గవర్నర్ బడ్జెట్ ప్రసంగం: తెలుగులో ప్రారంభించి.. తెలుగులో ముగించి!
తెలంగాణ గవర్నర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీనియర్ రాజకీయ నేత, విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి.. శివప్రతాప్ శుక్లా..
By: Garuda Media | 16 March 2026 3:40 PM ISTతెలంగాణ గవర్నర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీనియర్ రాజకీయ నేత, విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి.. శివప్రతాప్ శుక్లా.. తన ప్రమాణ స్వీకారాన్ని ఎలా అయితే.. తెలుగులో చేశారో.. తాజాగా తెలంగాణ బడ్జెట్ సమావేశాలను కూడా తెలుగులోనే ప్రారంభించారు. తొలిరోజు బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన 1.22 గంటల పాటు ఆయన ప్రసంగించారు.
తొలుత.. శాంతికాముకులైన శ్రమించే తత్వం ఉన్న తెలంగాణ ప్రజలు.. అంటూ ఆయన తన ప్రసంగా న్ని ప్రారంభించారు. చివరిలోనూ తెలుగులోనే తన ప్రసంగాన్ని ముగిస్తూ.. ధన్యవాదాలు తెలిపారు. ఇక, తన ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా చేస్తున్న అభివృద్ధిపనులు.. సమాజంలో వచ్చిన మార్పులు, పెట్టుబడులు.. ప్రజలకు ఒనగూరుతున్న ప్రయోజనాలను వివరించారు. అదే సమయంలో ఆరు గ్యారెంటీలను కూడా తన ప్రసంగంలో పేర్కొన్నారు.
సంక్షేమ పథకాల నుంచి ఇటీవల కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల వరకు కూడా.. గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ముఖ్యంగా `మహాలక్ష్మి` పథకాన్ని ఆయన హైలెట్ చేశారు. ఈ పథకం కింద.. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు.. 9,200 కోట్ల రూపాయలను ఆదా చేసుకున్నారని వివరించారు. ఇదే అతి పెద్ద సంక్షేమ పథకమని వివరించారు.
ఇక, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర పథకాలను కూడా ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా `రైజింగ్ తెలంగాణ` ను కూడా ప్రస్తావించారు. వచ్చే 2047 నాటికి రాస్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మారుస్తామని చెప్పారు. దీనికి సంబంధించి రోడ్ మ్యాప్‌ను రెడీ చేసుకున్నట్టు వివరించారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4.18లక్షలకు చేరిందన్న ఆయన... `క్యూర్, ప్యూర్, రేర్` మోడల్ ద్వారా రాష్ట్రాభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు.
