' అనే పేరును మాత్రమే పేర్కొన్నారు. కార్యాలయంలో కింది పోర్షన్ ప్రారంభంలో మాత్రం తెలంగాణ తల్లి నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికి కుడి, ఎడమ పక్కల ప్రొఫెసర్ జయశంకర్, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, జ్యోతిబా ఫూలే, ఆయన సతీమణి సావిత్రి బాయి ఫూలే విగ్రహాలను ఏర్పాటు చేశారు.
అదేవిధంగా అమర వీరుల స్థూపాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. దీనిని బట్టి కవిత చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. గతంలో జాగృతి జిల్లా కార్యాలయాల్లో కేటీఆర్ ఫొటో కూడా ఉండేది. కానీ.. తాజా కార్యాలయంలో మాత్రం కేసీఆర్ ఫొటోకు మాత్రమే పరిమితమయ్యారు.
