11 హంగ్ లోనూ హస్తానిదే హవా.. అదెలానంటే?
కాంగ్రెస్ చేతికి వచ్చిన ఎనిమిది మున్సిపాలిటీలను చూస్తే పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.
By: Garuda Media | 18 Feb 2026 10:41 AM ISTఇటీవల ఫలితాలు వెల్లడైన కార్పొరేషన్లు.. మున్సిపాలిటీల్లో హంగ్ ఫలితం ఏర్పడి.. ఎటూ తేలకుండా ఉండిపోయిన హంగ్ మున్సిపాలిటీల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ అదరగొట్టింది. మొత్తం 11 మున్సిపాలిటీల్లో 7 మున్సిపాలిటీలను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. దీంతో మొత్తం మేయర్.. ఛైర్ పర్సన్ పదవుల సంఖ్య 93కు పెరిగింది. వీటితో పాటు కొత్తగూడెంలో సీపీఐతో జత కట్టి అధికారాన్ని షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే.
ఏ పార్టీకి మెజార్టీ రాక.. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో పార్టీల విధాన వ్యతిరేకతల్ని పక్కన పెట్టి.. స్థానిక అంశాలకు ప్రాధాన్యతను ఇవ్వటం ద్వారా.. అధికారాన్ని హస్తగతం చేసుకోవటం కనిపిస్తుంది. ఇలా మంగళవారం కాంగ్రెస్ చేతికి వచ్చిన మున్సిపాలిటీల్లో..
జనగామ
తొర్రూరు
కాగజ్ నగర్
సుల్తానాబాద్
జహీరాబాద్
డోర్నకల్
ఇల్లెందు
కాంగ్రెస్ చేతికి వచ్చిన ఎనిమిది మున్సిపాలిటీలను చూస్తే పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. కాగజ్ నగర్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య కుదిరిన అవగాహనతో ఛైర్ పర్సన్ పదవి కాంగ్రెస్ కు దక్కింది. ఇక్కడున్న మొత్తం 30 వార్డుల్లో బీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 9, బీజేపీ ఐదు, మజ్లిస్ ఒకటి గెలుచుకోగా.. నలుగురు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థుల్లో ముగ్గురు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తే.. ఒకరు బీఆర్ఎస్ కు బాసటగా నిలిచారు. ఒకరు ఎవరికి మద్దతు ఇవ్వనని స్పష్టం చేశారు. నలుగురు ఇండిపెండెంట్లలో చెరో ఇద్దరుకాంగ్రెస్, బీఆర్ఎస్ పక్షాన నిలిచారు. మజ్లిస్ అభ్యర్థి మద్దతుతో బీఆర్ఎస్ బలం 15కు చేరుకుంది. అయితే.. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే హరీశ్ బాబు కాంగ్రెస్ ఎమ్మెల్సీ విఠల్ ఎక్స్ అఫీషియో ఓట్లు కాంగ్రెస్ కు పడటంతో మొత్తం 16 ఓట్లకు చేరి ఛైర్ పర్సన్ పదవి కాంగ్రెస్ సొంతమైంది. అదే సమయంలో వైస్ ఛైర్ పర్సన్ పదవి మాత్రం అనూహ్య రీతిలో బీఆర్ఎస్ కు సొంతమైంది.
జనగామ.. తొర్రూరు ఎన్నికల్లో అధికారం కోసం హోరాహోరీగా పోరు సాగినా చివరకు కాంగ్రెస్ కు సొంతమయ్యాయి. బలాలు సమానంగా ఉండటంతో అధికారులు డ్రా తీయగా.. కాంగ్రెస్ కు అద్రష్టం వరించింది. తొర్రూరులోనూ బలాలు సమానం కావటంతో లాటరీ వేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ కు అద్రష్టం వరించింది. జహీరాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు బీజేపీ మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ కు మజ్లిస్ మద్దతుగా నిలిచింది. చివరకు ఎంపీ సురేష్ వేసిన ఎక్స్ అఫీషియో ఓటుతో కాంగ్రెస్ ఛైర్ పర్సన్ పదవిని సొంతం చేసుకుంది.
క్యాతనపల్లిలో బీఆర్ఎస్ తో సీపీఐ జత కట్టి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిలిచింది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డుల్లో బీఆర్ఎస్ కు 10, కాంగ్రెస్ కు 7, సీపీఐకు నాలుగు స్థానాలు దక్కాయి. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి నెగ్గారు. సీపీఐ మద్దతు బీఆర్ఎస్ బలం పద్నాలుగుకు పెరిగింది. కాంగ్రెస్ ఇండిపెండెంట్ అభ్యర్థి మద్తు..ఎమ్మెల్యే ఎంపీ ఎక్స్ అఫీషియో ఓట్ల బలం 10కు చేరింది. ఎన్నిక కోసం అన్ని పార్టీల వారు హాజరైనా తీవ్ర రభస జరగటంతో మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నికను వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా సంగారెడ్డి ఇంద్రేశం మున్సిపాలిటీ మాత్రం బీఆర్ఎస్ సొంతం చేసుకుంది.
