దశాబ్దకాల నిరీక్షణకు తెర.. 2014-2023 సినిమాలకు త్వరలో అవార్డులు.. జ్యూరీ ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరు మీదుగా తొలిసారిగా ప్రకటించిన 'గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు' సినీ పరిశ్రమలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
By: Tupaki Desk | 29 May 2025 1:38 PM ISTతెలంగాణ ప్రభుత్వం దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరు మీదుగా తొలిసారిగా ప్రకటించిన 'గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు' సినీ పరిశ్రమలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇప్పటికే 2024 సంవత్సరానికి గాను 'కల్కి 2898 ఏడీ' బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే, చాలా కాలంగా ఎదురుచూస్తున్న 2014 నుంచి 2023 వరకు విడుదలైన చిత్రాలకు సంబంధించిన అవార్డుల ప్రకటనపై తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) ఛైర్మన్ దిల్ రాజు కీలక ప్రకటన చేశారు.
గద్దర్ అవార్డుల జ్యూరీ కమిటీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న సీనియర్ నటి జయసుధ మీడియాతో మాట్లాడుతూ.. అవార్డుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు. ఎటువంటి ఒత్తిడులు లేకుండా, కేవలం ప్రతిభ ఆధారంగానే విజేతలను ఎంపిక చేశామని ఆమె అన్నారు. "ప్రభుత్వం నుంచి చలన చిత్ర పురస్కారాలు అందుకోవడం నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఎంతో ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది" అని జయసుధ అభిప్రాయపడ్డారు. ఈ అవార్డులు సినీ రంగానికి మరింత ఉత్తేజాన్ని ఇస్తాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు అందిస్తున్న ఈ ప్రోత్సాహం అభినందనీయమని అన్నారు. 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభుత్వం సినీ పురస్కారాలను ప్రకటించడం ఒక శుభ పరిణామమని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి 2023 వరకు విడుదలైన చిత్రాలకు సంబంధించిన అవార్డుల జాబితాను కూడా త్వరలోనే వెల్లడిస్తామని దిల్ రాజు ప్రకటించారు. "2014 నుంచి 2023 మధ్య కాలంలో విడుదలైన సినిమాలకు కూడా అవార్డులను ఒకట్రెండు రోజుల్లో జ్యూరీ ప్రకటిస్తుంది. దీనికి సంబంధించిన పనులు చివరి దశలో ఉన్నాయి" అని ఆయన తెలిపారు. ఈ ప్రకటనతో దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న సినీ ప్రముఖులకు ఊరట లభించినట్లయింది.
తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించడం ద్వారా కేవలం కళాకారులను సత్కరించడమే కాకుండా, రాష్ట్రంలో సినీ రంగానికి ఒక నూతన దిశను, ప్రోత్సాహాన్ని అందించినట్లవుతుంది. ఈ అవార్డులు నూతన తరం ప్రతిభను గుర్తించడానికి, ప్రాంతీయ చిత్రాలకు ప్రోత్సాహం అందించడానికి, తద్వారా తెలుగు సినిమా వైవిధ్యాన్ని పెంచడానికి దోహదపడతాయి. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ పురస్కారాలు సినీ పరిశ్రమలో పండుగ వాతావరణాన్ని సృష్టించాయి. రాబోయే రోజుల్లో మిగిలిన విభాగాల విజేతలను కూడా ప్రకటించడంతో గద్దర్ అవార్డుల సందడి మరింత పెరుగుతుంది.
